యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ మూడవ అధ్యక్షురాలు మరియు సంఘమాత అయిన శ్రీ దయామాతగారి ఒక సందేశం ఈ క్రింద ఇవ్వబడింది. 1955 నుండి 2010లో గతించేవరకు ఆ పాత్రలో ఆమె సేవలందించారు. 1931లో 17 సంవత్సరాల వయస్సులో దయామాతగారు, పరమహంస యోగానందగారి ఆశ్రమంలో చేరారు. ఈ సందేశం 1984లో యోగదా సత్సంగ పత్రికలో “శ్రీ దయామాతగారి ఒక లేఖ” గా మొదటిసారి ప్రచురించబడింది. తమకు ప్రోత్సాహం మరియు విలువైన సలహాలను ఇచ్చే ఇటువంటి సందేశాలను పత్రిక యొక్క పాఠకులు దశాబ్దాలుగా ఇష్టపడుతున్నారు.
చాలాకాలం క్రితం, గురుదేవులు పరమహంస యోగానందగారు నా చైతన్యంపై ఈ ఉపదేశాన్ని ముద్రించారు “ఎన్నడూ నిరుత్సాహపడకండి.” సంవత్సరాలుగా గొప్ప శక్తికి అది ఒక మూలాధారముగా ఉంది. ఆధ్యాత్మిక విజయానికి ఇది ఒక ముఖ్యమైన రహస్యం.
భక్తుల పురోగతికి ఆటంకం కలిగించే మాయ యొక్క ముఖ్యమైన సాధనాల్లో నిరుత్సాహం ఒకటి. ఎక్కువ ప్రయత్నం చేయాలనే మన కోరికను అది అణచివేసి, విజయం సాధించే వరకు పట్టుదలగా ఉండాలనే మన కోరికను అది బలహీనపరుస్తుంది. కాని మన లక్ష్యం — భగవంతునితో ఐక్యత — ఉన్నతమైనదని మనం గ్రహించి, మన ప్రతిబంధకాలను అధిగమించాలి. మన లోపాలను పదేపదే గుర్తించడం కూడా మన ఉత్సాహాన్ని తగ్గించడానికి అనుమతించకూడదు.
నిరుత్సాహపరిచే భావాలు, బలహీనపరిచే ఆలోచనలు ఏవయినా, అవి మన ఉన్నతిని నిరోధించడానికి మాయ కలిగించే భ్రమ యొక్క సూచనలు. మనం వాటిని విస్మరించి విశ్వాసంతో, ధైర్యంతో ముందుకు సాగితే, మనం ఆధ్యాత్మిక విజయాన్ని పొందుతాం. అదే పరమహంసగారి ఆదర్శం. అప్పుడు, ఆయన చెప్పినట్లుగా, “చీకటి ఎన్నడూ లేనట్లుగా అదృశ్యమవుతుంది.”
ఒక యువ భక్తురాలిగా ఉన్నప్పుడు, గురుదేవులు దూరంగా ఉన్న సమయంలో కొద్దికాలంపాటు ఒక తీవ్రమైన నిరుత్సాహం నన్ను ఆవరించింది. ఆయన తిరిగి వచ్చాక, ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయనకొక అంతర్దర్శనం కలిగింది: మొదట నా సంఘర్షణ వెనుక ఉన్న ప్రతికూల శక్తులను, ఆ తరువాత జగన్మాత స్వయంగా కాంతి వలయంతో నన్ను చుట్టుముట్టినట్లుగా ఆయన దర్శించారు.
ప్రతి కష్టంలో, మనలో ప్రతి ఒక్కరికీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుంది: హృదయాన్ని కోల్పోయి మాయకు లోనవ్వడం; లేదా మాయను జయించడానికి, జగన్మాత మనకు దగ్గరలోనే ఉండి తన శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉందని గ్రహించి సంపూర్ణ విశ్వాసంతో పట్టు విడువకపోవడం.
ఆధ్యాత్మిక మార్గంలో మనం మూడు అడుగులు ముందుకు, రెండు అడుగులు వెనక్కు వేస్తున్నట్లు తరచుగా అనిపించవచ్చు. కాని మనం వాస్తవికంగా ఉంటే, మనల్ని నిరుత్సాహపరచడానికి దీన్ని మనం అనుమతించము, లేదా గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ సమయాన్ని మనం వృధా చేయము.
మన పొరబాట్ల నుండి నేర్చుకోవాలని, పరివర్తన చెందేందుకు నిశ్చయించుకోవాలని, ఆ తరువాత వాటిని మరచిపోవాలని పరమహంసగారు మాకు నేర్పించారు. మనం పొరబాట్లు చేసినప్పుడు భగవంతుడు మనల్ని శిక్షించడు, కాబట్టి మనల్ని మనం నిందించుకోకూడదు.
బదులుగా, భగవంతుణ్ణి మరింతగా ప్రేమించండి. మీ లోపాలు మిమ్మల్ని భయపెట్టలేనంతగా, ఆయన వద్దకు మీ పరుగును ఆపలేనంతగా ఆయనతో ప్రేమలో ఉండండి.
ఆయన సంపూర్ణమైన కరుణ, సంపూర్ణమైన దయ; ఆయన ప్రేమలో శాశ్వత సాఫల్యతను మీరు పొందాలని ఆయన కంటే ఎక్కువగా మరెవ్వరు ఆతృతగా లేరు. స్థిరమైన భక్తితో ఆయన్ని అన్వేషిస్తూ, ధ్యానిస్తూ ఆత్మవిశ్వాసంతో ఆయన్ని సమీపించండి, అప్పుడు మీరు ఆయన్ని తెలుసుకొంటారు.



















