ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగ బోధనలను వ్యాప్తి చేయడానికి పరమహంస యోగానందగారు పశ్చిమ దేశాలలో అడుగుపెట్టి ఒక శతాబ్దమైన సందర్భంగా, 2020 ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ సమ్మేళనంలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు ఇచ్చిన ప్రారంభోపన్యాసం నుండి ఈ క్రింద విషయాలు సంగ్రహించబడ్డాయి. “పరమహంస యోగానందగారి ఎపోక్-మేకింగ్ మిషన్ అండ్ హిజ్ విజన్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ” అనే పేరుతోగల పూర్తి వ్యాసాన్ని యోగదా సత్సంగ పత్రిక సభ్యులు విస్తృతమైన ఆన్లైన్ లైబ్రరీలోని గత వ్యాసాలలో మరియు ఆడియో విషయసూచికలో (ఇంగ్లీషులో) చదువవచ్చు మరియు వినవచ్చు. పూర్తి ఉపన్యాసం యొక్క వీడియోను ఎస్.ఆర్.ఎఫ్. వెబ్సైట్లో కూడా చూడవచ్చు.
పవిత్ర హిమాలయ పర్వతాలు వేలాది సంవత్సరాలుగా యోగులకు, ధ్యానులకు, సాధువులకు మరియు ఋషులకు, ఇంకా కొద్దిమంది ఉన్నత దివ్యజీవులకు — అవతార పురుషులు లేదా దైవ అవతారాలకు — మౌన ఏకాంత నిలయంగా ఉన్నాయి.
ఇప్పుడు, ఆ దృశ్యాన్ని మనస్సులో చిత్రీకరించుకోండి: సమాజంలోని గందరగోళాలకు మరియు దాని సమస్యలకు మరియు ఆందోళనలకు దూరంగా ఉన్న ఆ ఏకాంతమైన, అందమైన, మహిమాన్వితమైన, సురక్షితమైన పర్వత ఆశ్రయం. ఆ మహాత్ములు — ఆ సాధువులు, ధ్యానులు మరియు యోగులు — సృష్టి యొక్క అత్యున్నత సత్యాలను తెలుసుకోవడానికి మరియు తమ స్వీయ దైవత్వాన్ని జాగృతం చేసుకోవడానికి తమను తాము అంకితం చేసుకున్నారు, ఇంకా కొద్దిమంది అదృష్టవంతులైన శిష్యులు భూమిపై ఉన్న ఆ స్వర్గానికి ఏదో ఒక విధంగా తమ మార్గం కనుగొనగలిగేలా దీవించబడ్డారు.
ఇప్పుడు ఆధునిక సమాజం యొక్క విరుద్ధమైన దృశ్యాన్ని ఇలా ఊహించుకోండి (మనము మానసిక ఊహా చిత్రణ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇదంతా మన ముందు ఎంతో సత్యమైనది): భయాలతో కూడిన ఒత్తిడి, మరియు ధనం సంపాదించడానికి పరుగులు, సంఘర్షణలు, గందరగోళాలు; పర్యావరణ కాలుష్యం, నిరాశ్రయం మరియు పేదరికం, యుద్ధాలు, జాతి వైరుధ్యాలు మరియు మతపరమైన సంఘర్షణలతో ఆవరించి ఉంది. దురదృష్టవశాత్తు, ఈ జాబితా అంతులేనిది. ఇది ఎంత తేడాగా ఉంది కదా? ఋషుల పావన నిలయమైన శాంతి, సామరస్యం మరియు దివ్యమైన వాతావరణానికి ఇది చాలా విరుద్ధమైనది.
కానీ సుమారుగా 100 సంవత్సరాల క్రితం (దాని కంటే కొంచెం ఎక్కువగా) నిజంగా ఒక్క కొత్త శకానికి అంకురార్పణ జరిగిందని మనమిప్పుడు గ్రహించవచ్చు. పరమహంస యోగానందగారు చెప్పినట్లుగా, మానవ సంబంధమైన బాధలు మరియు సమస్యలను అధిగమించడానికి కావలసిన సార్వత్రిక సిద్ధాంతాలు, పద్ధతులపై తమకుగల లోతైన అవగాహనను, మరియు తమ ఆధ్యాత్మిక ఆశీస్సులను, జ్ఞాన సిద్ధులైన ఆ యోగులు, సాధువులు మరియు మహాత్ములు ఏకాంత పర్వతాలు మరియు అరణ్యాలలోని ఆశ్రమాల నుండి ఈ జన బాహుళ్యంలోకి తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభించారు.
దైవ-సాక్షాత్కారం యొక్క అత్యున్నత యోగ శాస్త్రం సనాతనమైన భారతదేశం నుండి ఆధునిక భౌతిక ప్రపంచానికి విస్తరించడం మరియు వ్యాపించడం ప్రారంభమైంది — ఇది ప్రపంచానికి ఎంతో అవసరం.
ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో, పరమహంసగారు ఇలా చెప్పారు: “బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడూ సన్నిహిత సంబంధముంటూనే ఉంది. వీరిద్దరూ కలసి ముక్తిప్రదమయిన స్పందనలను ప్రసరింపజేస్తూనే ఉంటారు. అంతే కాకుండా వీరు, ఈ యుగంలో మోక్షప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు. ఒకరు సశరీరులుగాను, మరొకరు అశరీరులుగాను ఉన్న ఈ సంపూర్ణ జ్ఞానసిద్ధులు చేసే పని ఏమిటంటే: యుద్ధాలనూ జాతివిద్వేషాలనూ మతపరమయిన పక్షపాతాన్నీ ప్రయోగించినవాళ్ళకే బెడిసికొట్టే భౌతికవాద దుష్పరిణామాలనూ విడిచిపెట్టవలసిందిగా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం. ఆధునిక యుగ ధోరణి బాబాజీకి బాగా తెలుసు; ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలోని క్లిష్టతల ప్రభావం ఇంకా బాగా తెలుసు. అంతే కాదు, యోగపరమయిన ఆత్మవిమోచన పద్ధతులను ప్రాచ్య, పాశ్చాత్య దేశాలన్నిటా సమంగా వ్యాప్తి చేయవలసిన అవసరాన్ని గ్రహించారాయన.”
“ప్రాశ్చ్య మరియు పశ్చిమ దేశాలలోను” మరియు ప్రపంచవ్యాప్తంగాను యోగ విద్యను సమానంగా వ్యాప్తి చేసే బృహత్ కార్యం పరమహంస యోగానందగారికి అప్పగించబడింది. ఆయన తీసుకువచ్చిన వాటిలోని ముఖ్యాంశాలను నేను ఉటంకించాలని అనుకుంటున్నాను.
పరమహంస యోగానందగారు మనందరికీ అందించినది ఏమిటి
1920లో పరమహంసగారు బోస్టనులో ఆ ఓడ నుండి బయటకు అడుగుపెట్టినప్పుడు, ఆయన ఏమి తీసుకువస్తున్నారో, మరియు అది ఎంత గొప్ప భాండాగారమో మహాత్ములైన పరమ గురువులకు తెలుసు — అది ఆధునిక నాగరికత యొక్క దిశను అక్షరాలా మార్చేస్తుంది.
కాని, ఆ ప్రారంభ రోజుల్లో ఆయనను కలిసినవారికి, బహుశా దాని ప్రాముఖ్యతను పూర్తిగా గ్రహించడానికి కొంత సమయం పట్టి ఉంటుంది. 100 సంవత్సరాల తరువాత వెనక్కి తిరిగి చూసినప్పుడు, వారి మొదటి స్నేహితులు మరియు విద్యార్థులు ఇంకా కనుగొనని సంఘటనలపై, సూక్ష్మదర్శిని ద్వారా దృష్టి సారించగల అవకాశం మనకు ఉంది. ఆరు అంశాలలో, మన గురుదేవులు పరమహంసగారు అందించిన కొన్ని ముఖ్యమైన విషయాలను నేను విశదీకరిస్తాను:
1. జీవితం యొక్క దివ్య ఉద్దేశ్యాన్ని తెలియచేసే సార్వత్రిక దృక్పథం — నైతిక మరియు ఆధ్యాత్మిక అర్థాన్ని కోల్పోయిన ఆధునిక నాగరికత కోసం. యోగానందగారు భారతదేశం యొక్క ప్రాచీన సనాతన ధర్మాన్ని (“శాశ్వతమైన సత్యసూత్రాలు”) స్వీకరించి, అవి ఆధునిక యుగంలో పురుషులు మరియు స్త్రీలకు అర్థమయ్యేలా, నమ్మదగినవిగా మరియు ముఖ్యంగా వారికి వర్తించే విధంగా పునరుద్ధరించారు. అలా చేయడం ద్వారా, ఆయన మనస్తత్వశాస్త్రం, మతం, వైద్యం, విద్య మరియు ఎన్నో విషయాలకు సంబంధించిన అత్యాధునికమైన ఆలోచనలు మరియు అభ్యాసాల క్రమాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు, కాలం గడిచేకొద్దీ అవి ప్రజల మనస్సులలో పాతుకుపోయాయి. ఆయన మనకు అందించింది ఈ మాత్రమే అయినా, అది ఎంతో ప్రాముఖ్యమైనదవుతుంది. కానీ ఆ జాబితా ఇంకా కొనసాగుతుంది.
2. ఆధునిక స్త్రీ పురుషులకు భగవంతుడిని చేరువగా, ముఖ్యమైనదిగా మరియు కోరదగినదిగా చేసే దైవ భావన. దేవుడు ప్రతీకారము తీర్చుకొనే న్యాయమూర్తిగా పాశ్చాత్య దేశాలలో అనేకమందికి సాధారణంగా ఉన్న తప్పుడు భావనను పరమహంసగారు పూర్తిగా తొలగించారు. బదులుగా, నిత్యనూతన ఆనందమే దేవుని స్వభావమని ఆయన బోధించారు; మరియు దేవుని స్వరూపంలోనే రూపొందించబడిన మానవులు, దేవుడిని తండ్రి, తల్లి, స్నేహితుడు, దివ్య ప్రేమికుడిగా, లేదా ఆత్మను వ్యక్తంచేసే గుణాలైన అనంతమైన ఆనందం, జ్ఞానం, కాంతి, శాంతి మరియు ప్రేమలలో ఏదో ఒకదానిగా తెలుసుకోవచ్చు.
ఈ విప్లవాత్మకమైన దేవుని భావన ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో పెరిగి స్థిరంగా పాదుకొన్నది. కాబట్టి, గతంలోని మీ మతపరమైన పెంపకం కారణంగా “దేవుడు” అనే పదంతో ఇబ్బందులు ఉన్నవారిలో మీరూ ఒకరయితే, వై.ఎస్.ఎస్. పాఠాల కోసం పరమహంసగారి “ఆత్మ-సాక్షాత్కారం ద్వారా అత్యున్నత విజయాలు” అనే పరిచయ పాఠాన్ని చదివి మీకు మీరే సహాయం చేసుకోండి. “దేవుడు అంటే ఏమిటి?” అనే విషయం మీద ఒక పూర్తి విభాగం ఉంది, ఇది మీకు చాలా భిన్నమైన దృష్టికోణాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నాను.
3. దైవ-సాక్షాత్కార స్థితిని ప్రతి ఒక్కరు సాధించడానికి అవసరమయిన దశలవారీ సూచనల సాధనా సముదాయం.
4. మానవజాతి మరియు సర్వ సత్యమతాల ఆవశ్యకమైన ఐక్య దర్శనం. ఒకసారి పరమహంస యోగానందగారు ఎంతో అందంగా ఇలా అన్నారు: “ఏసుక్రీస్తు లేదా శ్రీకృష్ణుడు లేదా సనాతన ఋషులు ఏ వ్యక్తినయినా క్రైస్తవుడు, హిందువు, యూదుడు మొదలైన పేర్లతో పిలవడాన్ని నేను ఊహించలేను, ప్రతి వ్యక్తిని వాళ్ళు ‘నా సోదరుడు’ అని పిలవడాన్నే నేను ఊహించగలను.”
ఆ భావన అందంగా ఉంది కదా? సత్యమైన ఆధ్యాత్మిక మార్గాలన్నిటిలో ఉన్న ఏకత్వాన్ని మనకోసం మనం గ్రహించగలిగేలా దర్శనశక్తిని, అవకాశాన్ని పరమహంసగారు మనకు అందించారు — మరియు మానవులందరికీ ఆ అవగాహనను విస్తరింపజేశారు. క్రైస్తవ మతం మరియు హిందూ మతం యొక్క ప్రధాన గ్రంథాలపై తన సంచలనాత్మక వ్యాఖ్యానాల ద్వారా, ఈ మార్గాలు రెండు ఒక సాధారణ శాస్త్రీయ పునాదిని పంచుకుంటాయని ఆయన చూపించారు — ధ్యానం యొక్క ఖచ్చితమైన పద్ధతులను సాధన చేయడం వల్ల మతాలన్నిటికీ, మానవులందరికీ, సృష్టి అంతటికీ ఆధారమైన ఒకే సత్యాన్ని ప్రత్యక్ష వ్యక్తిగత అనుభవంగా పొందడానికి మార్గం ఏర్పరుస్తుంది.
పరమహంసగారు తీసుకువచ్చిన పరిమాణం నుండి రవంతైనా పొందడం మీరు ప్రారంభిస్తున్నారా? నిజంగా విప్లవాత్మకమైన (Truly epoch-making) — ఆయనను ఈ ప్రపంచానికి అందించమని చెప్పబడిన బోధనలను వర్ణించడానికి ఆయన ఉపయోగించిన పదం ఇది.
5. శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క సంతులిత అభివృద్ధి కోసం “జీవించడం-ఎలా” అనే సూత్రాల యొక్క సంపూర్ణ ప్రణాళిక. 70 సంవత్సరాల క్రితం పరమహంసగారి రచనలు, వ్యాసాలు మరియు ఉపన్యాసాల నుండి సంగ్రహించబడిన యోగదా సత్సంగ పాఠాలు చదివినప్పుడు, ఆయనకు ఎంత దూరదృష్టి ఉందో మీరు గ్రహిస్తారు.
ఆయన తీసుకువచ్చిన సంతులిత లేదా సంపూర్ణమైన జీవనశైలి, చాలా ముఖ్యమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి నిజంగా సహాయపడింది, ఇప్పుడు అవి మానవ శ్రేయస్సుకు శాస్త్రీయ ప్రాతిపదికగా సూచించబడుతున్నాయి.
6. గురుశిష్య సంబంధాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకోవడం. ప్రాచీన కాలం నుండి గురుశిష్య సంబంధం చిత్తశుద్ధిగల దైవాన్వేషకులకు — సత్యాన్ని చిత్తశుద్ధితో అన్వేషించేవారికి — దైవసాక్షాత్కార మార్గంలో పురోగమించడానికి ఒక సాధనంగా ఉన్నది. ఇంకా ఆ సంబంధం యొక్క నిజమైన అర్థం ఇటీవలి శతాబ్దాలలో మరుగున పడిపోయింది మరియు క్షీణించిపోయింది. కానీ మన గురుదేవులు తన జీవితంలో దానికి దృష్టాంతంగా నిలిచి, తన దగ్గర ఉన్నవారికి అదే శిక్షణ ఇచ్చారు, తద్ద్వారా మనందరికీ అది విస్తరించబడినది, ఆ పవిత్రమైన గురుశిష్య సంబంధం యొక్క నిజమైన అర్థాన్ని ప్రపంచానికి తిరిగి ఇవ్వడం చూస్తున్నాము.
కాబట్టి, మనందరి ప్రయోజనం కోసం ఆయన తీసుకువచ్చిన దానిలో ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు. నేను వీటిని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, చరిత్రలో ఈ క్షణంలో ప్రపంచం పరిష్కరించాల్సిన వాటిని అవి సూచిస్తాయి — లక్షణాలు మాత్రమే కాదు, ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలకు మూల కారణాలు….
ప్రపంచానికి మన అత్యున్నత సహాయాన్ని ఎలా అందించగలం
పరమహంసగారు చెప్పినట్లుగా, “మిమ్మల్ని మీరు మార్చుకోండి, అప్పుడు ప్రపంచాన్ని మార్చడంలో మీ వంతు కృషి మీరు చేసినట్లే.” అవును, మన ముందు అడ్డంకులు ఉన్నాయి — మనందరికీ ఇది తెలుసు. మనం వాటి గురించి తెలుసుకోవాలి, తద్ద్వారా మనము వాటిని విజయవంతంగా అధిగమించగలము. విచారకరమైన వాస్తవం ఏమిటంటే, నేటి ప్రపంచంలో ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా ఎంతో అంధకారం ఉంది. మన చుట్టూ ఉన్నదాన్ని చూడకుండా శారీరకమైన అంధకారం నిరోధిస్తుంది. కాని ఆధ్యాత్మికమైన లేదా మానసికమైన అంధకారం మనకు అందుబాటులో ఉన్న, మనము గ్రహించని సామర్థ్యాలను చూడకుండా నిరోధిస్తుంది.
మరో మాటలో చెప్పాలంటే, ఆ ఆధ్యాత్మిక అంధకారం మనల్ని నిరుత్సాహపరుస్తుంది. ఇది మనకు ఓటమి భావన లేదా బాధించబడుతున్నట్లుగా లేదా భయపడుతున్నట్లుగా లేదా శక్తిహీనుడిగా భావించే విధముగా చేయడానికి ప్రయత్నిస్తుంది. యోగ పరిభాషలో ఈ అంధకారానికి ఒక పేరు ఉంది: మాయ, భ్రమ. అంధకారం యొక్క విశ్వశక్తి సత్యాన్ని కప్పి వేస్తుంది మరియు అస్పష్టం చేస్తుంది. తద్ద్వారా మనం సత్యమైనదాన్ని దర్శించలేము లేదా మన చుట్టూ ఉన్నదాన్ని కూడా ఖచ్చితంగా దర్శించలేము.
ఈ రోజు ప్రపంచంలో జరుగుతున్న వాటి గురించి మనం నిరుత్సాహపడకూడదు. బదులుగా, మనం ఇంతకు ముందు మానసిక ఊహా చిత్రణ చేస్తున్న శాంతి మరియు సామరస్యం యొక్క సహజమైన నివాసంలో ఉంటున్న ఆ యోగులను జ్ఞాపకం చేసుకోండి — వారు మనందరికీ పంపిన వాటిని జ్ఞప్తికి తెచ్చుకోండి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నవాటి గురించి, ప్రపంచం ఎదుర్కొంటున్నవాటి గురించి, జీసస్ మరియు బాబాజీ ముందుగానే ఖచ్చితంగా ఊహించారు, అందుకే వారు పరమహంస యోగానందగారిని మరియు క్రియాయోగ బోధనలను ప్రపంచానికి పంపించారని గుర్తుంచుకోండి.
అవును, ఆ అంధకారం, మాయ యొక్క క్రిందికిలాగే తత్వం, ప్రస్తుతం చాలా చురుకుగా ఉంది — దాని గురించి ఎటువంటి ప్రశ్న లేదు. కాని మాయ, అంధకారం, భ్రమ మరియు అజ్ఞానంపై మనం విజయం సాధించడానికే యోగశాస్త్రమంతా రూపొందించబడింది, తద్ద్వారా మనలో ప్రతి ఒక్కరు సత్యం ముందు ముఖాముఖిగా నిలబడగలరు.
ప్రతి ఆత్మకు; ప్రతి జాతి, మతం లేదా ఏ వర్గానికి చెందిన స్త్రీ, పురుషుడు మరియు పిల్లలకు — ఇదే సత్యం: మనము దివ్యజీవులం. మన గురుదేవులు చెప్పినట్లుగా “నక్షత్రాలకు వెలుగును, వాయువులకు మరియు తుఫానులకు శక్తిని ఇచ్చే ఆ గొప్ప ఆనందం మరియు దైవ ఆనందం” పొందడానికి అపరిమితమైన సామర్థ్యం ఉన్న దివ్య జీవులం మనం.
ఒక ఆత్మ ప్రేమికుడిగా, ఒక దైవ ప్రేమికుడిగా మరియు అన్నిటిలో ఉన్న దేవుణ్ణి ప్రేమించేవాడిగా — ప్రపంచం మధ్యలో ఒక మర్మయోగిగా ఉండడమంటే అదే.
పరమహంస యోగానందగారు ప్రపంచానికి తీసుకువచ్చిన లోతైన అవగాహన మరియు జీవిత-పరివర్తనా పద్ధతులను ఆచరణలో పెట్టడానికి మీకు ఆసక్తి ఉంటే, మా వెబ్సైట్లో ఉన్న ఆయన యోగదా సత్సంగ పాఠాల గురించి మరింతగా తెలుసుకోవడం మొదటి అడుగు అవుతుంది, అక్కడ మీరు పరమహంసగారి పరిచయ పాఠాన్ని చదువవచ్చు మరియు భారతదేశం యొక్క సార్వత్రిక బోధనలు మరియు యోగా యొక్క శాస్త్రీయ పద్ధతులను సమగ్రంగా మరియు గ్రహించగలిగేలా అందించబడే గృహ అధ్యయన పాఠ్య క్రమంలో ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకోవచ్చు — మరియు జీవితంలోని అన్ని దశలకు వీటిని వెంటనే వర్తింప చేసుకోవచ్చు.
పరమహంస యోగానందగారి జ్ఞానాన్ని మరింతగా చదవడానికి మీకు ఆసక్తి ఉంటే వై.ఎస్.ఎస్. బుక్ స్టోర్లో ఆధ్యాత్మిక మహాకావ్యమైన ఒక యోగి ఆత్మకథ తో పాటు, పశ్చిమంలో పరమహంసగారి మొదటి ఉపన్యాసం యొక్క ముద్రణా రూపమైన మత విజ్ఞాన శాస్త్రము మరియు మరెన్నో ఇతర ప్రచురణలను కనుగొనవచ్చు.