22 మార్చి, 2017, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా 100వ వార్షికోత్సవం.
శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాంచీలో మార్చి 19-23 తేదీలలో జరిగిన ఐదు రోజుల కార్యక్రమంలో దాదాపు 1,500 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పరమహంసగారు బోధించిన ధ్యాన శాస్త్రం మరియు ఆధ్యాత్మిక జీవనం యొక్క “జీవించడం ఎలా” అనే సూత్రాలపై తరగతుల శ్రేణి, ప్రతి ఉదయం మరియు సాయంత్రం ప్రతిరోజు సమూహ ధ్యానాలు, కీర్తన పఠనం మరియు ప్రాచీన క్రియాయోగ శాస్త్ర దీక్షలు ఉన్నాయి.
వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. యొక్క సీనియర్ సన్యాసులు మార్చి 19న వై.ఎస్.ఎస్. శతాబ్ది ఉత్సవాల ప్రారంభ ప్రార్థనలో సమావేశమైన భక్తులకు నాయకత్వం వహించారు.
వై.ఎస్.ఎస్. 1917లో పశ్చిమ బెంగాల్‌లోని దిహికా గ్రామంలో బాలుర కోసం ఒక చిన్న ఆశ్రమం మరియు పాఠశాలగా ప్రారంభమయింది. ఒక సంవత్సరం తర్వాత పరమహంసగారు మరియు ఆయన విద్యార్థులు రాంచీకి (ప్రస్తుతం ఝార్ఖండ్ రాష్ట్ర రాజధాని) వెళ్ళారు, అక్కడ ఆయన ఆశ్రమాన్ని స్థాపించారు, అది నేడు అభివృద్ధి చెందుతున్న ఆధ్యాత్మిక సమాజానికి కేంద్రంగా పనిచేస్తుంది. పరమహంసగారు స్థాపించిన వై.ఎస్.ఎస్., నేడు సన్యాసుల సారథ్యంలో భారతదేశం అంతటా వేలాది మంది సాధారణ సభ్యులు మరియు వందలాది ధ్యాన బృందాలు కలిగి ఉంది.
1920లో పరమహంసగారు, తన గురువుల శ్రేణి ఆదేశానుసారం, యునైటెడ్ స్టేట్స్కు యోగ శాస్త్రాన్ని తీసుకువచ్చారు, అక్కడ ఆయన తన బోధనలు ప్రపంచ వ్యాప్తి చెందడం కోసం సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.)ని స్థాపించారు.
7 మార్చి, 2017 న, భారత ప్రభుత్వం వై.ఎస్.ఎస్. శతాబ్ది సందర్భంగా ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీగారు, న్యూఢిల్లీలో స్టాంపు విడుదలను వ్యక్తిగతంగా నిర్వహించడం ద్వారా పరమహంసగారిని మరియు ఆయన సంస్థను సత్కరించారు.
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంఘమాత నుండి ఆశీర్వాదం
లాస్ ఏంజిలిస్ లోని అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం నుండి హాజరైన ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. డైరెక్టర్ల బోర్డు సభ్యుడు స్వామి విశ్వానందగారు మార్చి 19న రాంచీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాల్గొన్న వారందరికీ తన ప్రేమను మరియు ఆశీర్వాదాలను తెలియజేయడానికి, ఆ రోజు ముందుగా ఫోన్ చేసిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క నాల్గవ అధ్యక్షురాలు మరియు సంఘమాత (“సమాజం యొక్క ఆధ్యాత్మిక తల్లి”) శ్రీ మృణాళినీమాతగారి కొన్ని భావాలను ఆయన కార్యక్రమములో పాల్గొన్నవారితో పంచుకున్నారు. తర్వాత, వై.ఎస్.ఎస్. శతజయంతి సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ఆమె వ్రాసిన సందేశాన్ని సభకు చదివారు (క్రింద పూర్తి పాఠాన్ని చూడండి), ఆ తర్వాత వై.ఎస్.ఎస్. ప్రధాన కార్యదర్శి స్వామి స్మరణానందగారు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇచ్చారు.
వై.ఎస్.ఎస్. జన్మస్థలానికి తీర్థయాత్ర
మార్చి 21న రాంచీ నుంచి దిహికాకు తీర్థయాత్ర చేయడం విశేషం. 1,200 మంది భక్తులు భారతదేశ ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే కంపెనీతో కలిసి వై.ఎస్.ఎస్. ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో నాలుగు గంటల యాత్ర చేశారు. మరో 500 మంది భక్తులు దిహికాలో వారితో కలిసారు, అక్కడ పరమహంసగారి మొదటి పాఠశాల స్థలంలో వై.ఎస్.ఎస్.కు ఇప్పుడు రిట్రీట్ మరియు ధ్యాన కేంద్రం ఉంది. ఈ పండుగ రోజంతా ఈ కార్యక్రమాలు జరిగాయి – రైలు స్టేషను నుంచి మరియు రైలు స్టేషనుకు తిరిగి ఊరేగింపుగా వెళ్ళుట, రైలులో మరియు దిహికా సెంటర్లో సమూహ ధ్యానాలు మరియు భక్తి గీతాలు, స్వామి స్మరణానందగారి మరియు స్వామి విశ్వానందగారి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, భక్తులకు రుచికరమైన భోజనం మరియు వారు విశ్రాంతి తీసుకుంటు సెంటర్ యొక్క సుందరమైన ఒక ఎకరం మైదానాన్ని ఆస్వాదించటానికి సమయం. ప్రతి ఒక్కరికీ వై.ఎస్.ఎస్. శతాబ్ది స్మారక స్టాంపు యొక్క మొదటి రోజు కవర్‌ను జ్ఞాపికగా అందుకున్నారు.
ఝార్ఖండ్‌లోని అత్యున్నత అధికారులు పాల్గొన్నారు
వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం—పరమహంసగారు నివసించిన మరియు బోధించిన, అదే భవనం—వై.ఎస్.ఎస్. శతజయంతి, 22 మార్చి, 2017న జరుపుకోవడానికి ప్రత్యేకంగా దీపాలతో అలంకరించబడింది .
వై.ఎస్.ఎస్. ప్రతి మార్చి 22ని తన “వ్యవస్థాపక దినోత్సవం” గా పాటిస్తుంది మరియు ఈ సంవత్సరం జరిగిన ప్రత్యేక శతాబ్ది ఉత్సవంలో భాగంగా సాయంత్రం కార్యక్రమంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘుబర్ దాస్ గౌరవాతిథిగా హాజరైయారు. వై.ఎస్.ఎస్. ప్రధాన కార్యదర్శి స్వామి స్మరణానందగారి ప్రసంగం మరియు సామూహిక ధ్యానం తరువాత, భౌతిక పురోగతి మరియు ఆధ్యాత్మికత మధ్య చాలా అవసరమైన సమతుల్యతను సాధించడానికి సహాయం చేయడంలో భారతదేశంలో మరియు విదేశాలలో పరమహంసగారి సంస్థాగత కృషి యొక్క ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు.
కార్యక్రమము చివరి రోజు పరమహంస యోగానందగారి బోధనలలోని అత్యున్నత అంశం అయిన క్రియాయోగం పై దృష్టి సారించారు, ఎందుకంటే ఆంగ్లం మరియు హిందీలో నిర్వహించిన వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో క్రియాయోగంలో దీక్షను స్వీకరించారు. రోజు ముగుస్తున్న కొద్దీ, వై.ఎస్.ఎస్. సన్యాసులు బయలుదేరిన భక్తులకు వీడ్కోలు పలికారు, వారు ఆధ్యాత్మికంగా పునరుద్ధరించబడ్డారు మరియు పరమహంసగారి ఆధ్యాత్మిక కార్యచరిత్రలో ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించినందుకు కృతజ్ఞతతో ఇంటికి తిరిగి వెళ్ళారు.
దిహికాకు తీర్థయాత్ర మరియు రాంచీలో శతాబ్ది ఉత్సవాల యొక్క ఫోటో ఆల్బమ్‌లను వై.ఎస్.ఎస్. వెబ్సైట్ లో సందర్శించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా శతాబ్ది సందర్భంగా శ్రీ మృణాళినీమాత నుండి ఒక సందేశం
ప్రియమైన వారా,
మన ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా స్థాపనను స్మరించుకుంటూ ఈ పవిత్ర శతాబ్ది సంవత్సరాన్ని మనం కలిసి జరుపుకుంటున్నందున నా హృదయం ఆనందిస్తుంది. నేను మీ అందరికీ ప్రేమపూర్వక శుభాకాంక్షలు మరియు దివ్య ఆశీర్వాదాలు పంపుతున్నాను మరియు మన పూజ్య గురుదేవులను గౌరవించటానికి మరియు భారతదేశానికి మరియు ప్రపంచానికి ఆయన చేసిన కృషిని గౌరవించటానికి చాలా ప్రేమ మరియు శ్రద్ధతో ఏర్పాటు చేయబడిన మరియు సిద్ధం చేయబడిన అనేక అందమైన కార్యక్రమాలను శ్రద్ధతో అనుసరిస్తూ ఆత్మలో మీతో చేరుతాను. గురుదేవుల యోగద సత్సంగ సొసైటీ, దిహికాలోని బాలుర కోసం ఒక చిన్న “జీవించడం ఎలా” అనే పాఠశాల నుండి, పెద్ద ఆశ్రమాలు, చైతన్యవంతమైన మరియు పెరుగుతున్న సన్యాసుల సమూహము, మరియు భారతదేశం అంతటా రెండు వందలకు పైగా ధ్యాన కేంద్రాలను—మరియు అనేక విద్యా సంస్థలు, అనేక ధార్మిక సేవలు కలిగి ఉన్న సంస్థగా ఎలా ఎదిగిందో నేను ఆలోచించినప్పుడు—నేను గురుదేవులు పొందే అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తాను. ఈ ఆనందోత్సవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన భక్తులందరికీ—నిజానికి, యావత్ భారతదేశానికి—మరియు ఈ ఎదుగుదలకు దోహదపడిన ప్రతి ఒక్కరికీ గురుదేవులు తన ఆత్మ యొక్క అపరిమితమైన అభిమానాన్ని కురిపిస్తున్నారని తెలుసుకోండి.
వై.ఎస్.ఎస్. యొక్క వినయపూర్వకమైన ప్రారంభం నుండి వంద సంవత్సరాలలో, గురుదేవులు భారతదేశం మరియు పాశ్చాత్య దేశాలచే దైవ ప్రేమ యొక్క నిజమైన అవతారంగా గుర్తించబడ్డారు — ప్రపంచాన్ని మార్చే బృహత్ కార్యం కోసం జన్మించిన జగద్గురువు. మన ఆత్మ పురోగతిని మరియు మానవాళి యొక్క ఉన్నత పరిణామాన్ని వేగవంతం చేయడానికి ఆధునిక యుగానికి ప్రత్యేకమైన క్రియాయోగం యొక్క పవిత్ర శాస్త్రాన్ని వ్యాప్తి చేయడం ఆయనకు దేవుడు ఇచ్చిన పని. తన మొదటి “జీవించడం ఎలా” పాఠశాలను స్థాపించిన మూడు సంవత్సరాల తర్వాత, గురుదేవులకు రాంచీలో ఒక స్వప్నదర్శనం అయింది, ఈ ముఖ్యమైన పనిని చేపట్టడానికి ఆయన అమెరికాకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందని ఆ దర్శనం వెల్లడించింది. ఆ తర్వాత ఆయన పాశ్చాత్య దేశాల్లో జీవించాలని ఉద్దేశించబడినప్పటికీ, భారతదేశం ఎప్పుడూ ఆయన స్పృహలో మరియు హృదయంలో ఉండేది. తన కవిత, మై ఇండియాలో, ఆయన ఇలా వ్రాశారు: “నేను భారతదేశాన్ని ప్రేమిస్తాను ఎందుకంటే అక్కడ నేను మొదట దేవుణ్ణి మరియు అన్ని అందమైన వాటినీ ప్రేమించడం నేర్చుకున్నాను.” భారతదేశంలో ఆయన తన మిషన్‌ను ప్రారంభించారు మరియు తన ప్రియమైన మాతృభూమికి నివాళులర్పించే మాటలతో ఆయన తన మానవ శరీరాన్ని విడిచిపెట్టారు—మరియు ఆయన ఆత్మ మరియు భారతదేశం స్ఫూర్తినిచ్చిన కృతి ఎప్పటికీ జీవించి ఉంటాయి.
పశ్చిమ దేశాలలో తన కృతిని స్థాపించడంలో గురుదేవులకు లెక్కలేనన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ, భారతదేశంలోని వై.ఎస్.ఎస్. మరియు ఆయన శిష్యుల సంక్షేమం పట్ల ఆయన ప్రేమపూర్వక శ్రద్ధ మారలేదు. 1935-36లో, దేవుడు ఆయనకు భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశాన్ని ఇచ్చినప్పుడు, ఆయన దేశవ్యాప్తంగా ఉపన్యాసాలు ఇచ్చారు మరియు వై.ఎస్.ఎస్.కు భవిష్యత్తును అందించడానికి మరియు భద్రపరచడానికి తాను చేయగలిగినదంతా చేశారు. ఆయన మళ్ళీ భారతదేశానికి తిరిగి రావాలని తన ఆశను వ్యక్తం చేయడం చాలాసార్లు విన్నాను. కానీ, తన జీవిత చరమాంకంలో, ఇది జగన్మాత సంకల్పం కాదని ఆయన తెలుసుకోగానే, ఆయన దయామాతగారికి అక్కడ తన పనిని చూసుకునే బాధ్యతను అప్పగించారు. ఆమె పూర్ణ హృదయంతో ఆ పవిత్రమైన నమ్మకాన్ని నెరవేర్చారు, భక్తులకు సర్వ-ప్రేమగల జగన్మాత యొక్క నిజమైన ప్రతిబింబంగా ఆమె మారారు మరియు గురుదేవులతో పూర్తి స్థాయిలో ఐక్యమైన చైతన్యంతో ఆమె భక్తులకు స్ఫూర్తినిచ్చేవారు. ఆ మహోన్నతమైన క్షేత్రము నుండే ఆమె యాభై ఏళ్లకు పైగా గురుదేవుల ఆశయాలు మరియు ఆశయాలకు అనుగుణంగా వై.ఎస్.ఎస్. కృతికి మార్గనిర్దేశం చేసి, ఈ రోజు మనం చూస్తున్నట్లుగా సంఘాన్ని అభివృద్ధి చేసారు. హంస స్వామి శ్యామానంద ఆమెకు అందించిన అమూల్యమైన సహాయం మరియు మద్దతుకు మేము కృతజ్ఞులం, ఆమె ప్రయత్నాలలో ఆయన అంకితభావం కీలక పాత్ర పోషించింది మరియు అనేక ఇతర నిష్ఠగల వై.ఎస్.ఎస్. భక్తులు కూడా మా కృతజ్ఞతలు—ఇక్కడ పేర్లు చెప్పడానికి చాలా మంది ఉన్నారు, కానీ వారందరూ మా హృదయాలలో ప్రతిష్టించబడ్డారు.
దయామాతగారి అనేక భారతదేశ పర్యటనలకు ఆమెతో పాటు వెళ్ళడం నా అదృష్టం. మేము కలుసుకున్న అద్భుతమైన వై.ఎస్.ఎస్. భక్తులలో ప్రతిబింబించే భారతదేశపు ప్రత్యేక వారసత్వమైన దేవుని పట్ల స్వచ్ఛమైన, హృదయపూర్వకమైన భక్తి, దాన్నే ఆమె చేసినందున నేను ఆమెను ఎంతో ఆరాధించాను. ఆ సందర్శనలు మరియు గురూజీ స్వదేశానికి చేసిన ఇతర పర్యటనలు నా అత్యంత విలువైన జ్ఞాపకాలలో నా హృదయం మరియు మనస్సుపై శాశ్వతంగా చెక్కబడి ఉన్నాయి. నేను వాటిని తరచుగా పునర్జీవిస్తాను మరియు అక్కడ ఉన్న గురుదేవుని చేలాల కోసం, యోగదా సత్సంగ సొసైటీ యొక్క పని కోసం మరియు ఆయన మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి చాలా చేస్తున్న వారందరికీ నేను అగాధమైన ప్రార్థనలను పంపని రోజు ఉండదు. నేను వై.ఎస్.ఎస్. కార్యక్రమాల ఛాయాచిత్రాలను చూసినప్పుడు, ఆయన బోధనలను పూర్ణముగా ఆచరించడంలో చాలా ఉత్సాహంగా ఉండే అందమైన ఆత్మల సమూహాలను చూసి నేను పులకించిపోయాను—ధ్యానం చేయడానికి, ఆయన జ్ఞానాన్ని గ్రహించడానికి మరియు లెక్కలేనన్ని మార్గాల్లో ఆనందంగా ఆయన కృతికి సేవ చేసే వారు. కొద్దిమంది భక్తులతో మొదలై భగవంతుడు మరియు గురు ప్రేమలో ఐక్యమైన విస్తారమైన ఆధ్యాత్మిక కుటుంబంగా మారింది.
గురుదేవులు మన మధ్య ఉన్న రోజులలో ఉన్నట్లే ఇప్పుడు కూడా తన చేలాల సంక్షేమం మరియు పురోగతి పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారు మరియు మీలో ప్రతి ఒక్కరూ తన ధ్యాన పద్ధతులను శ్రద్ధగా ఆచరించడం ద్వారా మరియు మీ జీవితాన్ని జగన్మాతను సంతోషపెట్టుట కొరకు గడపడం ద్వారా ఎలా అభివృద్ధి చెందుతున్నారో చూడటం ఆయనకు చాలా సంతోషాన్నిస్తుంది. మీరు ఆధ్యాత్మిక అవగాహనలో ఎదగడం మరియు దేవునితో మరింత లోతైన మరియు మధురమైన అంతర్గత సంబంధాన్ని అభివృద్ధి చేసుకోవడం చూసినప్పుడు ఆయన సంతోషిస్తారు, ఎందుకంటే ఆయన మీ కోసం అత్యున్నతమైనదాన్ని కోరుకుంటున్నారు. 100 సంవత్సరాల క్రితం ఆయన ఈ కృతిని స్థాపించిన దైవప్రేమ మరియు సేవ యొక్క దైవిక ఆదర్శాలకు వర్దమానంలో ఉదాహరణగా ఉండే భక్తుడిగా మారడమే మీరు ఆయనకు అందించే అత్యున్నత నివాళి.
పరమహంసగారి సందేశం చాలా మంది జీవితాలను స్పృశించింది ఎందుకంటే ఆయన ఆత్మ యొక్క ఏకీకృత భాషలో సంభాషిస్తారు—అది దైవిక ప్రేమ మరియు శాశ్వతమైన సత్యం యొక్క భాష. ఆయన బోధనలు మరియు దేవుని పట్ల ఆయన గొప్ప ప్రేమ యొక్క ఆకర్షణశక్తి, సాంస్కృతిక, కుల, జాతీయ మరియు మతపరమైన తేడాల అడ్డంకులను అధిగమించాయి. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రభావం సున్నితమైన పిల్లగాలిగా ప్రారంభమవుతుందని మరియు క్రమంగా దేవుని బిడ్డల జీవితాల నుండి చీకటిని తుడిచివేయడానికి సహాయపడే బలమైన వాయువుగా మారుతుందని గురుదేవులు మనకు చెప్పారు. ఈ శతాబ్ది సంవత్సరంలో మనం ప్రారంభాలను మాత్రమే కాకుండా మంచి కోసం ఆ శక్తి పెరుగుదలను జరుపుకుంటాము; మరియు రాబోయే శతాబ్దానికి దాని ఆధ్యాత్మిక ప్రభావాలు మరింత వేగవంతముగా అందేట్లు ఉద్దేశించబడ్డాయి. గురూజీ తన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంస్థను తూర్పు మరియు పడమరల ఐక్యత అనే తన ఆదర్శాన్ని, ఆయన ప్రేమ మరియు వివేకానికి శాశ్వతమైన, స్వచ్ఛమైన మాధ్యమంగా ఉండటానికి స్థాపించారు మరియు ఆ పవిత్ర వారసత్వం చుట్టూ మీ జీవితాలను నిర్మించుకునే మీ అందరి ప్రయత్నాలను ఆయన ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆ ప్రయత్నాలు తీసుకువచ్చే అంతర్గత పరివర్తన, మరియు మీ ముఖాల్లో నేను చూసిన సంతోషకరమైన ఉత్సాహం, ఈ దైవిక బోధల యొక్క సజీవ శక్తికి గొప్ప సాక్షాలు; మరియు రాబోయే సంవత్సరాల్లో ఆయన కృతిని శక్తివంతం చేస్తూనే ఉంటాయి. జై గురూ!
దేవుడు మరియు గురుదేవుల యొక్క ఎడతెగని ఆశీస్సులు,
శ్రీ మృణాళినీమాత