ప్రియతములారా,
2011 నుండి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు సంఘమాత అయిన శ్రీ మృణాళినీమాత, 2017 ఆగస్టు 3న ప్రశాంతంగా ఈ ప్రపంచం నుండి నిష్క్రమించారు. ఆమె మరణం మనకు తీరని లోటు. అయినాకానీ, అమితానందంతో గురుదేవులు ఆమెకు స్వాగతం పలికి, తన నమ్మకాన్ని నెరవేర్చిన ఆమె స్వామి భక్తికి ఆయన తన దివ్యమైన ప్రేమను, ఆశీస్సులను ఆమెకు ప్రసాదించినందుకు, ఆమె దివ్య లోకాల్లో ఇప్పుడు అనుభవిస్తున్న ఆనందాన్ని, స్వేచ్ఛను భగ్నపరిచే ఎటువంటి సంతాపాన్ని వ్యక్తపరచాలనుకోవడం లేదు. ఆయన బోధనలకు, అందించిన మార్గదర్శకత్వానికి ఆమె ఒక స్వచ్ఛమైన సాధనము. ఎందుకంటే, గత జన్మల నుండీ తన శిష్యురాలిగా ఆమె యొక్క ఉన్నత ఆధ్యాత్మిక పురోగతి, ఇంకా భగవంతుణ్ణి, గురువును ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే తపిస్తూ, తనను తాను పక్కన పెట్టుకునే జ్ఞానం, వినయం ఆమెకున్నాయని ఆయనకి తెలుసు.
మన గురుదేవులు శ్రీ పరమహంస యోగానంద వంటి మహాత్ములు ఒక విశ్వకార్యం కోసం భూమిపై అవతరించినప్పుడు, భగవంతుడు తరచుగా వారి పనిలో సహాయపడటానికి వెనకటి సన్నిహిత శిష్యులను ఆయన వద్దకు ఆకర్షిస్తాడు. మృణాళినీమాత ఖచ్చితంగా ఆ కోవకు చెందుతారు. మొదటిసారి మృణాళినీమాతను కేవలం పద్నాలుగేళ్ళ వయసులో కలుసుకున్నప్పటి నుండే, పవిత్ర శాస్త్రమైన క్రియాయోగ వ్యాప్తిలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని భగవంతుడు మరియు మహాత్ములచే నియుక్తమైన గురుదేవులు గుర్తించారు.
తాను బోధించిన, దైవికంగా వెల్లడైన సత్యాల అంతరంగంలోకి చొచ్చుకుపోయి, తన జ్ఞానం యొక్క శక్తి మరియు ప్రామాణికతతో వాటిని ముద్రించగల స్వచ్ఛత మరియు లోతైన అవగాహన, ఈ నిర్మలమైన, బిడియముగల పసి యువతిలో గురుదేవులు చూశారు. తన ఆదర్శాలకు, మార్గనిర్దేశానికి పూర్ణ హృదయంతో విశ్వసనీయ౦గా ఉ౦డే సామర్థ్య౦ ఆమెకు ఉ౦దని ఆయన గ్రహి౦చారు – తన భావమునుండి ప్రక్కదోవ పట్టక, దాని మూల తత్త్వమును ఆమె ఒడిసి పడుతుందని ఆయనకు తెలుసు కనుక, ఈ శిష్యురాలికి తన అమూల్యమైన ప్రేరణారత్నాలకు సానపెట్టే పనిని అప్పగించారు. తన రచనలను ప్రచురణకు సిద్ధం చేసే ముఖ్యమైన పనిలో తారామాతకు వారసురాలిగా చెయ్యడానికి, ఆమెకు చాలా శ్రద్ధతో వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చారు, అలాగే ఆ పని కోసం ఆమె మనస్సు, బుద్ది, ఆత్మలను అంకితం చేశారు. గురుదేవుల బోధనలను ఆచరించే మనమందరం, ఇంకా రాబోవు తరాల భక్తులందరూ, గురుదేవులతో ఆమెకున్న పవిత్రమైన అనుసంధానం, ఆయన దివ్యజ్ఞాన సంపదను మనకు అందించిన ఆమె దశాబ్దాల నిస్వార్థ కృషికి బదులుగా శాశ్వత కృతజ్ఞతతో రుణపడి ఉంటాం.
గురుదేవుల విశాల చైతన్యంలో నెలకొన్న అవగాహనతో మృణాళినీమాతగారు, ఆయన ఆశ్రమాలలో గడిపిన అనేక సంవత్సరాల కాలంలో చాలా పాత్రలను పోషించారు. గురుదేవుల రచనలకు సంపాదకత్వం వహించే తన జీవితకాల బాధ్యతతో పాటు, అనేక సంవత్సరాలపాటు ఉపాధ్యక్షురాలిగా, పాశ్చాత్యదేశాలలో, భారతదేశంలో గురుదేవుల కార్యాచరణ పురోభివృద్ధికి తోడ్పాటులో శ్రీ దయామాతతో కలిసి పనిచేశారు. ఆమె హృదయంలో గురుదేవుల మాతృభూమి కోసం ఒక ప్రత్యేక స్థానం నెలకొని ఉంది మరియు ఆయన కార్యాచరణ అక్కడ పురోభివృద్ధి చెందడం చూసి సంతోషించేవారు. శ్రీ దయామాత మరణానంతరం ఆమె వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షురాలైనప్పుడు, ఏ విధంగా దయామాతగారు “నాకు ఏమి కావాలి అని కాక, గురుదేవులు ఏమి కోరుకుంటున్నారు” అని వ్యక్తం చేసినట్లు, అదే స్ఫూర్తితో మృణాళినీమాత గురుదేవుల సంస్థకు మార్గనిర్దేశం చేశారు. వీరి ఉదాహరణతో ఈ పవిత్ర కార్యానికి గురుదేవులే బాధ్యత వహిస్తున్నారనే మార్పులేని సత్యాన్ని ధృవీకరించారు, మరియు అది ఎప్పుడూ అలాగే ఉంటుంది.
మనల్ని ప్రేరేపించిన వారి జీవితాలు, ఆధ్యాత్మిక౦గా ఎదిగే౦దుకు సహాయ౦ చేసి, మన ఆత్మలపై శాశ్వతమైన ముద్రను వేశాయి. భగవంతునిపట్ల, గురుదేవుల పట్ల అచంచలమైన భక్తితో, గురుదేవుల రచనలకు ఆమె చేసిన కృషి ద్వారా, ఆయన ఆధ్యాత్మిక కుటుంబం పట్ల ఆమెకున్న ప్రగాఢమైన శ్రద్ధ ద్వారా మన ప్రియతమ మృణాళినీమాత ఎప్పటికీ మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మన ప్రేమను, కృతజ్ఞతను, ప్రార్థనలను ఆమెకు ప౦పి౦చడ౦లో మన౦ ఏకమైనపుడు, ఆమె మన తలంపులను స్వీకరిస్తారు, దేవుని వెలుగులో, ఆన౦ద౦లో మన౦ తిరిగి మళ్ళీ కలుసుకు౦టాము. గురుదేవుల ఉపదేశాలలోని సత్యాలను, మన జీవితాల్లో సజీవ, పరివర్తనాశక్తిగా, మారేంత వరకు ఉత్సాహంతో, విధేయతతో, మనం చేసే ప్రయత్నాలే ఆమెకు మన శాశ్వత నివాళిగా ఉండుగాక. గురుదేవుల పాదాల వద్ద ఉంచిన అటువంటి బహుమతే, ఆమె ఆత్మను మరింతగా స్పృశించే కృతజ్ఞతాపూర్వక వ్యక్తీకరణ.
సదా మీ దివ్యస్నేహంలో,
స్వామి అచలానంద, ఉపాధ్యక్షులు
వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. బోర్డు యొక్క డైరెక్టర్ల కోసం