“అన్నిటినీ సంతృప్తిపర్చే పరమాత్ముని నిత్య నూతన ఆనందం” అనే అంశంపై పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారి ప్రసంగం “కోరుకొన్నట్టుగా సంతోషంగా ఉండడం ఎలా” నుండి సారాంశాలు. పూర్తి ప్రసంగాన్ని వై.ఎస్.ఎస్. ప్రచురించిన పరమహంసగారి ప్రసంగాల, వ్యాసాల కూర్పు అయిన మొదటి సంపుటం మానవుడి నిత్యాన్వేషణ లో పొందవచ్చు.

మనం మనుష్యుల ముఖాలను గమనిస్తున్నప్పుడు, వాళ్ళ మానసిక స్థితులను అనుసరించి సాధారణంగా వాళ్ళ ముఖకవళికలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు: లోపలి, బయటి ఆనందాన్ని సూచిస్తూ, నవ్వుతూ ఉండే ముఖాలు; విచారాన్ని చూపుతుండే నిష్ఠురమయిన ముఖాలు; లోపలి విసుగుదలను బయట పెడుతున్నట్లుండే నిరుత్సాహకరమైన, నవ్వే ఎరుగని ముఖాలు; ఒక అంతఃశాంతిని ప్రతిఫలిస్తున్న ప్రశాంతమయిన ముఖాలు.

ఒక కోరిక తీరినప్పుడు అది ఆనందాన్ని ఇస్తుంది. తీరని కోరిక విచారాన్ని సృష్టిస్తుంది. ఆనందపు, విచారపు శిఖరాల మధ్య విసుగుదల అనే పల్లం ఉంది. ఆనందం, దుఃఖం అనేక ఎత్తయిన కెరటాలూ, విసుగుదల అనే లోతులూ తటస్థీకరించబడినప్పుడు, ప్రశాంత స్థితి ప్రకటమవుతుంది.

ప్రశాంత స్థితికి ఆవల ఒక నిత్య నవీన దివ్యానంద స్థితి ఉంది. దాన్ని ఒక వ్యక్తి తనలో కనుగొని, అది తన ఆత్మకున్న వాస్తవమయిన సహజ స్థితిగా గుర్తించవచ్చు. ఈ దివ్యానందం ఉద్రేకపరిచే వెల్లివిరిసే ఆనందమూ, బాగా కుంగిపోడమూ, నిస్సారమయిన ఉదాసీనత అనే మానసిక అలల కింద పాతేసిఉంది. మనస్సునుంచి ఈ అలలు మాయమయినప్పుడు, ప్రసన్నమయిన శాంతస్థితి అనుభవంలోకి వస్తుంది. ప్రశాంతత అనే నిశ్చల జలాలమీద ప్రతిఫలించేదే నిత్య నవీన దివ్యానందం.

ప్రతిస్పందనలకు ఆధారం

ఈ ప్రపంచంలోని చాలామంది ప్రజలు ఉత్తేజపరిచే ఆనందమూ దుఃఖమూ బాధా అనే అలల మీద ఇటూ అటూ ఎగురుతున్నారు. అవి లేనప్పుడు వాళ్ళు విసుగు పొందుతున్నారు. రోజులో మీరు ఇతరుల ముఖాలను — ఇంటిదగ్గర, ఆఫీసులో, రోడ్లపైన సమూహాల్లోను — గమనించినప్పుడు కేవలం కొందరు మాత్రమే ప్రశాంతిని కనబరచడం మీరు చూస్తారు.

ఉల్లాసంగా కనబడే ముఖాన్ని చూసి, ఆ వ్యక్తిని “మీరు సంతోషంగా ఉన్నారు. సంగతేమిటి?” అని అడిగితే అతడు ఈ విధంగా జవాబిచ్చే అవకాశం ఉంది: “నాకు జీతం పెరిగింది,” లేకపోతే నేనొక ఆసక్తికరమైన వ్యక్తిని కలిసాను.” ఆ సంతోషం వెనకాల ఒక కోరిక తీరడమనేది ఉంది.

మీరొక ఏడుపుగొట్టు ముఖాన్ని చూసి సానుభూతితో పలకరిస్తే, దాని సొంతదారు, నేనొక జబ్బుపడ్డ మనిషిని,” అనో లేదా “నా పర్సు పోగొట్టుకున్నాను,” అనో ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు. ఆరోగ్యాన్నీ (లేదా తాను కోల్పోయిన డబ్బును) తిరిగి పొందాలనే కోరిక అతడి ముఖం ముడుచుకుపోయేలా చేసింది.

ఒక విధంగా అభావంగా ఉన్న ముఖాన్ని మీరు చూసి “సంగతేమిటి? మీరు ఏ విషయం గురించయినా విచారంగా ఉన్నారా?” అని అడిగితే, అతడు అలాంటిదేమీ లేదని చటుక్కున జవాబిస్తాడు. కాని మీరు అతణ్ణి బలవంతపెట్టి “మీరు ఆనందంగా ఉన్నారా?” అంటే, అబ్బే, అదేం లేదండీ, నాకు విసుగ్గా ఉంది” అని అంటాడు.

ప్రతికూలమయిన, అనుకూలమయిన శాంతి

మీరొక సంస్కారం గల, డబ్బుండి, ఒక భవంతిలో నివసిస్తూ, ఆరోగ్యంగాను, పుష్టిగాను కనబడే, ఎక్కువ ఆనందంగాను, విసుగూ విచారాలు లేని ఒక వ్యక్తిని కలువవచ్చు. అలాంటి సందర్భంలో ఆయన శాంతంగా ఉన్నాడని మీరనవచ్చు. కాని ఈ విధంగా సౌకర్యాలలో సుస్థిరుడయిన ఆ వ్యక్తి ఈ రకమయిన ప్రశాంతిని చాలా కలిగిఉండవచ్చు — చాలా తక్కువమందికి ఇలాంటి మంచి అదృష్టపు అనుభవం ఉంటుంది. ఆయన తన లోపల, “నాకీ శాంతి చాలు — నాకు ఏదయినా కొంత ఉత్సాహాన్ని కలిగించేది, మంచిమార్పు అవసరం” అనుకోవచ్చు. లేదా ఆయన తన స్నేహితుడితో, “నేను బతికే ఉన్నానని నేను అనుకునేటట్టు చేయడానికి దయచేసి నా తల మీద ఒక్కటివ్వు” అని అనవచ్చు.

ఆనందం, విచారం, విసుగుదల అనే ఈ మూడు మానసిక స్థితులు లేని దానినుంచి పుట్టినదే ప్రతికూలమయిన (నకారాత్మక) ప్రశాంత స్థితి. మార్పు, ఉత్తేజం లేకుండా చాలా కాలం సాగిన ప్రతికూలమయిన శాంతి మురిగిపోయి, ఆనందాన్ని ఇవ్వలేనిదవుతుంది. కాని చాలా కాలం ఇష్టం వచ్చినట్లు కొనసాగిన సంతోషం, విచారం, విసుగుదల స్థితుల తరవాత వచ్చే నకారాత్మక శాంతి కూడా ఆనందింపదగినదవుతుంది. ఈ కారణం చేతనే మనశ్శాంతి పొందడానికి ఏకాగ్రత ద్వారా ఆలోచనా తరంగాలను తటస్థీకరింపజేయమని యోగులు సలహా ఇస్తారు.

ఒకసారి యోగి ఆలోచనాతరంగాలను నిశ్చలం చేసిన తరవాత, ఆ ప్రశాంతతకు కింద ఉన్నదాన్ని చూడడం మొదలుపెడతాడు, అక్కడొక సకారాత్మక ప్రశాంత స్థితిని, ఆత్మ నిత్య నవీన ఆనందాన్ని కనుగొంటాడు.

న్యూయార్కులో నేనొక గొప్ప ధనవంతుణ్ణి కలిసాను. ఆయన తన జీవితాన్ని గురించి నాకు కొంచెం చెబుతూ, నానుస్తూ మెల్లగా మాట్లాడుతూ అన్నాడు, “నేను విసుగుపుట్టేంతలా గొప్పవాణ్ణి, విరక్తి కలిగేంతలా ఆరోగ్యవంతుణ్ణి” — ఆయన పూర్తి చేయకమునుపే నేను అన్నాను. “కాని మీరు విసుగుపుట్టేంతలా ఆనందంగా లేరు! నిత్య నవీన ఆనందంలో ఉండడంలో ఏ విధంగా నిరంతరం ఆసక్తి కలిగి ఉండాలో నేను మీకు బోధించగలను.”

ఆయన నా విద్యార్థి అయ్యాడు. క్రియాయోగ సాధన ద్వారా, సంతులితమైన జీవితాన్ని గడపడం ద్వారా, ఎల్లప్పుడూ లోపల భగవంతుడి పట్ల భక్తి గలిగి ఉండడం ద్వారా, ఎప్పుడూ నిత్యనవీన ఆనందంతో పొంగిపొరలుతూ, ఆయన పండు ముదుసలి అయ్యేంత వరకు జీవించాడు.

చనిపోబోయే ముందు తన భార్యతో చెప్పాడు, నేను చనిపోవడం నువ్వు చూడవలసి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను. కాని, నా విశ్వ ప్రియతమునిలో కలవడానికి వెళుతున్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా ఆనందాన్ని చూసి సంబరపడు; దుఃఖించి స్వార్థపరురాలివి కాబోకు. నా ప్రియతమ భగవంతుని కలవడానికి వెళుతున్నందుకు నేనెంత ఆనందంగా ఉన్నానో నీకు తెలిస్తే, నువ్వు విచారించవు; ఆ నిత్యానందపు పండుగలో ఒకనాడు నువ్వు కూడా నాతో కలుస్తావని తెలుసుకొని సంతోషపడు.”

దివ్యానందాన్ని నిండుగా పానం చేయండి

ఇప్పుడు [చెప్పండి], సంతోషాన్ని, దుఃఖాన్ని, విసుగును లేదా తాత్కాలికమయిన శాంతిని నమోదు చేసిన ఆ ముఖాలను గమనించిన తరువాత, మీ ముఖం అందరికీ నిత్య నవీనమైన పరమాత్మ ఆనందాన్ని వ్యాపింపజేసేలా ప్రతిఫలింపజేయాలని మీరు అనుకోడంలేదా?

ఈ విధంగా చేయడానికి మీరు గాఢమయిన ధ్యానమనే పీపానుంచి ఆయన దివ్యానందాన్ని తాగుతూ, తాగుతూ దివ్యానందపు తాగుబోతు అయ్యేంతవరకు; నిద్రలోను, కలల్లోను, జాగ్రదవస్థలోను, జీవితపు అన్ని పరిస్థితులలోను దాన్నే వ్య క్తంచేయండి. లేకుంటే జీవితపు అన్ని పరిస్థితులూ మీకు ఉత్సాహంతో గందరగోళపరిచే ఆనందాన్నో, లేదా అగాధమయిన విచారాన్నో, లేదా విసుగుదలతో ముంచెత్తుతూనో, లేదా తాత్కాలికమయిన ప్రతికూలమయిన శాంతినో ఇస్తాయి.

మీ నవ్వులు మనఃపూర్వకంగా ప్రతిధ్వనించాలి. మీ ఆనందం మీరు సాక్షాత్కరించుకొన్న ఆత్మ మూలాలనుంచి ప్రవహించాలి. మీ మందహాసం మీరు కలిసే అన్ని ఆత్మలకు, ఈ మొత్తం విశ్వానికి వ్యాపించాలి. మీ ప్రతి చూపూ మీ ఆనందాత్మను ప్రతిఫలించాలి; ఆ ఆనందపు ప్రభావం విచారంతో మునిగిపోయిన మనసుల్లో విస్తరించాలి.

ఎప్పుడూ మానసికంగా ఎత్తుపల్లాలకు గురయ్యే కేవల సాధారణ మానవుణ్ణి నేనని మీరు కలలుగనడం ఆపాలి. ఏం జరిగినప్పటికీ, మీరా పరమాత్ముడి యథార్థమయిన ప్రతిరూపంలో తయారయ్యారనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి.

అన్నింటిలో ఉన్న జీవానందం — విశ్వ దివ్యానందపు మూలస్థానం — దాని జల్లులతో మిమ్మల్ని స్నానం చేయించాలి; మీ ఆలోచనల ద్వారా, ప్రతి కణమూ, మీ సంపూర్ణ అస్తిత్వపు నేతగుండా జాలువారుతూ ఆనందాన్ని పంపాలి.

చాలా గంటల గాఢమైన కలలులేని నిద్రలో — అది ఎరుకేలేని ఆత్మ గ్రహింపు — మీరు ఆ సమయమంతా ఆనందంగా ఉన్నారని గుర్తుంచుకోండి. కాబట్టి రోజులో, పీడకలల వంటి మానసిక సమస్యలూ, హెచ్చుతగ్గులతో మీరెంత కలత పొందినప్పటికీ, ఆంతరికంగా నవీన ఆనందంతో, ఎప్పుడూ తాజాగా ఉండే జలజలమని పారే ఏరు నీటిలా ఉండటానికి మీరు ఎప్పుడూ ప్రయత్నిస్తుండాలి.

ఒక తాగుబోతు అన్ని సమయాల్లోను మద్యపానంచేస్తూ ఎప్పుడూ దానిలో తూగుతున్నట్లే, మీరు కూడా ధ్యానం తరవాత నిరంతరాయంగా మీ ఆత్మ ఆనందాన్ని గ్రహిస్తూ నిజమయిన ఆనందంతో మత్తెక్కి ఉండవచ్చు.

ధ్యానం తరవాతి దివ్యానంద స్థితిని మీరు ఎల్లవేళలా అనుభూతి పొందుతుంటే, మీరు పారవశ్యంలో జీవిస్తారు. మీరు ఆత్మకున్న నిత్య నవీన ఆనందంతో ఒక్కటవుతారు. ఏ విధంగా గంధపు చెక్కను నిరంతరంగా తాకడం చేతిని సువాసనాభరితం చేస్తుందో, అదే విధంగా మీ చుట్టూ ఉన్నవాళ్ళందరూ మీలాగా అవుతారు.

“వాళ్ళ ఆలోచనలు పూర్తిగా నామీద లగ్నం చేసి, వాళ్ళ అస్తిత్వాలను నాకు శరణంచేసి, ఒకరికొకరు జ్ఞానం కలిగించుకొంటూ, నన్నే ఎల్లప్పుడూ చాటిచెబుతూ, నా భక్తులు ఆనందంగా, తృప్తిగా ఉన్నారు.” (భగవద్గీత, X:9).

ఇతరులతో పంచుకోండి