స్వామి హితేశానంద గిరి (1953-2021) జ్ఞాపకార్థం

13 మే, 2021

గురుదేవుల యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క సీనియర్ సన్యాస శిష్యులలో ఒకరైన మన పూజ్య స్వామి హితేశానంద గిరి మే 11, 2021న ప్రశాంతంగా పరమపదించారని మీకు తెలియజేస్తున్నాము. కోవిడ్ లక్షణాల యొక్క మొదటి ఆనవాళ్ళతో ఆయనను స్థానిక రాంచీ ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది. పరీక్షల్లో ఆయనకు వైరస్ రూఢి అయ్యింది. అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైద్య సంరక్షణతో, చాలా రోజులు పాటు ఆయన చికిత్స పొందినప్పటికీ, స్వామి హితేశానంద పరిస్థితి క్రమంగా క్షీణించి, అంతిమంగా ఆయన మరణానికి దారితీసింది.

గోవర్ధన్ ప్రసాద్ గా జన్మించిన స్వామి హితేశానంద బీహార్ రాష్ట్రంలోని చాప్రా జిల్లాకు చెందినవారు. ఉపాధి కోసం మరియు ఉన్నత విద్య కోసం ఆయన యుక్త వయస్సులోనే న్యూఢిల్లీకి మకాం మార్చడం జరిగింది. కృషి మరియు పట్టుదలతో—పగటిపూట వివిధ ఉద్యోగాల్లో పనిచేయడం, రాత్రిపూట తరగతులకు హాజరు కావడం ద్వారా గోవర్ధన్ ప్రసాద్ ఒక కళాశాల పాఠ్య ప్రణాళిక ప్రకారం తన వంతు కృషి చేశారు. అది ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని అందుకునేట్లు చేసింది. తరువాత ఆయన ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డి.డి.ఎ) లో ప్రభుత్వ ఉద్యోగాన్ని స్వీకరించారు, ఇది ఆయన ఇద్దరు సోదరులను ఢిల్లీకి తీసుకురావడానికి ఆర్థిక భద్రతను కల్పించింది, వారి చదువులు కొనసాగించడానికి కూడా సహాయపడింది.

అలుపెరగని శ్రమకు, అచంచల నిబద్ధతకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు, అవసర౦లో ఉన్న ఇతరులకి ఎల్లప్పుడూ సహాయ౦ చేయాలని కోరుకునే ఆయన శ్రేష్టమైన గుణ౦తో, జీవిత౦లో ఆయన కలుసుకున్న ప్రతి ఒక్కరి హృదయాలను స్పృశి౦చిన ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు.

డీ.డీ.ఏ.లో ఉద్యోగిగా ఉన్న గోవర్ధన్ ప్రసాద్ పరమహంస యోగానందగారి వై.ఎస్.ఎస్. బోధనల ఆధ్యాత్మిక సాధనకు నిబద్ధులై ఉండేవారు. ఆ సూత్రాలకు కట్టుబడి ఉండటం ద్వారా శ్రమించే వ్యక్తిగా, నిజాయితీ ఆయువుగా మరియు అవినీతిలేని వ్యక్తిగా ఖ్యాతిని సంపాదించారు. ప్రకాశవంతమైన ఆయన గుణం మరియు ఆయనకున్న ఉన్నత లక్ష్యాలు, ఆయన సహోద్యోగుల్లోని చాలామ౦దిపై శాశ్వతమైన ముద్రవేసి౦ది, వారిలో కొ౦దరు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, చివరికి వారు కూడా నిష్కపటమైన అంకితభావంగల శిష్యులుగా మారారు.

స్వామి హితేశానంద గిరి 1986లో యోగదా సత్సంగ మఠంలో ప్రవేశార్థిగా చేరారు. 1995లో రాంచీ ఆశ్రమంలో బ్రహ్మచర్య దీక్షను, 2004లో లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో సన్యాస దీక్షను స్వీకరించారు.

అనేక దశాబ్దాలపాటు వై.ఎస్.ఎస్. సన్యాస శిష్యులుగా స్వామి హితేశానంద గురుదేవుల ఆశ్రమాలుగల రాంచీ, దక్షిణేశ్వరం, ద్వారహాట్, నోయిడాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. రాంచీలోని అందమైన స్మృతి మందిరం మరియు ధ్యాన మందిర భవనాల నిర్మాణంలో ఆయన అందించిన తోడ్పాటు ముఖ్యంగా చెప్పుకోదగినది. స్వామీజీ తన జీవితపు చివరి భాగంలో మన ఉత్తరప్రత్యుత్తర విభాగంలో పనిచేశారు. అక్కడ గురుదేవుల బోధనల పట్ల ఆయనకున్న లోతైన అవగాహన ఆధ్యాత్మిక సలహా కోరే అసంఖ్యాక భక్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. భక్తుల అభ్యర్థనలు మరియు అవసరాలకు వ్రాతపూర్వక సమాధానాలకు బదులుగా టెలిఫోన్ ద్వారా సలహాలు అందించడానికి, స్వామి హితేశానంద ఏ సమయంలోనైనా ఫోన్ సంభాషణలకు అందుబాటులో ఉండేవారు. ఆచరణాత్మకతతో నిండిన ఆయన సలహా ఎల్లప్పుడూ తన గురుదేవుల బోధలకు అనుగుణంగాను మరియు అనుశ్రుతిలోను ఉండేది.

భగవంతునికి మరియు గురుదేవులకు అంకితభావంతో మరియు భక్తివిశ్వాసాలతో జీవిత పర్యంతం స్వామి హితేశానంద చేసిన సేవ నుండి మనము ప్రేరణ పొందుతూనే ఉంటాము. వై.ఎస్.ఎస్. సన్యాసులు, సేవకులు, మరియు భక్తులు భౌతికంగా ఆయన ఉనికిని కోల్పోయినా, స్వామి హితేశానంద ఆత్మ ఇప్పుడు అన్ని శారీరక పరిమితుల నుండి విముక్తమై, జగన్మాత మరియు మన మహా గురువుల ప్రేమ, కాంతుల్లో సేద తీరుతుందని తెలుసుకోవడం ద్వారా మనం ఓదార్పు పొందుతాము.

స్వామి హితేశానంద తన ఆధ్యాత్మిక యాత్రను సర్వవ్యాపక నివాసానికి కొనసాగిస్తున్నప్పుడు మన ధ్యాన సమయాలలో, మన హృదయాలను తెరచి మన ప్రేమ మరియు ప్రార్థనలను పంపుదాం.

ఇతరులతో పంచుకోండి