రాజర్షి జనకానంద (జేమ్స్.జె.లిన్). పరమహంస యోగానందగారి ఉన్నత శిష్యుడు, మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కు అధ్యక్షుడిగా వారి తరువాత మొదటి వారసుడిగా మరియు ఆధ్యాత్మిక నాయకుడిగా ఫిబ్రవరి 20, 1955లో ఆయన గతించే వరకు ఉన్నారు. శ్రీ లిన్ మొదటిసారిగా 1932లో పరమహంసగారి నుండి క్రియాయోగ దీక్ష స్వీకరించారు. ఆయన ఆధ్యాత్మిక పురోగతి ఎంత వేగంగా జరిగిందంటే, గురుదేవులు ఆయనకు 1951 లో రాజర్షి జనకానంద అనే సన్యాస బిరుదును ఇచ్చే వరకు ప్రేమతో “సెయింట్ లిన్” అని పిలిచేవారు.
రాజయోగం. భగవంతుడితో ఐక్యానికి “రాజ” లేదా అత్యున్నత మార్గం. ఇది శాస్త్రీయ ధ్యానం (చూ.) భగవంతుణ్ణి తెలుసుకోడానికి అత్యుత్తమ సాధనమని బోధిస్తుంది. ఇందులో అన్ని ఇతర యోగ పద్ధతుల ప్రధాన సారమంతా కలిసి ఉంటుంది. క్రియాయోగ ధ్యానాన్ని పునాదిగా చేసుకొని, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/ సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ రాజయోగ బోధనలు, శరీరం, మనస్సు, ఆత్మల సంపూర్ణ వికాసానికి దారి చూపే ఒక జీవన విధానాన్ని వివరిస్తాయి. యోగం చూడండి.
లాహిరీ మహాశయ. లాహిరీ అనేది శ్యామాచరణ లాహిరీగారి (1828-1895) ఇంటి పేరు. మహాశయ, అనేది ఒక సంస్కృత ధార్మిక బిరుదు. దీని అర్థం “విశాలహృదయులు” అని. లాహిరీ మహాశయులు మహావతార్ బాబాజీ శిష్యులు, స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి (పరమహంస యోగానందగారి గురువుగారు) గురువుగారు. అద్భుతమైన మహిమలు కలిగిన క్రీస్తువంటి ఈ గురువులు, అనేక వ్యావహారిక బాధ్యతలు నిర్వర్తించిన గృహస్థు కూడా. ఆధునిక మానవుడికి సరిపడేటటువంటి ఒక యోగశాస్త్రాన్ని — ధ్యానం, ప్రాపంచిక విధులను సరిగా నిర్వహించడంతో సంతులితమై ఉండేటువంటిది — తెలియచేయడం ఈయన ఉద్యమం. వీరిని యోగావతారులు “ అవతరించిన యోగం” అని పిలిచారు. పురాతనమైన, ఇంచుమించుగా మరుగునపడిపోయిన క్రియాయోగ (చూ.) శాస్త్రాన్ని బాబాజీ తన శిష్యులైన లాహిరీ మహాశయులకు వెల్లడిచేశారు. చిత్తశుద్ధి గల అన్వేషకులకు దీక్షనివ్వమని ఆయనను ఆదేశించారు. ఒక యోగి ఆత్మకథలో లాహిరీ మహాశయుల జీవితం వివరించబడింది.
విశ్వచైతన్యం. కేవల పరమాత్మ; సృష్టికి అతీతమైన పరమాత్మ. స్పందనశీల సృష్టిలోను, దానికి అతీతంగాను ఉండే దేవుడితో ఏకత్వమేర్పడి ఉండే సమాధి–ధ్యాన స్థితి. త్రిత్వము చూడండి.
విశ్వనాదం. ఓం చూడండి.
విశ్వభ్రాంతి. మాయ చూడండి.
విశ్వమేధా స్పందన. ఓం చూడండి.
విశ్వశక్తి. ప్రాణం చూడండి.
వేదాంతం. వాచ్యార్థంలో, “వేదాల అంతం”; ఉపనిషత్తులు లేదా వేదాల ఉత్తర భాగం నుండి పుట్టుకొచ్చినటువంటి తత్త్వశాస్త్రం. శంకరులు (ఎనిమిది లేదా తొమ్మిదో శతాబ్ది తొలి భాగానికి చెందినవారు) ప్రధానంగా వేదాంతానికి వ్యాఖ్యానం చేసినవారు. భగవంతుడొక్కడే సత్యమని, సృష్టి మిథ్య అని వేదాంతం ప్రకటిస్తుంది. మానవుడొక్కడే భగవంతుణ్ణి బుద్ధికి గ్రాహ్యం చేసుకోగల సామర్థ్యమున్న జీవి కనక మానవుడు తనంత తానే దివ్యుడై ఉండాలి; కాబట్టి తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే అతడి కర్తవ్యం కావాలి.
వేదాలు. హిందువుల నాలుగు పవిత్ర గ్రంథాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం. ఇవి ప్రధానంగా అన్ని దశలలో ఉన్న మానవుడి జీవితాన్ని, పనులను శక్తివంతంచేసి, ఆధ్యాత్మికీకరణ చేయడానికి ఉపయోగపడే మంత్రాలను, అనుష్ఠానాలను, వల్లెవేసే వాటిని కలిగి ఉన్న సాహిత్యం. భారతదేశంలో ఉన్న అనేక గ్రంథాలలో వేదాలు మాత్రమే (విద్, సంస్కృత మూలం, “తెలుసుకోవడం”) ఏ గ్రంథకర్తా రచన చేసినట్లుగా చెప్పబడని గ్రంథాలు. వేద మంత్రాలు దైవప్రోక్తాలనీ అవి “సనాతన కాలం” నుండి ఉన్నవనీ, కొత్త భాషా తొడుగు వేసుకొన్నాయనీ ఋగ్వేదం మనకు చెబుతుంది. యుగయుగాలుగా ఋషులు లేక జ్ఞానులకు దైవికంగా దర్శనమవుతూ, ఈ నాలుగు వేదాలూ నిత్యత్వాన్ని కలిగి, “కాల దోషం పట్టని చివరి మాటలు”గా ఉన్నాయి.
శక్తిపూరణ వ్యాయామాలు. ఏ విధంగా అయితే నీటిలోని చేప చుట్టూ నీరు వ్యాపించి ఉందో, అదే విధంగా మనిషి విశ్వశక్తితో పరివ్యాప్తమై ఉన్నాడు. పరమహంస యోగానందగారు కనుక్కొన్న — యోగదా సత్సంగ పాఠాల (చూ.) లో బోధించే — ఈ వ్యాయామాలు మానవుడు తన శరీరాన్ని విశ్వశక్తితో లేదా విశ్వప్రాణంతో నింపుకునేటట్లు చేస్తాయి.
శ్వాస. “శ్వాస ద్వారా లెక్కలేనన్ని వైశ్విక ప్రవాహాలు మానవుడి శరీరంలోకి రావడంవల్ల అతడి మనస్సులో చంచలతను ప్రేరేపిస్తాయి,” అని పరమహంస యోగానందగారు రాశారు. “ఆ విధంగా శ్వాస అతడిని దృగ్గోచరమైన, క్షణ భంగురమైన ప్రపంచంతో కలుపుతుంది. అశాశ్వతత్వం నుంచి కలిగే దుఃఖాలను తప్పించుకోవడానికి, దివ్యానందకరమైన సత్యస్తరంలోకి ప్రవేశించడానికి, శాస్త్రీయమైన ధ్యానం ద్వారా శ్వాసను నిశ్చలంచేయడం యోగి నేర్చుకుంటాడు.”
శిష్యుడు. భగవంతుడితో పరిచయాన్ని కాంక్షిస్తూ, గురువు దగ్గరకు వచ్చే ఆధ్యాత్మిక అభిలాషి. దానికోసమై అతడు గురువుతో ఒక శాశ్వతమయిన ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఏర్పరుచుకుంటాడు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/ సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ లో క్రియాయోగ దీక్ష ద్వారా ఈ గురుశిష్య సంబంధం ఏర్పడుతుంది. గురువు, క్రియాయోగం కూడా చూడండి.