దాదాపు మూడు సంవత్సరాల ప్రపంచవ్యాప్త మహమ్మారి తర్వాత, భారతదేశమంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. కుటుంబానికి కొత్త ఆశాకిరణాన్ని, ఆనందాన్ని మరియు ఆశీస్సులను 2023వ సంవత్సరం అందించింది. అవును, మేము 2023 జనవరి 22 నుండి ఫిబ్రవరి 28 వరకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు అయిన స్వామి చిదానందగిరి గారి భారతదేశ పర్యటన గురించే మాట్లాడుతున్నాము. ఎల్లలు లేని తన అపరిమితమైన ప్రేమతో, దయాభావంతో స్వామీజీ భక్తుల హృదయాలను స్పృశించారు, జ్ఞానపూర్ణమైన వారి ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తుల ఆధ్యాత్మిక జీవితాన్ని శక్తితో నింపి ప్రతి ఒక్కరిలో దివ్య ఆకాంక్షలను ప్రేరేపించాయి. తన నెల రోజుల సుదీర్ఘ-పర్యటనలో, స్వామి చిదానందగారు నోయిడా, రాంచీ మరియు దక్షిణేశ్వరంలోని వై.ఎస్.ఎస్. ఆశ్రమాలను సందర్శించారు. అక్కడ ఆదివారం సత్సంగాలు నిర్వహించారు మరియు అనేక ప్రత్యేక కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు. అయితే, హైదరాబాద్ సమీపంలో జరిగిన ఐదు రోజుల వై.ఎస్.ఎస్. సంగమం స్వామీజీ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతదేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి 3,200 మందికి పైగా దప్పికగొన్న ఆధ్యాత్మిక అన్వేషకులు దీనిలో పాల్గొన్నారు. శాంతి మరియు ఆనందాన్ని ప్రసరించే చెట్ల నీడ చెంత పచ్చని పచ్చికబయళ్ళు, విరబూసిన పుష్పాలతో విరాజిల్లే కాన్హా శాంతి వనం సముదాయంలో సంగమం నిర్వహించబడింది.
సంగమంలో పాల్గొన్నవారు ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం సామూహిక ధ్యానాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, కీర్తనలు మరియు వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలపై సమీక్షా తరగతులకు హాజరయ్యారు. స్వామి చిదానందగారితో జరిగిన మూడు గంటల ప్రత్యేక ధ్యానం, సంగమంలో ప్రత్యేకంగా నిలిచింది.
ప్రారంభోత్సవ సమావేశంలో, జీవిత సవాళ్లను అధిగమించడం మరియు మన అత్యున్నత సామర్థ్యాన్ని సాధించడంపై స్వామి చిదానందగారు స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. “దివ్యులు మరియు గౌరవనీయులైన సద్గురువు, మన శ్రీ పరమహంస యోగానందగారి ఆశీస్సులతో క్రియాయోగ ధ్యాన సాధన ప్రసాదించే దివ్య సాక్షాత్కారంలో శరణు మరియు శాశ్వతమైన ఆశ్రయం పొందండి,” అని స్వామీజీ భక్తులను అభ్యర్థించారు. తన ముగింపు సత్సంగంలో స్వామీజీ, సంగమం యొక్క ఆశీస్సులను తమతో తిరిగి తీసుకువెళ్ళి రోజువారీ ధ్యాన సాధన ద్వారా దైవంతో మరింత సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవాలని ప్రోత్సహించారు. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రాచీన నాగరికతకు మరియు ఆధ్యాత్మిక జ్ఞానము పోషిస్తున్న పాత్రను ఆయన కొనియాడారు. “భారతదేశ ఆధ్యాత్మిక స్వర్ణ యుగానికి మరియు అభివృద్ధి చెందుతున్న ప్రపంచ నాగరికత మధ్య వారధి” గా మనమందరమూ ఎలా ఉండగలమో స్వామి చిదానందగారు వివరించారు. ఎంతో వాత్సల్యంతో ప్రతి ఆత్మను ఆలింగనం చేసుకోవడానికి దేవుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆశ్రయంలోకి వెళ్ళాలని ఆయన అందరినీ అభ్యర్థించారు.
శ్రీ పరమహంస యోగానందగారి జీవించడం ఎలా బోధనల ఆధారంగా అనేక ఇతర సీనియర్ వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు కూడా ఆంగ్లం మరియు హిందీలో స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. “క్షమించడంలోని స్వస్థతా శక్తి,” “అంతర్గత మరియు బాహ్య జీవితాలలో శాంతికి యువరాజుగా ఉండటం,” “మీ ఆలోచన దేవుణ్ణి అనుమతించినంత వరకే, ఆయన మీకు దగ్గరగా ఉంటాడు,” మరియు “ధ్యానం ద్వారా మూలాధారమైన ఆంతరిక శక్తిని మరియు జ్ఞానాన్ని స్పృశించడం,” అనే అంశాలు ఈ తరగతులలో వివరించబడ్డాయి.
నాలుగు విభిన్న వేదికలపై ఏకకాలంలో ఆంగ్లం మరియు హిందీ భాషలలో నిర్వహించబడిన పవిత్ర క్రియాయోగ దీక్షా వేడుక, సంగమం యొక్క ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఈ ప్రదేశాలన్నింటిలో, పూజ్యులైన స్వామి చిదానందగారు గురుదేవుల ఆశీస్సులతో నిండిన గులాబీ రేకులను వెదజళ్ళారు.
సంగమం సమయంలో, స్వామిజీ అనేక వై.ఎస్.ఎస్. ప్రచురణలను కూడా విడుదల చేశారు. స్వామి చిదానందగారు మరియు ఇతర సన్యాసుల స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, అలాగే దైనందిన ధ్యానాలు, భారతదేశమంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది భక్తులు వీక్షించడం కోసం ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి. ఈ కార్యక్రమాలు వై.ఎస్.ఎస్. యూట్యూబ్ ఛానెల్లో వీక్షించడానికి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.
గురుసేవ యొక్క ప్రాచీన భారతీయ సంప్రదాయానికి ఉదాహరణగా, వందలాది మంది వై.ఎస్.ఎస్. వాలంటీర్లు సన్యాసులతో కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి నెలల తరబడి అవిశ్రాంతంగా పనిచేశారు. సంగమం సమయంలో భక్తులకు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంచబడ్డాయి, వాటిలో: భోజన ఏర్పాట్లు; వేలాది మంది భక్తులకు వసతి; విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ మరియు సమీపంలోని హోటళ్లు మరియు అతిథి గృహాలకు రోజువారీ ప్రయాణానికి రవాణా సౌకర్యం; సహాయ కేంద్రం మరియు వైద్య సౌకర్యాలు; సీనియర్ సన్యాసులచే వ్యక్తిగత ఆధ్యాత్మిక సమావేశాలు; వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ (VLD) మరియు క్రియాయోగ దీక్షా నమోదు విభాగాలు; వై.ఎస్.ఎస్. ప్రచురణలను విస్తృతంగా ప్రదర్శించే పుస్తక విక్రయశాలలు; మరియు భక్తులకు విశ్రాంతి ప్రదేశాలు, మొదలైనవి.
హైదరాబాదులో జరిగిన వై.ఎస్.ఎస్. సంగమం భక్తులను ఆధ్యాత్మిక ఉత్సాహంతో నింపి, వారి హృదయాల్లో దివ్య ప్రేమ జ్వాలలను తిరిగి రగిలించిన సుసంపన్నమైన ఒక గొప్ప అనుభవం.