2011 సంవత్సరం, ఆధునిక ప్రపంచంలో క్రియాయోగం యొక్క 150వ వార్షికోత్సవాన్ని గుర్తు చేస్తుంది. గుప్తమైన హిమాలయ గుహలో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఆత్మ విమోచన ప్రక్రియలలో అత్యున్నతమైన ఈ ప్రక్రియ అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతున్నది, ప్రతి చోటా దైవాన్వేషకులు దేవునితో ప్రత్యక్ష వ్యక్తిగత అనుసంధానం కలిగించే దిశగా, అతి వేగంగా ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి సహాయం చేస్తోంది.
క్రియాయోగం యొక్క స్వభావం, పాత్ర, సామర్థ్యం మరియు మోక్షానికి సర్వోత్తమమైన ప్రక్రియగా పరమహంస యోగానందగారి సంభాషణల నుండి ఎంపిక చేయబడిన ఈ సంకలనం తెలియజేస్తుంది. ప్రస్తుత యుగానికి భగవంతుడు మరియు మహాగురువులు భూమికి పంపబడిన ప్రత్యేకమైన విధి ఈ క్రియాయోగ ప్రక్రియ.
150 సంవత్సరాల క్రితం: ఆధునిక కాలానికి యోగము యొక్క పునరుజ్జీవనం.
తాము ఈ భూమి మీద మళ్ళీ అవతరించడానికి గల ప్రయోజనం నెరవేరడం లాహిరీ మహాశయులు చూసింది ముప్ఫై మూడో ఏట. హిమాలయాల్లో రాణీఖేత్ సమీపంలో తమ మహోన్నత గురువులు బాబాజీని కలుసుకొని, వారి దగ్గర క్రియాయోగ దీక్ష పొందారు.
ఈ శుభ సంఘటన జరిగింది లాహిరీ మహాశయులు ఒక్కరికే కాదు; మానవజాతి కంతటికీ సౌభాగ్య సమయమది. వాడుకలో లోపించి లేదా చిరకాలంగా అదృశ్యమై ఉన్న సర్వోన్నత యోగవిద్యను మళ్ళీ వెలుగులోకి తెచ్చిన శుభతరుణమది.
పురాణ కథలో దాహార్తుడైన భగీరధుడనే భక్తుడి కోసం గంగ, ఆకాశం నుంచి భూమికి దిగివచ్చి దివ్యజలాలందించినట్టు, 1861లో క్రియాయోగమనే స్వర్గంగ, హిమాలయ రహస్య గహ్వరం నుంచి సామాన్య జనపదాలకు ప్రవహించడం మొదలుపెట్టింది.
ఒక ప్రాచీన శాస్త్రం
ప్రస్తుత ప్రపంచ యుగానికి ప్రత్యేక విధి
ఆధ్యాత్మిక యుగం నుండి భౌతిక యుగంలోకి మానవుని యొక్క అవరోహణం జరిగినప్పుడు, యోగ శాస్త్రం యొక్క జ్ఞానం క్షీణించి మరుగవుతుంది… మరొక్కసారి ఈ ఆరోహణ, అణుయుగంలో రాజయోగము యొక్క నాశరహితమైన శాస్త్రం క్రియాయోగముగా మహావతార్ బాబాజీ, శ్యామా చరణ్ లాహిరీ మహాశయులు, స్వామి శ్రీయుక్తేశ్వర్ మరియు వారి శిష్యుల కృప వల్ల పునరుద్ధరించబడుతోంది….
ప్రత్యేక దైవికమైన విధి విషయమై, కృష్ణుడు, క్రీస్తు, మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, మరియు స్వామి శ్రీయుక్తేశ్వర్ ద్వారా యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా బోధనలలో సూచించబడిన కృష్ణుని నిజమైన యోగం మరియు క్రీస్తు యొక్క నిజమైన క్రైస్తవ మతం యొక్క ఐక్యతను, క్రియాయోగ శాస్త్రం ద్వారా ప్రపంచమంతటా వ్యాప్తి చేయడానికి నేను ఎంపిక చేయబడ్డాను.
మహావతార్ బాబాజీ (పరమాత్మలో కృష్ణుడితో సమానమని నేను ఎప్పుడూ గ్రహిస్తాను) మరియు క్రీస్తు మరియు నా గురువు మరియు పరమగురువుల నిదర్శనం మరియు ఆశీస్సుల ద్వారా నేను పశ్చిమ దేశాలకు పంపబడి, క్రియాయోగ శాస్త్ర పరిరక్షణకు మరియు ప్రపంచములో వ్యాప్తి చేయడానికి, ఒక సాధనముగా సేవ చేయడానికి, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించే పనిని చేపట్టాను.
తూర్పున యోగమునకు దైవ నిదర్శనముగా కృష్ణుడు నిలుస్తాడు; భగవంతుడు పశ్చిమానికి దైవసంయోగానికి నిదర్శనముగా క్రీస్తును ఎంచుకున్నాడు. ఆత్మను పరమాత్మతో ఐక్యం చేసే రాజయోగ ప్రక్రియ ఏసుకు తెలిసి, ఆయన శిష్యులకు బోధించారని బైబిల్ లోని లోతైన ప్రతీకాత్మక అధ్యాయం “ద రెవలేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు సెయింట్ జాన్”* లో నిరూపించబడింది.
బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడూ సన్నిహిత సంబంధముంటూనే ఉంది. వీరిద్దరూ కలసి ముక్తిప్రదమైన స్పందనలను ప్రసరింపజేస్తూనే ఉంటారు. అంతే కాకుండా వీరు, ఈ యుగంలో మోక్షప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు.
దురభిమాన సిద్ధాంతం మీద కాకుండా, క్రియాయోగం సత్యం మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది
భగవద్గీత భారతదేశం యొక్క అత్యంత ప్రియమైన యోగ గ్రంథం, దైవసంయోగ శాస్త్రం – మరియు రోజువారీ జీవితంలో సంతోషం మరియు సమతుల్య విజయానికి సనాతనమైన విధి. గీతపై పరమహంస యోగానందగారి విస్తారమైన సమగ్ర రచన, గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత – రాయల్ సైన్స్ ఆఫ్ గాడ్‑రియలైజేషన్ (రెండు సంపుటాలు; యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, లాస్ ఏంజిలిస్)గా పేర్కొనబడింది. ఆయన ఇలా వ్రాశారు: “నా గురువు మరియు పరమగురువులు – స్వామి శ్రీయుక్తేశ్వర్, లాహిరీ మహాశయులు, మరియు మహావతార్ బాబాజీ – ఈ ప్రస్తుత యుగానికి చెందిన ఋషులు, గురువులు, వారికి వారే భగవత్సాక్షాత్కారం పొందిన సజీవ గ్రంథాలు. చిరకాలంగా అదృశ్యమైన క్రియాయోగ శాస్త్రీయ ప్రక్రియతో పాటు పవిత్ర భగవద్గీత యొక్క – ప్రధానంగా యోగ శాస్త్రానికి మరియు ముఖ్యంగా క్రియాయోగమునకు సంబంధించిన కొత్త నిదర్శనాన్ని ప్రపంచానికి అందించారు.
లాహిరీ మహాశయుల యొక్క బోధన ఆధునిక యుగానికి ప్రత్యేకంగా సరిపోతుంది, ఎందుకంటే ఇది ఎవరినీ పిడివాదంగా విశ్వసించమని అడగదు, కానీ క్రియాయోగము యొక్క నిరూపితమైన పద్ధతులను సాధన చేయడం ద్వారా వ్యక్తిగత సాక్షాత్కారంతో “సత్యం అంటే ఏమిటి?” అనే నిరంతర ప్రశ్నకు-తన గురించి మరియు దేవుని గురించి సమాధానం కనుగొనడం సాధ్యమవుతుంది.
సత్యమన్నది ఒక సిద్ధాంతం కాదు, తత్వశాస్త్రంలో ఉన్న చింతనా విధానం కాదు, బుద్ధిపరమైన అంతర్ జ్ఞానమూ కాదు. సత్యమనేది వాస్తవానికి ఖచ్చితమైన అనురూపం. ఆత్మరూపమైన తన వాస్తవప్రకృతిని గురించి అచంచల జ్ఞానము. ఆత్మగా తన స్వస్వరూపం.
చివరికి దేవుని మరియు సృష్టి యొక్క అంతిమ రహస్యాలు గురించి అన్ని ఊహాకల్పనలు నిరర్ధకములు. కఠినమైన వాస్తవం ఎల్లప్పుడూ మనతోనే ఉంది: మానవుడు ఇక్కడ ఉన్నాడు మరియు ఇప్పుడు మానవ అవతారం యొక్క బాధాకరమైన పరీక్షలకు లోనవుతున్నాడు. ఖైదీలు తమ స్వేచ్ఛను తిరిగి పొందడానికి యెడతెగకుండా కుట్ర చేసినట్లే, మానవుల్లోని జ్ఞానులు మరణాల నిర్బంధాల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు.
క్రియాయోగం, ఆత్మ పరమాత్మను చేరుకునే విశ్వజనీన ఆరోహణ రహదారిని ఎత్తి చూపడమే కాక, మానవాళికి రోజువారీ ఉపయోగపడే ప్రక్రియను అందిస్తుంది, దీని అభ్యాసం ద్వారా భక్తుడు, గురువు సహాయంతో దేవుని సామ్రాజ్యంలోకి తిరిగి ప్రవేశించగలడు. ఒక సైద్ధాంతిక బోధన మరొక దానికి మాత్రమే దారితీస్తుంది, కాని క్రియాయోగాన్ని అభ్యాసం చేసే నిజమైన సాధకుడు, దానిని పరమాత్మ యొక్క సామ్రాజ్యానికి అతిదగ్గర మార్గంగా మరియు అతి వేగవంతమైన వాహనంగా కనుగొంటాడు.
క్రియ యొక్క క్రమమైన అభ్యాసం నుండి జనించే ఆనందాన్ని నాస్తికుడైన వ్యక్తి కూడా తిరస్కరించలేడు. విద్యావేత్తగా, నా పాఠశాలలోని సందేహాస్పద విద్యార్థులపై నేను ఈ పద్ధతితో ప్రయత్నించాను, మరియు వారు నా మాటల ద్వారా కాకుండా, దాని క్రమమైన అభ్యాసం నుండి నిరంతరం ఉల్లాసకరమైన ఫలితాల ద్వారా మార్పు చెందారని నేను కనుగొన్నాను.
మతం, దాని సైద్ధాంతిక రూపంలో పాక్షికంగానే సంతృప్తినిస్తుంది, ఎప్పుడూ పూర్తిగా నమ్మశక్యంగా ఉండదు. మా గురుదేవుల జీవన విధానానికి ఆయన జ్ఞాన పూరితమైన మాటల ద్వారా పాక్షికంగా నేను గెలవబడ్డాను, కాని ప్రధానంగా క్రియాయోగము యొక్క గాఢమైన మరియు క్రమబద్ధమైన సాధనకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, నన్ను అనంతమైన ఆనందములో తేలిపోయేలా చేసింది. లాహిరీ మహాశయుల పద్ధతి నాకు నిరంతరం పెరుగుతున్న ఆనందాన్ని ఇచ్చిందని మరియు నిరంతరం ఇస్తోందనీ నేను ప్రపంచానికి ప్రకటిస్తున్నాను; మరియు దీన్ని తీవ్రంగా మరియు క్రమం తప్పకుండా సాధన చేసే వారందరికీ, స్వభావముతో సంబంధం లేకుండా ఒకే ఆనందాన్ని కలిగించగలదని నేను పూర్తిగా నమ్ముతున్నాను.
ప్రాణాయామం యొక్క క్రియాయోగ శాస్త్రం (ప్రాణశక్తి నియంత్రణ)
ఏ మతానికి చెందిన భక్తుడైనా పరీక్షించని నమ్మకాలు మరియు పిడివాదాలతో సంతృప్తి చెందకూడదు, కానీ దైవ-సాక్షాత్కారం సాధించడానికి ఆచరణాత్మక ప్రయత్నాలలో తనను తాను నిమగ్నం చేసుకోవాలి. భక్తుడు, ఆచారముగా ఆరాధించడమనే ఉపరితల పద్ధతిని లేదా నిష్ఫలమైన “నిశ్శబ్దంలోకి వెళ్ళడం” వంటి వాటిని పక్కనపెట్టి, శాస్త్రీయమైన దైవ-సాక్షాత్కార ప్రక్రియను సాధన చేయడం ప్రారంభించినప్పుడు మాత్రమే పరమాత్మతో ఐక్యత సాధ్యమవుతుంది.
మానసిక ధ్యానం ద్వారా మాత్రమే ఒకరు ఈ లక్ష్యాన్ని చేరుకోలేరు. మనస్సును శ్వాస, ప్రాణశక్తి మరియు ఇంద్రియాల ద్వారా ఆత్మతో కలిసే అహాన్ని, గాఢమైన ఏకాగ్రతతో వేరుచేసినప్పుడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం యొక్క దైవ జ్ఞానాన్ని ఉత్పన్నం చేయడంలో విజయవంతమవుతుంది.
ప్రాణశక్తి, పదార్థమును ఆత్మను కలుపే ఒక గొలుసు. బయటకి ప్రవహించినప్పుడు అది ఇంద్రియాల యొక్క కృత్రిమమైన ఆకర్షణీయ ప్రపంచాన్ని వెల్లడిస్తుంది; లోపలికి తిప్పబడినప్పుడు, అది చైతన్యాన్ని దేవుని యొక్క శాశ్వత సంతృప్తికరమైన ఆనందం వైపుకి లాగుతుంది.
ఇద్దరు పురుషులు వేర్వేరు గదులలో ధ్యానం చేస్తున్నారు, ప్రతీ గది ఒక టెలిఫోన్ కలిగి ఉంది. ప్రతి గదిలో టెలిఫోన్ మోగింది. మేధోపరమైన మానసిక స్థితిలో ఉన్న ఒక వ్యక్తి తనలో తాను ఇలా అనుకున్నాడు: “నేను టెలిఫోన్ మోతలు వినబడనంత గాఢంగా దృష్టి సారిస్తాను!” బాహ్య శబ్దం ఉన్నప్పటికీ, అతను అంతర్గత ఏకాగ్రత సాధించడంలో విజయవంతుడవగలడు అనేది నిజం; కానీ అతను తన పనిని అనవసరంగా క్లిష్టం చేశాడు. దృష్టి, ధ్వని, వాసన, రుచి మరియు స్పర్శ యొక్క నిరంతర టెలిఫోనిక్ సందేశాలను మరియు ప్రాణశక్తి యొక్క బాహ్య ఆకర్షణలను విస్మరిస్తూ భగవంతుని గురించి ధ్యానం చేయడానికి ప్రయత్నించే ఈ పురుషుడిని ఒక జ్ఞాన యోగితో పోల్చవచ్చు.
మన దృష్టాంతంలో రెండవ పురుషుడు టెలిఫోన్ యొక్క అనాగరికమైన గందరగోళాన్ని విస్మరించే శక్తి గురించిన భ్రమలు లేవు. అతడు వివేకంతో విద్యుత్ ప్లగ్‌ను ఉపసంహరించి పరికరాన్ని విచ్ఛిన్నం చేశాడు. ఇంద్రియాల నుండి ప్రాణశక్తిని విచ్ఛిన్నం చేయడం ద్వారా ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి ఇంద్రియ పరధ్యానాలనైనా నిరోధించే క్రియాయోగితో అతడిని పోల్చవచ్చు; అతడు దాని ప్రవాహాన్ని మార్చి, ఉన్నత కేంద్రాల వైపు మళ్ళిస్తాడు.
ధ్యానం చేసే భక్తుడు ఈ రెండు ప్రపంచాల మధ్య కూర్చుని, దేవుని సామ్రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటాడు, కాని ఇంద్రియాలతో పోరాటమందు నియమితుడవుతాడు. ప్రాణాయామం యొక్క శాస్త్రీయ ప్రక్రియ [క్రియాయోగం వంటిది] సహాయంతో, యోగి చివరికి తన చైతన్యాన్ని శ్వాస, హృదయం మరియు ఇంద్రియ చర్యలలో బహిర్గతం చేసిన, బాహ్యంగా-ప్రవహించే ప్రాణశక్తిని వ్యతిరేక దిశలో తిప్పడంలో విజయం సాధిస్తాడు. అతడు ఆత్మ-పరమాత్మ యొక్క సహజ అంతర్గత ప్రశాంత రాజ్యంలోకి ప్రవేశిస్తాడు.
ఇంద్రియ మరియు ప్రేరక నరాల నుండి మనస్సు మరియు ప్రాణశక్తిని ఉపసంహరించుకుని, యోగి వాటిని వెన్నెముక ద్వారా మెదడులోనికి, దాని నుండి నిరంతర కాంతిలోకి తీసుకువెళ్తాడు. ఇక్కడ మనస్సు మరియు ప్రాణం, మస్తిష్కంలో వ్యక్తమయ్యే పరమాత్మ యొక్క శాశ్వతమైన జ్ఞానంతో ఐక్యమవుతాయి.
సగటు వ్యక్తి యొక్క చేతన, అతడి శరీరం మరియు బాహ్య ప్రపంచం మీద కేంద్రీకృతమై ఉంటుంది. యోగి తన చేతనాకేంద్రాన్ని, శరీరము మరియు ప్రాపంచిక ఆశలు మరియు భయాలతో అనుబంధం లేకుండా మార్చుకుంటాడు. చైతన్యాన్ని శరీరానికి కట్టబడేట్లు చేసే ప్రాణ ప్రక్రియలను (హృదయాన్ని, శ్వాసను నిశ్చలం చేయడం ద్వారా) నియంత్రించే క్రియాయోగం వంటి ఒక ప్రక్రియ ద్వారా, యోగి మెదడులో విశ్వచైతన్యం యొక్క ఆధ్యాత్మిక కేంద్రంలో వ్యక్తమయ్యే శాశ్వతమైన జ్ఞానంలో స్థిరపడతాడు. తన చేతనా కేంద్రాన్ని సచేతనా శరీరం నుండి పరమాత్మ యొక్క మస్తిష్క సింహాసనంలోకి మార్చగల యోగి చివరికి తన చేతనను సర్వవ్యాపకత్వం మీద కేంద్రీకరిస్తాడు. అతడు శాశ్వతమైన జ్ఞానాన్ని పొందుతాడు.
క్రియాయోగ సాధన, ప్రశాంతతని మరియు ఆనందాన్ని ప్రసాదిస్తుంది
క్రియా సాధన యొక్క ప్రభావాలు, అత్యంత శాంతిని మరియు ఆనందాన్ని తీసుకువస్తాయి. ఆహ్లాదకరమైన అన్ని శారీరక అనుభూతులతో వచ్చే ఆనందాల కంటే క్రియతో కలిగే ఆనందం చాలా గొప్పది. “ఇంద్రియ ప్రపంచానికి ఆకర్షితుడు కాకుండా, యోగి ఆత్మలో అంతర్లీనంగా ఉన్న నిత్యనవీన ఆనందాన్ని అనుభవం చెందుతాడు. ఆత్మ-పరమాత్మ యొక్క దివ్యసంయోగంలో నిమగ్నమై, అతడు నాశనం లేని ఆనందాన్ని పొందుతాడు.”
నేను న్యూయార్క్‌లో చాలా ధనవంతుడైన ఒక వ్యక్తిని కలిశాను. తన జీవితం గురించి నాకు ఏదో చెప్పేటప్పుడు, “నేను అసహ్యంగా ధనవంతుడిని, మరియు అసహ్యంగా ఆరోగ్యవంతుడిని,” అని అతడు నీరసంగా మాట్లాడాడు. అతడు ముగించే ముందు నేను ఆశ్చర్యంతో, “కానీ మీరు అసహ్యంగా ఆనందంగా లేరు! నిత్య నవీన ఆనందంగా ఉండటానికి నిరంతరం ఆసక్తి ఎలా కలిగి ఉండాలో నేను మీకు నేర్పించగలను.”
అతడు నా విద్యార్థి అయ్యాడు. క్రియాయోగమును అభ్యసించడం ద్వారా, మరియు సమతుల్య జీవితాన్ని గడపడం ద్వారా, నిరంతరం అంతర్గతంగా భగవంతునికి అంకితమవ్వడం ద్వారా, పండువృద్ధాప్యం వరకు ఎల్లప్పుడూ నిత్య నవీన ఆనందంతో ఉల్లాసంగా అతడు జీవించాడు.
తన మరణశయ్యపై అతడి భార్యతో, “నేను పోవడాన్ని నువ్వు చూడటం నాకు బాధగా ఉంది — కానీ విశ్వానికి ప్రియతముడిని చేరుకోవడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా ఆనందానికి సంతోషించు, దుఃఖిస్తూ స్వార్థపడకు. నా ప్రియతమ దేవుణ్ణి కలవడానికి నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు తెలిస్తే, నువ్వు బాధపడవు; ఏదో ఒక రోజు శాశ్వతమైన ఆనందపు వేడుకలో, నువ్వు నాతో కలుస్తావని తెలుసుకున్నందుకు సంతోషించు.”
క్రియను ఎప్పుడూ విడువనివారు మరియు ధ్యానంలో ఎక్కువసేపు కూర్చుని భగవంతుడిని గాఢంగా ప్రార్థించేవారు, ఎంతోకాలంగా కోరుకున్న నిధిని కనుగొంటారు.
సహజమైన అంతర్గత మార్గదర్శకత్వాన్ని క్రియ మేల్కొల్పుతుంది
1946లో పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ ప్రచురణతో క్రియయోగ శాస్త్రం గురించి మొదటగా ప్రపంచ ప్రజలకు తెలియవచ్చింది. ఈ పుస్తకంలో, సంవత్సరాల క్రితం ఆయన తన గురువుగారితో చేసిన ఈ క్రింద సంభాషణను వివరించారు:
అసాధారణమైన గాంభీర్యంతో శ్రీయుక్తేశ్వర్ గారు ఇలా అన్నారు, “యోగానందా, పుట్టినప్పటి నుండి నీ చుట్టూ, లాహిరీ మహాశయుల ప్రత్యక్ష శిష్యులు ఉంటూ వచ్చారు. ఆ మహాగురువులు, మహిమాన్వితమైన తమ జీవితం కొంతవరకు ఏకాంతంలో గడిపారు, పైగా, తమ ఉపదేశాల ప్రచారం కోసం ఎటువంటి సంస్థ నెలకొల్పడానికయినా ఆయన గట్టిగా అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. అయినప్పటికీ విశిష్టమైన జోస్యం ఒకటి చెప్పారు.
“’నేను పోయిన సుమారు ఏభై ఏళ్ల తరువాత, పడమటి దేశాల్లో యోగవిద్య పట్ల కలుగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా, నా జీవిత వృత్తాంతం ఒకటి వ్రాయడం జరుగుతుంది. యోగవిద్యా సందేశం భూగోళాన్ని చుట్టేస్తుంది. సర్వమానవ సోదరత్వాన్ని, అంటే మానవజాతి ఏకైక పరమపిత ప్రత్యక్ష దర్శనంమీద ఆధారపడ్డ ఐకమత్యాన్ని నెలకొల్పడానికి తోడ్పడుతుందది,’ అని చెప్పారు.
“నాయనా, యోగానందా, ఆ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడంలోనూ, ఆయన పవిత్ర జీవితాన్ని గురించి వ్రాయడంలోనూ నీ వంతు పని నువ్వు చెయ్యాలి,” అని శ్రీయుక్తేశ్వర్ గారు అన్నారు.
1895లో లాహిరీ మహాశయులు పోయిన తరవాత, ఈ పుస్తకం పూర్తయిన 1945 సంవత్సరానికి మధ్య ఏభై ఏళ్ళు గతించాయి. పైగా ఈ 1945 సంవత్సరమే యాదృచ్ఛికంగా, విప్లవాత్మకమైన అణుశక్తుల నూతన యుగాన్ని కూడా ప్రవేశపెట్టడం గమనించి చకితుణ్ణి కాకుండా ఉండలేను. ఆలోచనాశీలమైన మనస్సులన్నీ ఇప్పుడు, ముందెన్నడూ లేనంతగా ప్రత్యేకించి శాంతి సోదరత్వాల తక్షణ సమస్యల వైపు మళ్లుతున్నాయి.
[శ్రీయుక్తేశ్వర్ గారు నాతో ఇలా అన్నారు:] “క్రియాయోగం వల్ల మనస్సు, ఇంద్రియావరోధాలన్నిటినీ తొలగించేసిన తరువాత ధ్యానం, దేవుణ్ణి రెండు విధాల నిదర్శనాలతో నిరూపిస్తుంది. మనలో అణువణువుకూ నమ్మకం కలిగించే విధంగా అనుభూతమయ్యే నిత్యనూతనానందం, ఆయన ఉనికికి నిదర్శనం. అంతేకాకుండా, కలిగిన ప్రతి కష్టానికీ ఆయన దగ్గర్నుంచి అవసరమైన సమాధానం, తక్షణ మార్గనిర్దేశరూపంలో ధ్యానంలో లభిస్తుంది.”
నిష్పాక్షికమైన ఆత్మపరిశీలన మరియు క్రియాయోగంలో వలె గాఢమైన ధ్యానం ద్వారా – ఆత్మ-పరమాత్మల యొక్క సంయోగాన్ని అనుభూతి చెందడానికి – తన సహజమైన జ్ఞానము కావల్సినంతగా అభివృద్ధి చెందేవరకు ఏ భక్తుడు కూడా సంతృప్తి చెందకూడదు.
ఒక భక్తుడు ప్రతిరోజూ కొద్ది సమయమైనా గాఢంగా ధ్యానం చేస్తే, మరియు వారానికి ఒక్కసారైనా లేదా రెండు సార్లైనా సుదీర్ఘంగా మూడు లేదా నాలుగు గంటలు గాఢమైన ధ్యానం చేస్తే, ఆత్మ-పరమాత్మల మధ్య జరిగే ఆనందపూర్వకమైన జ్ఞాన సంభాషణ నిరంతరాయంగా గ్రహించడానికి, అతడి అంతర్ దృష్టి కావల్సినంత సున్నితంగా మారుతోందని గ్రహిస్తాడు. మానవభాష యొక్క ఉచ్చారణలతో కాకుండా, మాటలు లేని సహజజ్ఞాన వినిమయం ద్వారా తన ఆత్మ దేవునితో మాట్లాడి, ఆయన నుండి ప్రతిస్పందన పొందుతోందని అనుసంధానం యొక్క అంతర్గత స్థితిలో అతడు తెలుసుకొంటాడు..
పురోభివృద్ధి చెందిన క్రియాయోగి జీవితం, పూర్వ కర్మల ఫలితాలవల్ల కాక, కేవలం ఆత్మనిర్దేశాల వల్లే ప్రభావితమవుతుంది.
సమస్యలు మరియు చెడు అలవాట్లను అధిగమించడానికి దైవ మార్గం
శిష్యుడికి ఏ సమస్య ఎదురైనా సరే, దానికి పరిష్కారంగా క్రియాయోగం సాధన చెయ్యమని సలహా ఇచ్చేవారు లాహిరీ మహాశయులు.
మీరు ఆర్థిక వైఫల్యులు లేదా నైతిక వైఫల్యులు లేదా ఆధ్యాత్మిక వైఫల్యులు అని అనుకుందాం. గాఢమైన ధ్యానం ద్వారా, ‘నేను మరియు నా తండ్రి ఒక్కటే,’ అని ధృవీకరిస్తూ ఉంటే, మీరు దేవుని బిడ్డ అని మీకు తెలుస్తుంది. ఆ ఆదర్శానికి కట్టుబడండి. మీకు గొప్ప ఆనందం కలిగే వరకు ధ్యానం చేయండి. ఆనందం మీ హృదయాన్ని తాకినప్పుడు, ఆయనకు మీరు చేసిన ప్రసారానికి దేవుడు సమాధానం ఇచ్చినట్టు; ఆయన మీ ప్రార్థనలకు మరియు సానుకూల ఆలోచనలకు ప్రతిస్పందిస్తున్నాడు. ఇది ప్రత్యేకమైన మరియు ఖచ్చితమైన పద్ధతి:
మొదట, ‘నేను మరియు నా తండ్రి ఒక్కటి,’ అనే ఆలోచనపై ధ్యానించండి, గొప్ప శాంతిని ఆపై మీ హృదయంలో గొప్ప ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నించండి. ఆ ఆనందం వచ్చినప్పుడు, ‘తండ్రీ, నీవు నాతో ఉన్నావు. తప్పుడు అలవాట్లు మరియు గతకాలపు విత్తనముల ధోరణులు కలిగి ఉన్న నా మెదడు కణాలను దహించమని నాలో ఉన్న నీ శక్తిని నేను ఆజ్ఞాపిస్తున్నాను.’ ధ్యానంలో ఉన్న దేవుని శక్తి అలా చేస్తుంది. మీరు పురుషుడు లేదా స్త్రీ అని పరిమితం చేసే స్పృహ నుండి బయటపడండి; మీరు దేవుని బిడ్డ అని తెలుసుకోండి. అప్పుడు మానసికంగా ధృవీకరించి భగవంతుడిని ప్రార్థించండి: “నా మెదడు కణాలు మారాలని, నన్ను తోలుబొమ్మగా చేసిన చెడు అలవాట్ల గాడులు నాశనం కావాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభూ, నీ దివ్యజ్యోతిలో వాటిని దహించు.” మరియు మీరు ఆత్మసాక్షాత్కార ధ్యాన పద్ధతులను, ముఖ్యంగా క్రియాయోగమును సాధన చేస్తున్నప్పుడు, దేవుని కాంతి మిమ్మల్ని పరిశుద్ధం చేస్తున్నట్టు మీరు నిజంగా చూస్తారు.
భారతదేశములో, చెడు స్వభావం ఉన్న ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు తన యజమానులను చెంపదెబ్బ కొట్టడంలో అతడు నిపుణుడు. కాబట్టి అతడు ఒక ఉద్యోగం తరువాత మరొకదాన్ని పోగొట్టుకున్నాడు. అతడికి ఎంతటి అదుపు చేయలేనంత పట్టరాని కోపం కలిగేదంటే, తనను విసిగించే వారిపై అతడి చేతికి అందినదాన్ని వారిపై విసిరేవాడు. అతడు నా సహాయం కోరాడు. నేను అతడితో ఇలా అన్నాను, “నీకు ఇంకొకసారి కోపం వచ్చినప్పుడు, నువ్వు ప్రతిస్పందించే ముందు వంద వరకు లెక్కపెట్టు.” అతడు దానిని ప్రయత్నించాడు. కాని నా దగ్గరకు తిరిగి వచ్చి ఇలా అన్నాడు, “నేను అలా చేస్తున్నప్పుడు నాకు మరింత కోపం వస్తోంది. నేను లెక్కపెడుతున్నప్పుడు, చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చినందుకు కోపంతో గుడ్డివాడినవుతున్నాను.” అతడి స్థితి నిరాశాజనకంగా అనిపించింది.
నేను అతడితో క్రియాయోగము సాధన చేయమని చెప్పి, మరొక సూచన కూడా చేశాను: “క్రియను మీరు అభ్యసించిన తరువాత, దివ్యకాంతి మీ మెదడులోకి వెళుతోందని, దానిని ఓదారుస్తోందని, మీ నరాలను శాంతపరుస్తోందని, మీ భావోద్వేగాలను శాంతపరుస్తోందని, మొత్తం కోపాన్ని తుడిచేస్తోందని భావించండి. మరియు ఒక రోజు మీ కోపతాపాలన్నీ లేకుండా పోతాయి.” కొంతకాలం తర్వాత అతడు మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. ఈసారి అతడు ఇలా అన్నాడు, “నేను కోపం యొక్క అలవాటు నుండి విముక్తుడినయ్యాను. నేను మీకు చాలా కృతజ్ణుడినై ఉన్నాను.”
నేను అతడిని పరీక్షించాలనుకొన్నాను. నేను కొంతమంది అబ్బాయిలను అతడితో గొడవ పడటానికి ఏర్పాటు చేశాను. అతడ్ని గమనించడం కోసం, అతడు నిత్యం వెళ్ళే మార్గంలో ఉన్న పార్కులో దాక్కున్నాను. అతడ్ని దెబ్బలాటలోకి లాగడానికి బాలురు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించారు, కాని అతడు స్పందించలేదు. అతడు తన ప్రశాంతతను నిలుపుకున్నాడు.
దేవునితో అనుసంధానం పొందడం ద్వారా, మీరు మర్త్యజీవి నుండి అమరజీవిగా మీ స్థితిని మార్చుకుంటారు. మీరు దీన్ని చేసినప్పుడు, మిమ్మల్ని పరిమితం చేసే అన్ని బంధాలు విచ్ఛిన్నమవుతాయి. ఇది గుర్తుంచుకోవలసిన చాలా గొప్ప నియమం. మీ దృష్టి కేంద్రీకరించిన వెంటనే, అన్ని శక్తుల యొక్క శక్తి వస్తుంది, మరియు దానితో మీరు ఆధ్యాత్మిక, మానసిక మరియు భౌతిక సాఫల్యాలను సాధించవచ్చు.
పరిపూర్ణమైన ప్రేమను కనుగొనడం
ధ్యానంలో దేవునితో అనుసంధానం పొందడం ద్వారా అతి గొప్ప ప్రేమను అనుభవించగలుగుతారు. ఆత్మ మరియు పరమాత్మల మధ్య ప్రేమ పరిపూర్ణమైనది, మీరందరూ కోరుకునే ప్రేమ….మీరు గాఢంగా ధ్యానం చేస్తే, ఏ మానవ జిహ్వ కూడా వర్ణించలేని విధంగా మీరు ఒక ప్రేమను పొందుతారు, మరియు ఆ స్వచ్ఛమైన ప్రేమను మీరు ఇతరులకు ఇవ్వగలుగుతారు….మీరు ఆ దివ్యప్రేమను అనుభవించినప్పుడు పువ్వుకి మరియు పశువుకి మధ్య, ఒక మనిషికి మరియు మరొక మనిషికి మధ్య తేడా మీకు కనిపించదు. మీరు ప్రకృతి అంతటితోను సంభాషిస్తారు, మరియు మీరు మానవులందరినీ సమానంగా ప్రేమిస్తారు.