భగవంతుడు నిశ్చలత మరియు ప్రశాంతతలలో లభిస్తాడు — పరమహంస యోగానంద

13 డిసెంబర్, 2025

ఈ క్రింది సంగ్రహం “Cultivate Friendship With God” అన్న ప్రసంగం నుంచి తీసుకోబడింది. ఈ ప్రసంగాన్ని పూర్తిగా పరమహంస యోగానంద గారి ప్రసంగాలు మరియు వ్యాసాల సేకరణ IVవ సంపుటం, Solving the Mystery of Life అన్న పుస్తకంలో చదువగలరు. ఈ పుస్తకం ఇప్పుడు హార్డుబ్యాక్, పేపర్-బ్యాక్ మరియు ఈ-బుక్ రూపాలలో కొనుగోలు చేయడానికి లభ్యమవుతోంది.

కమలం-ఆరంజ్-రేఖాచిత్రం

ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి: మీకు ఎప్పడు కొంచెం ఖాళీ సమయం దొరికినా, దానిని భగవంతుడితో మీ స్నేహాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించండి. ఇది నా స్వీయ అనుభవం నుండి గ్రహించిన నా వినయపూర్వకమైన సూచన మీకు….

భగవంతుడితో స్నేహాన్ని పెంపొందించుకోవాలంటే, భగవంతుడిని ప్రేమించాలంటే, మనం ఆయనను తెలుసుకోవాలి. నిశ్చలతలోను, ప్రశాంతతలోను మీ ఆత్మను ఆయనకు సమర్పించండి.

భగవంతుడి గురించి వేదాలలోనూ, ఇతర ధార్మిక గ్రంథాలలోను ఉన్న జ్ఞానపూరితమైన వాక్కులను నేను మీకు బహుశా కొన్ని నెలల వ్యవధిలోనే బోధించగలను; కాని, ఆ సత్యాలను మీరు మీ అంతరాత్మలో గ్రహించే వరకు, దాని వల్ల మీకు పెద్దగా ప్రయోజనం ఉండదు.

ఆంతరంగిక ప్రశాంతతలోనే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. భగవంతుడు ప్రశాంతతను ప్రేమిస్తాడు. ప్రశాంతతే దివ్యజనకుని పూజావేదిక మరియు ఆలయము. ఆయనను ప్రశాంతతలో అన్వేషించడం సాధన చేయండి. ధ్యానమే దానికి మార్గం. ఇది నేను మీకు ఇవ్వగలిగిన అత్యుత్తమమైన సలహా. మీరు పుస్తకాలను, ఉపన్యాసాలను, తాత్త్విక వివరణలను పొందవచ్చు, కాని, ఈ విషయాన్ని మరచిపోకండి: మీ ఖాళీ సమయాన్నంతటినీ ధ్యానం చేయడానికి, భగవంతుడితో స్నేహాన్ని అలవరుచుకోవడానికి వినియోగించండి.

ధ్యానంలోని మొదటి కొద్ది నిముషాలు మీ మనస్సు పరిభ్రమిస్తుంది, కాని, ఆలోచనలు నిశ్చలమయ్యేంతరకు, మరింత ఎక్కువ సమయం పట్టువిడువకుండా ప్రయత్నించండి: “అయ్యో, ఈరోజు నేను చేయవలసిన ఆ పని ఉంది; నేను ఏదో ఒక సమయంలో ఈ రోజు రాత్రికి ధ్యానం చేస్తాను,” అని మీరు అనుకుంటారు. ఆయనను తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైనదని మీరు భావించనంత కాలం, ఆ “ఈ రోజు రాత్రి” ఎప్పటికీ రాదు; మిమ్మల్ని ఏమార్చే పనులు మీ ఉదయాలను, మధ్యాహ్నాలను, సాయంత్రాలను, రాత్రి వచ్చేంత వరకు నింపి వేస్తాయి, అప్పుడు మీరు నిస్సహాయంగా నిద్రకు లొంగిపోతారు.

కాబట్టి మీరు ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు మీ మనస్సును ఏకాగ్రంగా ఉంచండి. చెదరగొట్టే ఆలోచనలను పారద్రోలి, “తండ్రీ, నాతో ఉండు. నాకు నీ సమాధానం కావాలి; నా అంతరంగంలోనే నీ అనుగ్రహాన్ని అనుభూతి చెందాలని ఉంది,” అని పట్టుపట్టండి. ఇదే విషయం మళ్లీ మళ్లీ, ప్రతిసారి, మరింత గాఢంగా ఆయనకు చెప్పండి.

పరధ్యానంగా ప్రార్థించడం వల్ల ప్రయోజనం లేదు — “స్వర్గలోకంలో ఉన్న నా తండ్రీ, నిన్ను నేను ప్రేమిస్తున్నాను” — అని అంటూనే, మీరు తినాలనుకుంటున్న ఒక మంచి కేకు గురించి ఆలోచించడం వంటిది. అందులో “ఓ తండ్రీ” అన్న ఒక్క పదాన్ని పలకండి, అది చాలు; కాని, దాన్ని మీరు అనుభూతి చెందేంతవరకు పలుకుతూ ఉండండి. అప్పుడు మీ ప్రార్థనలోని తరువాతి భాగానికి వెళ్లండి.

తూర్పు, పశ్చిమ దేశాల మధ్యనున్న ఒక వ్యత్యాసం అదే. ఉదాహరణకు, నేను మొదటిసారి అమెరికాకు వచ్చినప్పుడు నాకు పాశ్చాత్య సంగీతం నచ్చలేదు; కాని, ఇప్పుడు నాకది ఒక కథలా సాగిపోతూ, చివరకు ఒక ఉత్కృష్టమైన ముగింపుకు ఎలా చేరుకుంటుందో అర్థమవుతోంది. ప్రాచ్య దేశాలలో మేము సంగీతాన్ని ఈ విధంగా ఉపయోగించము; మేము ఒక పదసముదాయాన్ని తీసుకొని, అది వ్యక్తం చేసే భావంలో లీనమయ్యేంతవరకు దాన్ని పదేపదే పునరావృతం చేస్తుంటాము.

భగవంతునిపై ఎటువంటి ప్రేమ లేకుండా ప్రార్థనల పుస్తకాన్ని పూర్తిగా పఠించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? నిజమైన ప్రార్థన మేధాపరమైనది కాదు; అది భగవంతునితో మీరు చెప్పేదాన్ని అనుభూతి చెందడం. ఆ అనుభూతిని వృద్ధి చేసుకోవాలి: మొదట్లో మీకు భగవంతుడిపై ప్రేమ కలుగదు, ఎందుకంటే మీరు ఆయనను తెలుసుకోలేదు కాబట్టి.

మనకు దగ్గరగా ఉండే వారిని, ప్రియమైన వారిని మనం ప్రేమిస్తాం. మన భావాలను వారితో సహజంగానే వ్యక్తం చేస్తాం; మన హృదయాలలో నుండి దానంతట అదే ఉబికి వస్తుంది. ఎందుకు? వారు మనకు వాస్తవమవడం వల్ల, వారిని మనం ప్రత్యక్షంగా చూస్తాం, లేక మన మనోనేత్రంలో చూడగలుగుతాం. కాని, మనం భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి, ఆయనను మనం చూడలేము. పువ్వులలోనూ, ప్రకృతిలోని ఇతర అందాలలోను ఆయన ఉనికిని మనం ఊహించవచ్చు; కాని, ఆయనతో ప్రత్యక్షమైన సంబంధం కలగాలంటే, గాఢమైన ధ్యానం అవసరం….

భగవంతుడిని కనుగొనే వరకు పట్టుదలతో ఉండండి

నా దివ్యజనకుడిపై నాకున్న ప్రేమలో అత్యంత చిన్న కణాన్నైనా మీలో మేల్కొలిపినప్పుడు నా పని నెరవేరుతుంది.

ఆయనను తెలుసుకోవడానికి చాలా కాలమే పట్టింది; మనస్సు ఎంతో అశాంతిగా ఉండడం వల్ల, ఈ జన్మలో నేను విజయం సాధించలేనేమో అనిపించేది. కాని, నా మనస్సు ధ్యానం వదలిపెట్టేలా నన్ను మాయ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, నేను మనస్సును ఇలా మాయ చేసేవాడిని: “ఎటువంటి శబ్దాలు, చికాకులు ఎదురైనా, నేను ఇక్కడే కూర్చుంటాను. ప్రయత్నం చేస్తూ మరణించినా కూడా నేను పట్టించుకోను; చివరి వరకు కొనసాగుతాను.”

ఈ విధంగా నేను పట్టుదలతో కొనసాగుతూండగా, అప్పుడప్పుడూ దివ్యమైన పరమాత్మ యొక్క దర్శనం క్షణకాలం పాటు లభించేది; ఒక తేజోకణంవలె, ఒకే సమయంలో దగ్గరగాను, దూరంగానూ అనిపిస్తూ, ఒక్క క్షణం కనిపించి వెంటనే అదృశ్యమైపోయేది. కానీ నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను. కనిపించని నిశ్శబ్దంలో, అంతులేని పట్టుదలతో ఎలా ఎదురుచూశానో! ఈ ఏకాగ్రత గాఢతరమైన కొద్దీ, ఆయన అభయం మరింత స్పష్టంగాను, శక్తివంతముగాను మారింది. ఇప్పుడు ఆయన నాతో ఎల్లపుడూ ఉంటాడు….

నేను మీలో పెంపొందించాలనుకుంటున్నది కేవలం ఆయనతో మీ సంబంధం — అందులో, మీరు “భగవాన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను,” అన్న ప్రతిసారి, ప్రతి కణం, ప్రతి భావం, ప్రతి ఆలోచన ఆయన ఆనందపు అనంతత్వంలో మేల్కొంటాయి.

కమలం-ఆరంజ్-రేఖాచిత్రం

పరమహంస యోగానంద గారి Solving the Mystery of Life గురించి మరింతగా తెలుసుకోవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ పుస్తకం, దైనందిన జీవితంలో భగవంతుడిని తెలుసుకోవడంపై ప్రసంగాలు మరియు వ్యాసాల సేకరణ క్రమంలో నాలుగవ సంపుటం. సనాతన జ్ఞానంతో కూడిన ఈ చక్కటి గ్రంథం ఇప్పుడు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 

ఇతరులతో పంచుకోండి