జన్మోత్సవం విజ్ఞప్తి — 2026

2 జనవరి, 2026

“మీ ఆలోచనలు ఎంత దగ్గరగా ఉండనిస్తే, మీ గురువు మీకు అంత దగ్గరగా ఉంటారు…. అది ఆయనతో — భగవంతుడికి చెందిన ఆయన దివ్యచైతన్యంతో — అనుసంధానం పొందడం ద్వారా లభిస్తుంది. ధ్యానంలో అలా చేయడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఆయన సహాయాన్ని మరియు అనుగ్రహాన్ని పొందుతారు.”

— శ్రీ శ్రీ దయామాత, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క మూడవ అధ్యక్షురాలు

జన్మోత్సవం నాడు ఒక ప్రత్యేకమైన సమర్పణ ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభించండి

ప్రియమైన దివ్యాత్మా,

మన గురుదేవులైన శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి పవిత్ర జన్మోత్సవం సందర్భంగా మీకందరికీ ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్ర సందర్భంలో, మన గురుదేవుల మహనీయ జీవితాన్ని, లక్ష్యాన్ని గాఢమైన ప్రేమతో మరియు కృతజ్ఞతతో స్మరించుకోవడానికి మనం కలుసుకున్నాము. ఆయన శిష్యులమైన మనల్ని మరియు యావత్ మానవాళిని వారి దివ్యతేజస్సు ఆశీర్వదిస్తూ ఉంది. క్రియాయోగం యొక్క ప్రాచీన జ్ఞానాన్ని వెల్లడి చేయడం ద్వారా, గురుదేవులు చిత్తశుద్ధి గల భక్తులను పరమాత్మ యొక్క అనంతమైన ఆనందానికి తిరిగి చేర్చే స్పష్టమైన, ప్రత్యక్షమైన మార్గాన్ని చూపించారు.

రాంచీలోని గురుదేవుల పవిత్రమైన వారసత్వాన్ని పరిరక్షించే అవకాశం

ఈ సంవత్సరం, జన్మోత్సవ పవిత్ర కాలం, గురుదేవులకు ప్రియమైన రాంచీ ఆశ్రమం రాబోయే తరాల వారికి కూడా శాంతి, ఊరట మరియు దైవానుసంధానాల ఆలయంగా ఆయన ఉనికిని ప్రసరిస్తూ ఉండడానికి సహాయం చేయడం ద్వారా, ఆయన దివ్యమైన లక్ష్యానికి సేవ చేసే ఒక అద్వితీయమైన అవకాశాన్ని మనలో ప్రతి ఒక్కరికీ అందిస్తోంది.

ఇటీవలి కాలంలో, మన వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలోని అతిథి సదుపాయాలను మెరుగుపరచడం మరియు సమావేశ సదనాన్ని పునర్నిర్మించడం గురించిన శుభవార్తలను పంచుకున్నాము. అప్పటి నుండి ఆశ్రమాన్ని సందర్శించిన భక్తులు, ఇవి తమ ఆశ్రమ సందర్శనానుభవాన్ని ఎంత మెరుగుపరచాయో, తాము ఈ అభివృద్ధిని ఎంత అభినందిస్తున్నారో తెలుపుతూ మాకు వ్రాశారు.

భావితరాల వారు మరింత ఉన్నతమైన, ఉత్తేజకరమైన తీర్థయాత్రానుభవం పొందేలా, ఎంతో అవసరమైన ఈ కార్యక్రమాల తదుపరి దశకు మద్దతు ఇవ్వవలసినదిగా ఇప్పుడు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము:

మొత్తం అంచనా వ్యయం: ₹12 కోట్లు

గురుదేవులకు ప్రియమైన రాంచీ ఆశ్రమం, దాని పవిత్ర పరిసరాలలో ఆశ్రయం పొందేవారందరికీ శాంతిని మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించే పుణ్యస్థలంగా పరిరక్షించేందుకు మీ ఉదారమైన తోడ్పాటు సహాయపడుతుంది.

గురుదేవుల ఆశ్రమాలలో సేవలను అందిస్తున్న సన్యాసులు మరియు సేవకులమైన మేమందరము ప్రతిరోజూ మీకు హృదయపూర్వక కృతజ్ఞతను మరియు మీ శ్రేయస్సు కోసం ప్రార్థనలను అర్పిస్తున్నాము.

భగవంతుడు మరియు గురుదేవులు మిమ్మల్ని సదా అనుగ్రహించు గాక.

దివ్య స్నేహంలో,
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

రాంచీ — భావి తరాలకు ఒక పవిత్ర పుణ్యక్షేత్రం

“నా ఆధ్యాత్మిక సిద్ధి యొక్క అదృశ్య అమృతాన్ని ఎక్కువగా మౌంట్ వాషింగ్టన్ లోను, రాంచీలోనూ నేను వెదజల్లాను…”

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

ఒక శతాబ్దానికి పైగా వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమం, గురుదేవుల సాన్నిధ్యంతో పావనమైన ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో నడిచిన భక్తులకు, దాని తోటలలో ధ్యానం చేసిన వారికి, దాని అన్ని మూలల్లోనూ భగవంతుడి మరియు గురుదేవుల ప్రేమమయమైన ఉనికిని అనుభూతి చెందిన ఒక పవిత్రమైన ఆశ్రయంగా ఒప్పారింది. చిన్న బాలురకు గురుదేవులు బోధనలు చేసిన లిచీ వేది, ఆయన నివసించిన పావన మందిరం, ఆయన తమ అమెరికా ప్రయాణాన్ని గురించి దివ్యదర్శనం పొందిన స్మృతి మందిరం మొదలగు పవిత్ర స్థలాలు ఇప్పటికీ గురుదేవుల పవిత్ర ప్రకంపనలను ప్రసరిస్తూనే ఉంటాయి.

అసంఖ్యాకులైన భక్తులు రాంచీ ఆశ్రమాన్ని ఆంతరంగిక నిశ్చలతకు ఆలయంగా భావించి, అక్కడ శాంతిని, స్వస్థతను, అవగాహనను, భగవదానుసంధానాన్ని పొందారు. గురుదేవుల కార్యాచరణకు సంబంధించిన కార్యక్రమాలు పెరుగుతున్న కొద్దీ, ఈ ఆశ్రమం యొక్క పవిత్రతను మరియు సౌందర్యాన్ని, ఈనాటి తీర్థయాత్రికుల కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తులో రాబోయే సాధకుల కోసం కూడా సంరక్షించడం మన పవిత్రమైన కర్తవ్యం.

ఆశ్రమ రహదారులను మరియు ప్రాంగణ వాతావరణాన్ని అభివృద్ధి చేయడం

ప్రారంభం నుండి, ఆశ్రమంలోని కాలిబాటలు మరియు మార్గాలు, కాలక్రమంలో సహజంగా పరిణామం చెందుతూ, చాలా మటుకు, రాళ్లు లేక సిమెంట్ తో చదును చేయబడకుండానే ఉన్నాయి. ఒక వంక ఇది ఆశ్రమం యొక్క నిరాడంబరతను ప్రతిబింబించినా, మరొక వంక వర్షాకాలంలో బయటికి నీటి పారుదల లేకపోవడం వల్ల నీరు నిలచిపోవడం, సమతలంగా లేని నేల మరియు మట్టి దారుల నుంచి లేచే దుమ్ము వల్ల సందర్శకులకు — ముఖ్యంగా వయస్సు పైబడుతున్న భక్తులకు — చాలా ఇబ్బంది కలగడమే కాక, వాహనాల కదలికలకు కూడా సమస్యలు కలుగుతున్నాయి.

అంతేకాక, ఆశ్రమం యొక్క తోటపనికి అనుగుణంగా రోడ్లను వరుసకూర్చడం అవసరం. అతిథుల సంఖ్య క్రమంగా పెరుగుతూండడం వల్ల, ఈ మార్గాల భద్రతను మరియు మన్నికను కాపాడుకుంటూనే, అదే సమయంలో ఈ వాతావరణం యొక్క ప్రశాంతతను సంరక్షించుకునే విధంగా ఈ మార్గాలను జాగ్రత్తగా పునర్నిర్మించవలసిన తక్షణ బాధ్యత మనపై పడుతోంది.

స్మృతి మందిరం ముందు చదును చేయబడిన కాలిబాట యొక్క దృశ్యీకరణ (రెండరింగ్)

అభివృద్ధి ప్రణాళిక ఈ క్రింది అంశాలను కూడి ఉంది:

  • భక్తుల కోసం స్పష్టంగా ఏర్పరచిన కాలిబాటలతో పాటు, సదుపాయాల మరియు అత్యవసర వాహనాల సురక్షితమైన కదలిక కోసం చుట్టూరా ఉండే 16 అడుగుల వెడల్పు గల కాంక్రీట్ పరిధీయ ప్రవేశ మార్గాన్ని నిర్మించడం
  • స్మృతి మందిరం, శివ మందిరం, సేవాలయం వంటి పవిత్రమైన స్థలాల చుట్టూ సౌఖ్యం మరియు భక్తిభావం పెంపొందే విధంగా రాళ్లతో చదును చేయబడిన కాలిబాటలు
  • అతిథి గృహ ప్రాంతం, (శ్రీ దయామాత గారు భక్తులను కలసి, పలుకరించేవారు) కర్పూర వృక్ష వేదిక, శివ మందిరం మరియు స్మృతి మందిరం వంటి ముఖ్యమైన కేంద్రాలు మరియు కూడళ్లను అలంకరించి మరింత అందంగా చేయడం
  • సహజ పరిసరాలతో దృశ్య సామరస్యాన్ని కాపాడుకుంటూ, సందర్శకులకు మార్గనిర్దేశం చేసే ఆలోచనాపూర్వకమైన తోటపని
  • మైదానం మరియు ప్రధాన వంటశాలల దగ్గర అందంగా రూపకల్పన చేయబడిన ప్రవేశద్వారాల నిర్మాణం. ఈ నూతన ద్వారాలు గురుదేవులు స్వయంగా తయారుచేసిన రూపకల్పనను అనుసరించి నిర్మించబడతాయి, ఈ విధంగా, అవి వై.ఎస్.ఎస్. కు సంబంధించిన చిహ్నాలుగా సులువుగా గుర్తించబడతాయి
  • ఆవశ్యక మౌలిక సదుపాయ నవీకరణలు: సౌరశక్తితో నడిచే దీపాలు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, కేంద్రీకృత మురికినీటి పారుదల వ్యవస్థ, మరియు విద్యుత్ మరియు ప్లంబింగ్ వ్యవస్థలలో స్థిరత్వాన్ని పెంపొంచించే పనులు
చుట్టూరా వాహనాల రాకపోకలు జరిగే పరిధీయ ప్రవేశ మార్గం మరియు ఆశ్రమమంతటా పాదచారులు ఉపయోగించే కాలిబాటలతో కూడిన రహదారుల నెట్వర్క్ వ్యవస్థ రేఖాచిత్రం

బాలలు, కౌమారులు మరియు యువజన కార్యక్రమాల కోసం సదుపాయాలు

గత కొన్ని దశాబ్దాలుగా బాలలు, కౌమార దశలో ఉన్నవారు మరియు యువజన సాధకులలో, వై.ఎస్.ఎస్. బోధనల పట్ల ఆసక్తి స్థిరంగా మరియు ప్రోత్సాహకరంగా పెరుగుతోంది. ఈ పెరుగుతున్న స్పందన ఫలితంగా, వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో కొనసాగుతున్న బాలల సత్సంగ కార్యక్రమాలకు అదనంగా, క్రితం సంవత్సరం వారానికి ఒకసారి జరిగే టీన్ (కౌమారదశలోని వారికి) కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.

ప్రస్తుతం ఈ కార్యక్రమాలు తాత్కాలిక వసతులలో నిర్వహించబడుతున్నాయి. అంతేకాక, గదుల కొరత కారణంగా, వేర్వేరు వయసుల వారిని ఒకే తరగతిలో కలపవలసి వస్తోంది, ఇది తగిన పద్ధతి కాదు.

ఒక 17 సంవత్సరాల యువవ్యక్తి ఈమధ్య ఇలా వ్రాశారు:

ఈ విధంగా పెరుగుతున్న ఆసక్తి మరియు ప్రభావాలను పెంపొందించడం కోసం, ఒక పటిష్టమైన యువజన సేవా విభాగాన్ని మేము స్థాపించాము; ఈ విభాగం దేశమంతటా జరిగే యువజన కార్యక్రమాలను — ఆన్‌లైన్ కార్యక్రమాలను మరియు ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్లలో వ్యక్తిగతంగా జరిగే వాటిని — పర్యవేక్షిస్తుంది. భవిష్యత్తులో, ఈ కార్యక్రమాలలో పాల్గొనేవారి సంఖ్య అనేక రెట్లు పెరుగుతుందని మా అంచనా. అందువల్ల, ఈ కార్యక్రమాలను బలోపేతం చేసి, యువజనుల ఆధ్యాత్మిక అవసరాలను తగిన విధంగా నెరవేర్చడానికి ప్రత్యేకంగా అంకితమైన సౌకర్యాలు చాలా అవసరం.

ఈ ఆవశ్యకతను తీర్చడం కోసం, శ్రవణాలయం (నవీకరింపబడిన ఆడిటోరియం) సమీపంలో ఉన్న ఒక భవనాన్ని (దీనిని పాత ప్రధానోపాధ్యాయుల విడిది అని పిలుస్తారు) కూల్చివేసి, ఆ స్థానంలో బాలలు, కౌమారదశలోని వారు మరియు యువజనుల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేయబడిన ఒక నూతన భవనాన్ని నిర్మించాలని యోచిస్తున్నాము. ఈ ప్రతిపాదిత రెండంతస్తుల భవనం ఈ క్రింది వాటిని కూడి ఉంటుంది:

  • తగినంత నిలువ చేసే చోటు కలిగిన అనేక గదులు
  • శ్రవణ-దృశ్య (ఆడియో-వీడియో) సదుపాయాలు గల అభ్యాస స్థలాలు
  • యువజనుల సదస్సులు మరియు సమావేశాల కోసం ఒక బహుళప్రయోజన మందిరం
  • సిబ్బంది కోసం రిసెప్షన్ మరియు కార్యాలయ స్థలాలు
ప్రతిపాదిత యువజన సేవల భవనం యొక్క విహంగ వీక్షణం

వై.ఎస్.ఎస్. పాఠాల ముద్రణ, నిల్వ చేయడం కోసం ఒక సౌకర్యాన్ని ఏర్పర్చడం

యోగదా సత్సంగ పాఠాలు మరియు ఇతర ఆధ్యాత్మిక ప్రచురణల ముద్రణ మరియు పంపిణీ, గురుదేవుల పవిత్ర లక్ష్యంలో ముఖ్య భాగాలు. ప్రస్తుతం రెండు ముద్రణా యంత్రాలు పని చేస్తూ, పాఠాలను, ప్రకటన పత్రికలను, ఇతర ప్రచురణలను ఇంగ్లీషు మరియు అనేక భారతీయ భాషలలో ముద్రిస్తున్నాయి.

గురుదేవుల క్రియాయోగ బోధనల మీద ఆసక్తి పెరుగుతూ ఉండడం వల్ల పాఠాలను మరికొన్ని భారతీయ భాషలలో అందించాలని, ఆ విధంగా మరికొంత మంది అన్వేషకులకు వీటిని తమ మాతృభాషలో చదువుకునే అవకాశం కలిగించాలని వై.ఎస్.ఎస్. యోచిస్తోంది. ఈ సహజమైన విస్తరణ జరగడానికి ముద్రణలో పెంపు, అంతకన్నా ముఖ్యంగా పాఠాలను మరియు ఇతర అనుబంధ సామగ్రిని భద్రంగా నిలువచేయడానికి మరింత సదుపాయాలు అవసరం.

ప్రతిపాదితమైన నిల్వ సదుపాయం (ఫైలింగ్ విభాగానికి బదులుగా) మరియు అంతస్తు యొక్క ప్రణాళిక (ఫ్లోర్ ప్లాన్), దృశ్యీకరణ

కాని, ప్రస్తుతానికి ఈ ముద్రణాలయంలో తగినంత నిల్వ స్థలం లేదు. అందువల్ల, కాగితం, సిరా, ముద్రణ ప్లేట్లు, ఇతర అనుబంధ సామగ్రి వంటి వినియోగ వస్తువులు ప్రస్తుతం తాత్కాలిక ఏర్పాట్లలో ఉంచబడుతున్నాయి — ఈ ఏర్పాట్లు ఇక ముందు సరిపోవు.

భక్తులు ఇప్పుడు ఉత్తరాల కంటే ఎక్కువగా ఈ-మెయిల్ మరియు ఫోన్ ల ద్వారా సంప్రదిస్తున్నందువల్ల, కాగితాల ఫైలింగ్ విభాగానికి కేటాయించిన స్థలాన్ని పాఠాలు మరియు ముద్రణాలయాలకు ప్రత్యేకంగా చెందిన నిల్వ సౌకర్యంగా పునర్వినియోగం చేయబడుతోంది.

కాని, ఫైలింగ్ విభాగం ఉండే భవనం దాదాపు 70 సంవత్సరాల పాతది మరియు శిధిలావస్థలో ఉంది. ఈ నిర్మాణ మరియు భద్రతా విషయాలను దృష్టిలోకి తీసుకుంటే, ఈ భవనాన్ని దాని పునాదుల నుండి, పూర్తిగా పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉన్నది.

యోగదా సత్సంగ సేవాశ్రమం — ధార్మిక వైద్యశాల యొక్క సదుపాయాల అభివృద్ధి

1958వ సంవత్సరం నుండి, యోగదా సత్సంగ సేవాశ్రమం (వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలోని ధార్మిక వైద్యశాల), పేదలకు, మరియు సహాయం అవసరంమైన వారికి, ప్రేమతో, దయతో సేవలను అందిస్తూ వస్తోంది. సేవాశ్రమంలో ఉచితంగా కంటి ఆపరేషన్లను చేసే ఒక కంటి ఆసుపత్రి, మరియు వైద్యులు వైద్యసలహాలను అందించే బహుళ ప్రత్యేకవైద్య విభాగాలను కలిగిన (మల్టీస్పెషాల్టీ) అవుట్-పేషెంట్ విభాగం (ఓ.పి.డి.) ఉన్నాయి. ఈ సేవల యొక్క శ్రేష్ఠత మరియు నిస్వార్థ తత్పరతల వల్ల సేవాశ్రమం రాంచీలో మరియు పరిసరాలలోని ప్రజలు విశ్వసించే వైద్య సంరక్షణ కేంద్రంగా మారింది.

2023లో, కంటి ఆసుపత్రి యొక్క పునర్నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టాము — ఇందులో ఒక నూతన ఆపరేషన్ గది, కంటి శుక్లాల శస్త్రచికిత్స (కేటరాక్ట్ సర్జరీ) కోసం ఆధునిక పరికరాలు, భవనం యొక్క పునరుద్ధరణ, దివ్యాంగుల సహాయం కోసం ఒక ర్యాంప్ ను చేర్చడం మొదలగునవి కూడి ఉన్నాయి.

కంటి రోగిని పరీక్షిస్తున్న నివాస-సేవక వైద్యుడు

ఇప్పుడు ఇదే విధమైన జాగ్రత్త మరియు ముందుచూపు ఓ.పి.డి. విభాగం విషయంలో కూడా చూపాలని అనుకుంటున్నాము. ప్రస్తుత భవనం 60 సంవత్సరాల కన్నా పాతది, మరియు కాలక్రమేణా బలహీనపడి ఉంది. అంతేకాక, ఆశ్రమం వెలుపల ఉన్న ప్రభుత్వ రహదారుల మట్టం పెరగడంతో, భారీ వర్షాల సమయంలో నీరు తరచుగా సేవాశ్రమం లోపలికి రావడం జరుగుతోంది.

సేవాశ్రమం స్థానిక సమాజానికి మంచి సేవలు అందించడం కొనసాగడానికి ఓ.పి.డి. భాగాన్ని పూర్తిగా పునర్నిర్మించడం అవసరం. ఈ క్రొత్త నిర్మాణం, నీటి ముంపును నివారించడానికి ఎత్తు చేయబడిన నేల మట్టాన్ని (ప్లింత్ లెవెల్), రోగులకు సమర్థవంతంగా సేవలందించడానికి తగిన మంచి ఏర్పాటును, మరియు ఒక నూతన దంతసేవల విభాగానికి కేటాయింపును కలిగి ఉంటుంది.

సేవాశ్రమం అందించే దయామయమైన సేవలు స్థానిక సమాజం నుంచి, అలాగే ప్రభుత్వ అధికారుల నుంచి కూడా సుహృద్భావాన్ని, గుర్తింపును పొందాయి. మన స్వీయ వ్యక్తిత్వమే యావత్ మానవాళిగా విస్తరించిన రూపమన్న భావనతో సేవ చేయాలన్న గురుదేవుల పవిత్ర ఆదర్శాన్ని పరిరక్షించడంలో ఈ నవీకరణలు సహాయపడతాయి.

ఆర్థిక వ్యయం మరియు కాలక్రమాల అంచనా

  • మొత్తం వ్యయం: ₹12 కోట్లు
  • పనుల సంపూర్తి తేదీ అంచనా: డిసెంబర్ 2026

చేయాలనుకుంటున్న ఈ మెరుగుదలలు గురుదేవుల దివ్యదృష్టికి అనుగుణంగా, రాంచీ ఆశ్రమాన్ని ప్రపంచంలో అత్యుత్తమ స్థాయి ఆధ్యాత్మిక తీర్థ స్థలంగా పరిరక్షించడానికి మరియు అవసరం ఉన్నవారికి దయాపూరితమైన సేవలను అందించే దాని దీర్ఘకాల సాంప్రదాయాన్ని నిలపడానికి సహాయపడతాయి.

మీ సహాయానికి ప్రగాఢ అభినందనలు

వై.ఎస్.ఎస్. ఆశ్రమాలను, సాధకులు గాఢంగా ధ్యానం చేయడానికి, ఆత్మకు ఊరటనిచ్చే శాంతిని అనుభూతి చెందడానికి, భగవత్-సాంగత్యంలో పెరగడానికి అనువైన ఆశ్రయాలుగా గురుదేవులు ఊహించారు. ప్రార్థన, సేవ, లేక ఆర్థిక సహాయం రూపాలలో చేసే మీ సమర్పణలు, వర్తమాన మరియు భావితరాల సత్యాన్వేషకులకు రాంచీ ఆశ్రమం యొక్క పవిత్ర అనుభవాన్ని భద్రంగా సంరక్షిస్తాయి.

ఇతరులతో పంచుకోండి