నా జీవితాన్ని, నా దేహాన్ని, నా ఆలోచనలను, నా వాక్కును
నేను నీ పవిత్ర చరణాల వద్ద సమర్పించాను.
ఎందుకంటే అవి నీవి; ఎందుకంటే అవి నీవే.
– పరమహంస యోగానంద
వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో సన్యాస జీవితంలో నాలుగు దశలు ఉన్నాయి. ఈ సమర్పిత జీవితం, సన్యాస దీక్ష స్వీకరించే సమయంలో వారు చేసిన ప్రమాణాల పట్ల వారి నిబద్ధతను క్రమంగా లోతుగా పెంచడానికి ఈ జీవనశైలి ఉపకరిస్తుంది. ఈ దశలకు నిర్దిష్టమైన గడువు ఏమీ ఉండదు. అది ఎల్లప్పుడూ వ్యక్తిగత ప్రాతిపదికన పరిగణించబడుతుంది. సన్యాస జీవితానికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకోవడానికి ఆ పరిత్యాగి యొక్క సంసిద్ధత, సాధనలను బట్టి ప్రతి సన్యాసి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి ఆధారపడి ఉంటుంది.
జూనియర్ (ఆరంభ) ప్రవేశార్థి
సన్యాస దీక్షను స్వీకరించాలనుకునేవారు మొదటి దశలో, జూనియర్ ప్రవేశార్థిగా నియమించబడతారు. సాధారణంగా ఇది మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. జూనియర్ ప్రవేశార్థులు సన్యాస దినచర్యను అనుసరిస్తారు. ఇందులో సామూహిక, వ్యక్తిగత ధ్యానం, అభ్యర్థించిన వారి కోసం ప్రార్థించడం, భక్తి పఠనం, ఆధ్యాత్మిక అధ్యయనం, ఆత్మపరిశీలన, వినోదం, సేవ ఇలా ఎవరికి నిర్దేశించిన పనులు వారికి ఉంటాయి.
ప్రవేశార్థుల కోసం సన్యాస కార్యక్రమం కోరుకునే వారికి సన్యాసుల ఆదర్శాలు, జీవన విధానం గురించి పూర్తి అవగాహన కల్పించడానికి ఇది రూపొందించబడింది. ప్రవేశార్థికి తన ఆధ్యాత్మిక జీవితాన్ని మరియు భగవంతునితో, గురువుతో సామరస్యతను పెంచుకోవడంలో అతనికి సహాయపడే వైఖరులు, అలవాట్లను పెంపొందించుకోవడంలో సహాయం చేయడమే ఇందులో ప్రధానమైన విషయం. సన్యాస జీవితం యొక్క ఈ మొదటి దశ పరిత్యాగికి సన్యాస మార్గాన్ని స్వీకరించాలనే తన కోరిక యొక్క లోతును తనకు తానుగా అంచనా వేయడానికి ఈ దశ సహాయపడుతుంది. అదే సమయంలో ఈ పరిత్యాగి యొక్క ఆధ్యాత్మిక సంక్షేమానికి బాధ్యత వహించే, మార్గదర్శనం చేసే గురువులకు సైతం ఈయన ఆధ్యాత్మిక ఉన్నతిని గురించి ఎప్పటికప్పుడు లోతైన అవగాహన ఏర్పడేందుకు దోహదపడుతుంది.
సీనియర్ ప్రవేశార్థి
జూనియర్ ప్రవేశార్థి దశ ముగిసే సమయానికి, ప్రవేశార్థి మరియు అతని మార్గదర్శకులు ఇరువురూ ఆయన ఆశ్రమ జీవితానికి బాగా సరిపోతారని నిశ్చయించుకుంటే, ప్రవేశార్థిని సీనియర్ ప్రవేశార్థి కార్యక్రమంలో చేరమని ఆహ్వానిస్తారు. సీనియర్ ప్రవేశార్థి కాలంలో, ఆ పరిత్యాగి తాను జూనియర్ ప్రవేశార్థి దశలో నేర్చుకున్న సూత్రాలను అన్వయించడం ద్వారా సన్యాస శిష్యత్వంపై తనకు పెరుగుతున్న అవగాహనను ప్రదర్శించాల్సి ఉంటుంది. సంస్థకు తానందించే సేవలో తాను మరింత బాధ్యతను వహించే అవకాశం కూడా అతనికి ఇవ్వబడుతుంది.
బ్రహ్మచర్యం
కొన్ని సంవత్సరాల తర్వాత, సీనియర్ ప్రవేశార్థి తన జీవితాన్ని పూర్తిగా భగవదన్వేషణకు, సేవకు అంకితం చేయాలనే కోరికను, సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లయితే, అతను బ్రహ్మచర్య ప్రమాణం చేయడానికి ఆహ్వానించబడతాడు. (బ్రహ్మచర్యమనేది ఒక సంస్కృత పదం. ఇది ఆత్మతో స్వీయ ఐక్యతను సాధించే ఉద్దేశ్యంతో ఒకరి ఆలోచనలు మరియు చర్యల యొక్క క్రమశిక్షణ మరియు స్వీయ నియంత్రణను సూచిస్తుంది.) ఈ ప్రతిజ్ఞ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆశ్రమాలలో సన్యాసిగా ఉండాలనే శిష్యుని తీవ్రమైన ఆకాంక్షను సూచిస్తుంది. బ్రహ్మచర్యాన్ని స్వీకరించిన సన్యాసి తాను చేసిన ప్రమాణాల ప్రకారం నిరాడంబరతను, బ్రహ్మచర్యాన్ని, విధేయతను, విశ్వాసాన్ని జీవితాంతం పాటించాల్సి ఉంటుంది.
ఈ ప్రతిజ్ఞ తీసుకున్న తరువాత, ఒక సన్యాసిని బ్రహ్మచారి అని పిలుస్తారు. చట్టబద్ధమైన పేరు తొలగించబడుతుంది. ఒక నిర్దిష్ట ఆధ్యాత్మిక ఆదర్శం లేదా అతను సాధించాలనుకుంటున్న గుణాన్ని సూచించే సంస్కృత నామం అతనికి ఇవ్వబడుతుంది. దాంతో ఆ బ్రహ్మచారికి ఆశ్రమంలో మరింత ఎక్కువ బాధ్యతను స్వీకరించే అవకాశం లభిస్తుంది. భక్తి కార్యక్రమాలను నిర్వహించడానికి శిక్షణనివ్వడం, ప్రత్యేక కార్యక్రమాలను స్వీకరించడం, సన్యాసులకు ఆధ్యాత్మికంగా మార్గనిర్దేశం చేసే వారి మార్గనిర్దేశంలో ఇతర కార్యాలలో సేవలందించటం వంటివి చెయ్యాల్సి ఉంటుంది.
సన్యాసము
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క సన్యాసిగా నిష్ఠతో జీవిస్తానని, ఆయన చేసిన ప్రతిజ్ఞ భగవంతుడు, గురువు, పరమగురువులు మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పట్ల, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆదర్శాల పట్ల వారి జీవితకాల నిబద్ధతను యోగదా సత్సంగ సన్యాసుల ఆఖరి ప్రమాణం సూచిస్తుంది. భగవంతుని కోసం మాత్రమే జీవించడానికి మరియు యోగదా సత్సంగ మార్గం ద్వారా ఆయనకు సేవ చేయడానికి బేషరతుగా అంకితభావం మరియు విధేయతతో జీవించడానికి తన అన్ని కోరికలను పక్కన పెట్టడానికి సన్యాసుల ఆత్మ యొక్క అంతర్గత సంకల్పాన్ని ఇది సూచిస్తుంది. కొన్ని సంవత్సరాల పాటు సన్యాస జీవితం గడిపిన తర్వాత, బ్రహ్మచారిలు ఈ చివరి ప్రమాణాన్ని పూర్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తమకు, తమ ఉన్నతాధికారులకు నిరూపించుకున్న తర్వాత మాత్రమే ఈ చివరి ప్రమాణం, సన్యాస వ్రతం బ్రహ్మచారులకు ఇవ్వబడుతుంది. భారతదేశంలోని ప్రాచీన యోగి పరంపరలోని సభ్యుల నిర్దేశం ప్రకారమే ఈ ప్రమాణం ఉంటుంది.
సన్యాసి, తన జీవితాంతం, పూర్తి అంకితభావంతో, తాను దైవికంగా ఉండటానికి, సన్యాసిగా పరిపూర్ణతను పొందటానికి, సేవకు, అన్నింటికంటే ప్రధానంగా భగవంతునిపై ప్రేమ కోసం మరింత శ్రద్ధతో ప్రయత్నిస్తాడు. పరమహంస యోగానందగారి బోధనలు, సమాజం యొక్క ఉన్నత ఆదర్శాలకు ఒక సజీవ సాక్ష్యంగా నిలచే పవిత్ర బాధ్యతను సన్యాసి స్వీకరిస్తాడు. తానే ఉదాహరణగా నిలవడం ద్వారా, భగవదన్వేషణకై ఇతరులను ప్రేరేపించడం, ప్రోత్సహించడం చేస్తాడు.
పరమహంస యోగానందగారి ఆశ్రమాలలో స్వీయ-అభివృద్ధి, ధ్యానం మరియు మానవాళికి సేవ చేయడానికి అంకితమైన జీవితాన్ని గడపడానికి అవకాశం గురించి మరింత తెలుసుకోవడానికి, మమ్మల్ని సంప్రదించవలసిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.