యోగానందగారు మరియు డాక్టర్ ఎం.డబల్యూ.లూయిస్‌ల మొదటి కలయిక
బోస్టన్ డెంటిస్ట్ అయిన డాక్టర్ మినోట్ డబ్ల్యు. లూయిస్, 1920లో అమెరికాకు గురుదేవులు వచ్చిన కొద్దికాలానికే ఆయనను కలుసుకుని, యావజ్జీవిత శిష్యుడిగా మారారు. ఆయన ఉపాధ్యక్షుడిగా మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌కు ప్రియమైన మంత్రిగా పనిచేసిన చాలా సంవత్సరాలలో, ఆయన తరచుగా పరమహంసగారి గురించిన కథలను తన ప్రేక్షకులతో పంచుకునేవారు. పరమహంసగారితో తన మొదటి పరిచయం గురించి ఆయన కథనం అత్యంత స్ఫూర్తిదాయకమైనది. ఈ క్రింది కథనం సంవత్సరాలుగా డాక్టర్ గారు ఇచ్చిన అనేక ప్రసంగాల నుండి సంకలనం చేయబడిన వివరాలను కలిగి ఉంది:
1920 చివరలో, పరమహంస యోగానందగారు అమెరికాకు వచ్చిన కొద్దికాలానికి, ఈ యువ స్వామిని బోస్టన్ ప్రాంతంలోని యూనిటేరియన్ చర్చిలో మాట్లాడేందుకు ఆహ్వానించారు, అక్కడ జరిగే సభకు డాక్టర్ లూయిస్ చిరకాల స్నేహితురాలు శ్రీమతి ఆలిస్ హేసే సభ్యురాలు. శ్రీమతి హేసేకు (పరమహంసగారు తరువాత ఆమెకు సిస్టర్ యోగమాత అనే పేరుని ఇచ్చారు) డా. లూయిస్‌గారికి ఆధ్యాత్మికత పట్ల ఉన్న ఆసక్తి గురించి తెలుసు. కాబట్టి “మీరు స్వామి యోగానందను తప్పకుండా కలవాలి” అని గట్టిగా సూచించారు.
గురుదేవులకు గది ఉన్న యూనిటీ హౌస్‌లో క్రిస్మస్ పండుగ సందర్భంలో అపాయింట్‌మెంట్ ఇవ్వబడింది. ఆ నిర్ణీతమైన సమయానికి కలిసేందుకు డాక్టర్ తన ఇంటిని విడిచి వెళుతున్నప్పుడు త్వరగానే తిరిగి వస్తానని భావించి, క్రిస్మస్ చెట్టును అలంకరించడానికి త్వరలోనే తిరిగి వస్తానని తన భార్య మిల్డ్రెడ్‌కి చెప్పారు.
యూనిటీ హౌస్‌కి వెళ్లేటప్పుడు, మతగురువునని చెప్పుకొనే కపట వ్యక్తితో మోసపోకుండా లేదా తప్పుదారి పట్టించబడకుండా తల్లిదండ్రుల హెచ్చరికలను డాక్టర్ గుర్తుచేసుకున్నారు; ఆయన మానసిక స్థితి సందేహాస్పదంగా ఉంది.
పరమహంసగారు డాక్టర్ లూయిస్‌ను ఆప్యాయంగా ఆదరించారు. ఆ యువ దంతవైద్యుని మనస్సులో ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు పరమహంసగారు ఆయనకు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత, డాక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “నేను ‘మిసౌరీకి చెందినవాడిని,’ నాకు చూపించవలసి వచ్చింది. దాని కంటే ఘోరమైనదేమిటంటే, నేను న్యూ ఇంగ్లాండ్ నుండి వచ్చాను మరియు నేను తెలుసుకోవలసి వచ్చింది!”
1920లో ఆ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన పరమహంసగారితో ఇలా అన్నారు: “బైబిల్ మనకు ఇలా చెబుతోంది: ‘దేహానికి కాంతి కన్ను: కాబట్టి నీ కళ్ళు ఒకటిగా మారితే, నీ శరీరమంతా కాంతితో నిండిపోతుంది.’ మీరు దీన్ని వివరించగలరా?”
“నేను చెప్పగలననుకుంటున్నాను,” గురుదేవులు జవాబిచ్చారు.
డాక్టర్‌కి ఇంకా అనుమానంగానే ఉంది. “నేను చాలా మంది వ్యక్తులను అడిగాను, కానీ ఎవరికీ దాని అర్థం తెలియదు.”
“గుడ్డివారు గుడ్డివారిని నడిపించగలరా?” పరమహంసగారు స్పందించారు. “ఇద్దరూ ఒకే పొరపాటు గోతిలో పడతారు.”
“మీరు ఈ విషయాలు నాకు చూపించగలరా?”
“నేను చూపించగలననుకుంటున్నాను,” గురుదేవులు పునరుద్ఘాటించారు.
“అయితే, స్వర్గం కొరకు, దయచేసి నాకు చూపించండి!”
పులి చర్మాన్ని నేలపై ఉంచి, గురుదేవులు డాక్టర్‌ను దానిపై కూర్చోమని చెప్పారు మరియు ఆయన ఎదురుగా కూర్చున్నారు. డాక్టర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, పరమహంసగారు అడిగారు: “నేను నిన్ను ప్రేమిస్తున్నట్లుగా నీవు కూడా ఎల్లప్పుడూ నన్ను ప్రేమిస్తావా?”
డాక్టర్ సానుకూలంగా బదులిచ్చారు. అప్పుడు గురుదేవులు, “నీ పాపాలు క్షమించబడ్డాయి మరియు నీ జీవితానికి నేను బాధ్యత వహిస్తాను” అన్నారు.
“ఆ మాటలతో,” డాక్టర్ తరువాత ఇలా వివరించారు, “నా భుజాల నుండి గొప్ప భారం ఎత్తబడినట్లుగా అనిపించింది. ఇది వాస్తవం. నేను గొప్ప ఉపశమనాన్ని పొందాను – నేను కర్మ పర్వతాల నుండి మరియు మాయ నుండి విముక్తి పొందినట్లుగా, ఒక గొప్ప బరువు ఎత్తి వేయబడింది మరియు అప్పటి నుండి ఆ బరువు ఎత్తబడే ఉంది. చాలా పరీక్షలు వచ్చాయి – చాలా ఉన్నాయి – కానీ ఆ భారము తిరిగి రాలేదు.”
కథను కొనసాగిస్తూ, డాక్టర్ లూయిస్ ఇలా అన్నారు:
“అప్పుడు గురుదేవులు తన నుదిటిని నా నుదిటిపై ఉంచారు. నా కళ్ళు పైకెత్తి కనుబొమ్మల మధ్య బిందువును చూడమని చెప్పారు, నేను అలాగే చేశాను. మరియు అక్కడ నేను ఆధ్యాత్మిక నేత్రం యొక్క గొప్ప కాంతిని చూశాను. నన్ను ఏమీ చూడమని గురుదేవులు సూచించలేదు. ఆయన సూచనల ద్వారా నన్ను ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు. నేను చూసినది సహజమైన మార్గంలో వచ్చింది.
“నేను పూర్తిగా స్పృహలో ఉన్నాను, పూర్తిగా మేల్కొని, పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాను మరియు నేను ఆధ్యాత్మిక నేత్రాన్ని చూశాను ఎందుకంటే గురుదేవులు నా మనస్సు తరంగాలను నిశ్చలంగా ఉంచారు మరియు నా ఆత్మ యొక్క స్వంత అంతర్ దృష్టిని నాకు చూపించడానికి అనుమతించారు. నేను గొప్ప బంగారు కాంతిలో మరింత ముందుకు చూసినప్పుడు,పూర్తిగా ఆధ్యాత్మిక నేత్రం ఏర్పడింది, దాని లోపలి ముదురు నీలం కేంద్రం నాలోని క్రీస్తు చైతన్యమును సూచిస్తుంది లేదా వ్యక్తపరుస్తుంది, చివరకు మధ్యలో ఉన్న చిన్న వెండి నక్షత్రం, విశ్వ చైతన్యం యొక్క సారాంశం. [పదకోశంలో “ఆధ్యాత్మిక నేత్రం” చూడండి.]
“వాస్తవానికి, మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న అంతర్గత వాస్తవికతను, నాకు చూపించగల వ్యక్తిని కనుగొన్నందుకు నేను ఖచ్చితంగా పొంగిపోయాను. ఆయన సాధారణ వ్యక్తి కాదని, అలాంటి ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసునని చెప్పుకునే సాధారణ వ్యక్తుల కంటే చాలా భిన్నమైన వ్యక్తి అని నేను గ్రహించాను.
“మేము కొన్ని నిమిషాలు మాట్లాడాము, ఆపై ఆయన మరోసారి తన నుదిటిని నా నుదిటిపై నొక్కారు; మరియు ఆ సమయంలో నేను వెయ్యి కిరణాల కమలం యొక్క గొప్ప కాంతిని చూశాను [మెదడు పైభాగంలో ఉన్న అత్యంత ఉన్నత ఆధ్యాత్మిక కేంద్రం] – వెండి ఆకుల అనేక కిరణాలతో చూడగలిగే అత్యంత అద్భుతమైనది. వేయి కిరణాల తామరపువ్వు దిగువన, దట్టమైన వెలుతురులో రూపొందించబడిన, మెదడు అడుగున ఉన్న పెద్ద ధమనుల గోడలను నేను చూడగలిగాను. మరియు ఇదిగో, నేను చూస్తున్నట్లుగా, ధమనుల లోపల కాంతి యొక్క చిన్న మెరిసే కణాలు నా దృష్టి ముందు వెళుతూ వాటి (ధమనుల) గోడలను తాకుతున్నాయి. ఇవి రక్త కణములు, ప్రతి ఒక్కటి సూక్ష్మ కాంతి యొక్క చిన్న మెరుపులా వ్యక్తమవుతూ దేవుని కాంతి నాటకంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి.
“ఈ అద్భుతమైన విషయాలను చూసినప్పుడు, అలాంటి సాక్షాత్కారం కలిగి ఉన్న వ్యక్తిని కలిసినందుకు నేను చాలా కృతజ్ఞుడను. మరియు గురువుదేవులు ఇలా చెప్పారని నాకు గుర్తుంది,’మిమ్మల్ని క్రమశిక్షణలో ఉంచడానికి మీరు నన్ను అనుమతిస్తే మరియు నేను చెప్పిన మార్గాన్ని క్రమం తప్పకుండా అనుసరిస్తే, ఇవి ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. గురుదేవుల మాటలు నిజమయ్యాయని నేను సాక్ష్యం చెప్పగలను.”
పరమహంసగారు ఇంకా ఇలా అన్నారు: “మీరు నన్ను ఎప్పటికీ వర్జించమని, వాగ్దానం చేయాలని నేను కోరుకుంటున్నాను.” డాక్టర్ వాగ్దానం చేశారు.
గురువు మరియు శిష్యుల మధ్య జరిగిన ఈ ఒప్పందం గురించి డాక్టర్ తరువాత ఇలా అన్నారు, “చాలా సార్లు ఇది చాలా కష్టమైంది,ఎందుకంటే గురువు యొక్క క్రమశిక్షణ సులభమైనది కాదు; కానీ అది ఎల్లప్పుడూ మీ అత్యున్నత మేలు కోరకు, మిమ్మల్ని కాంతి నిలయానికి మార్గదర్శనం చేస్తుంది.”
ఆధ్యాత్మిక నేత్రపు కాంతిని ఎలా చూడాలో డాక్టర్ లూయిస్‌కు చూపించిన తర్వాత మరియు ఆయనకు ఇతర ఆధ్యాత్మిక సూచనలను అందించిన తర్వాత, ఇతర అమెరికన్లు ఈ బోధనలపై ఆసక్తి చూపుతారని భావిస్తున్నారా అని పరమహంసగారు అడిగారు.
“అవును, నేను నమ్ముతున్నాను,” డాక్టర్ సమాధానమిచ్చారు.
“అప్పుడు,” గురుదేవులు ఇలా అన్నారు, “నేను మీకు నేర్పించిన వాటిని మీరు ఆచరించిన తర్వాత, ఈ ధ్యాన పద్ధతులు మీకు నచ్చితే మరియు మీకు ప్రయోజనం చేకూర్చినట్లయితే, మీరు ఇతరులకు వాటి గురించి తెలుసుకోవడానికి సహాయం చేస్తారా?”
“తప్పకుండా చేస్తాను,” అన్నారు డాక్టర్.
1920లో ఆ క్రిస్మస్ తెల్లవారు జామున డాక్టర్ పరమహంసగారితో తన అపాయింట్‌మెంట్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి సమయం రెండు గంటలు. శ్రీమతి లూయిస్ చాలా సమయం వరకు ఆయన లేకపోవడంతో అప్రమత్తంగా ఉంది; కానీ ఆమె ఆయన ముఖాన్ని చూసినప్పుడు, పరమహంసగారిని తన భర్త కలవడం ఒక పరివర్తన చెందే అనుభవమని ఆమె గ్రహించింది.
తర్వాత తరచుగా, ఈ దివ్య మేల్కొలుపు గురించి చెప్పేటప్పుడు, డాక్టర్ ఇలా అన్నారు, “ఇది నా మొదటి నిజమైన క్రిస్మస్!”
తన గురువుతో ఆ ప్రారంభ సమావేశం ద్వారా తనపై ఏర్పడిన ముద్రను వివరిస్తూ, ఆయన తర్వాత ఇలా వ్రాశారు: “మేము కలిసి పులి చర్మపు తివాచీపై కూర్చుని దేవుని సాన్నిధ్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, నేను ఆయన ముఖంలోకి చూశాను, నాకు ఉన్నతమైన సామర్థ్యపు చైతన్యం కలిగున్నట్లుగా అసలు కనిపించలేదు. ఆయన దానిని వ్యక్తం చేసి ఉండవచ్చు; అటువంటి గొప్ప ప్రశాంతత మరియు సాక్షాత్కారం ద్వారా, దివ్య చైతన్యమును అనుభూతి చెందడానికి మరొకరికి సహాయం చేయడం అంటే సామాన్యమైన సాఫల్యం కాదు. కానీ బదులుగా మనందరికీ తండ్రైన ప్రభువు సాన్నిధ్యాన్ని మరియు ఆనందాన్ని తనలాగే మరొక దేవుని బిడ్డ కూడా ఆస్వాదించగలిగారనే వినయం, ప్రేమ మరియు అత్యున్నతమైన సంతృప్తి యొక్క వ్యక్తీకరణ కనిపించింది. అలాంటి వినయం నాకు ఎప్పటికీ అగాధమైన ప్రేరణగా ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం, ఇది నిజమైన గొప్పతనం యొక్క లక్షణం.”
చాలా సంవత్సరాల తర్వాత ఈ సంఘటన గురించి చెబుతూ, ఎన్సినీటస్‌లోని సెల్ఫ్-రియలైజేషన్ ఆశ్రమ కేంద్రం యొక్క సమర్పణలో, డాక్టర్ ఇలా అన్నారు:
“అందుకే స్నేహితులారా, నేను సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను, అందుకే నేను సహాయం చేయడానికి ప్రయత్నించాను; ఎందుకంటే పరమహంస యోగానందగారి నుండి ఏదో మంచి, ఏదో గొప్ప మంచి జరుగుతుందని నాకు తెలుసు. అమెరికా నాకు చాలా ఇచ్చింది, దానికి నేను కృతజ్ఞుడను; కానీ అమెరికా నాకు ఇవ్వని విషయం ఒకటి ఉంది, అది భారతదేశం నుండి నేను పొందిన ఆధ్యాత్మిక సాక్షాత్కారం మరియు అవగాహన; అవి పరమహంస యోగానందగారి నుండి నా వద్దకు వచ్చాయి.”