“దివ్యసంకల్పాలతో మీ అవచేతనా మనస్సులో సానుకూల ఆలోచనలను స్థిరపరచుకోవడం” గురించి పరమహంస యోగానందగారు

9 మే, 2024

1940లో కాలిఫోర్నియాలోని ఎన్సినీటస్ లో పరమహంస యోగానందగారి “విజయం పొందడానికి చేతన మరియు అవచేతన మనస్సులకు శిక్షణ ఇవ్వడం” అనే ప్రసంగం నుండి ఈ క్రింది సారాంశం సంగ్రహించబడినది. పూర్తి ప్రసంగం 2015 జూలై-సెప్టెంబర్ మరియు అక్టోబర్-డిసెంబర్ లలోని యోగదా సత్సంగ పత్రికలో రెండు భాగాలుగా ప్రచురించబడింది. ఈ ప్రసంగాన్ని యోగదా సత్సంగ ఆన్లైన్ లైబ్రరీ — పత్రిక యొక్క చందాదారులకు అందుబాటులో ఉన్న విస్తృతమైన జ్ఞాన నిధి — లో (ఆంగ్లంలో) పూర్తిగా చదవవచ్చు.

ఈ సాధికారిక మరియు ప్రోత్సాహకరమైన అంశంపై ఆ పూర్తి ప్రసంగంలోను, మరియు యోగదా సత్సంగ పాఠాలలోనూ ఎంతో లోతుగా, చేతన మరియు అవచేతన మనస్సులను ఉత్తమంగా ఎలా ఉపయోగించుకోవచ్చనే విషయము గురించే కాకుండా, విజయం పొందేందుకు అధిచేతన మనస్సు యొక్క సాధ్యతను గురించి పరమహంసగారు చర్చించారు — సహజావబోధం ద్వారా సత్యాన్ని నేరుగా గ్రహించే ఆత్మ యొక్క సర్వగ్రాహకశక్తి.

అవచేతన మనస్సులో బలం మరియు సరైన ఆలోచనను ప్రేరేపించడం కోసం, దివ్యసంకల్పాన్ని సాధన చేయడం ద్వారా మీ మనస్సుకు సానుకూల ఆలోచనలు మరియు అభివృద్ధిని సూచించండి. సగం నిద్ర స్థితిలో ఉండడం మంచిది. నిద్రకు ముందు మరియు నిద్ర తరువాతి సమయాలలో ఎక్కువగా గ్రహించుకోవడం జరుగుతుంది; అందుకే కొంతమంది “నిద్రలో అభ్యాసం” లేదా నిద్రలో అవచేతన శిక్షణను సమర్థిస్తారు.

తన భర్తకు ధూమపాన అలవాటును నయం చేయాలనుకున్న ఒక మహిళ ఉండేది. ప్రతి రాత్రి ఆమె అతని మంచం దగ్గర నిలబడి ఇలా చెబుతూ ఉండేది: “రోజురోజుకు, అన్ని విధాలుగా, మీరు పొగ అలవాటును వదిలి వేస్తున్నారు.” కాని ఆమె భర్త ఇంకా నిద్రపోలేదు. నయం చేయడానికి తన భార్య చేస్తున్న ప్రయత్నాలను భరించగలిగినంత కాలం అతను భరించాడు, ఆపై బిగ్గరగా ఏడ్చాడు, “ఈ గందరగోళం ఆపు, నేను నయం కావాలని కోరుకోవడం లేదు!” కాబట్టి మీరు ఎవరికైనా మంచి అలవాటును సూచిస్తున్నప్పుడు, ఆ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడా లేక బాగా నిద్రపోతున్నాడా అని నిర్ధారించుకోండి!

విషయం ఏమిటంటే: దివ్యసంకల్పాలను మీరు సాధన చేస్తున్నప్పుడు మీ అవచేతన మనస్సులో విరుద్ధమైన ఆలోచనలను కలిగి ఉండకూడదు. మీరు ఏది ధృవీకరిస్తున్నా, ప్రతికూల ఆలోచనలన్నీ తుడిచిపెట్టుకు పోయేవరకు మీరు మీ మానసిక పునరావృత్తిని కొనసాగించాలి. మీరు ఒక దివ్యసంకాల్పాన్ని ఎంచుకొని, మీ చైతన్యమంతా ఆ ఒక్క ఆలోచనలో మునిగిపోయే వరకు పదే పదే దానిని పునరుచ్చరించండి.

ఉదాహరణకు, మీరు అనారోగ్యంతో ఉండి, మీకు వైద్యం అవసరమని అనుకుందాం. “పరిపూర్ణ ఆరోగ్యం నా శరీర కణాలన్నింటిలో విస్తరిస్తుంది” అని మీరు ధృవీకరించవచ్చు. అదే సమయంలో మీ అవచేతన మనస్సులో అంతర్లీనంగా ఇలా అనిపించవచ్చు, “నీ పని అయిపోయింది. నువ్వు ఆరోగ్యంగా ఉండలేవు!” మీ అవచేతన మనస్సు మిమ్మల్ని నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించినప్పటికీ మీరు మంచి ఆరోగ్యాన్ని ధృవీకరిస్తూనే ఉంటే, మీరు చివరికి ప్రతికూల ఆలోచన యొక్క అవచేతన అలవాటును తరిమివేసి, మంచి ఆరోగ్యం యొక్క నూతన మానసిక నమూనాను ప్రారంభిస్తారు. అప్పుడు మీరు స్వస్థత పొందుతారు, ఎందుకంటే, శరీరాన్ని నిర్వహించేది మరియు అంతర్గత జీవ ప్రక్రియలన్నిటినీ మరమ్మత్తు చేసి నియంత్రించేదీ శక్తివంతమైన అవచేతన మనస్సే.

ప్రతి రాత్రి పడుకొనే ముందు, మీరు కోరుకునే దేనినైనా సాధించడానికి చాలా గాఢంగా ధృవీకరించండి. దేవుడు కావాలని మీరు కోరుకుంటే, ప్రతి రాత్రి దాన్ని ధృవీకరించండి: “నేను మరియు నా తండ్రి ఒక్కటే.” మీరు దేవుని కోసం ప్రార్థిస్తే, మీరు అన్నిటి కోసం ప్రార్థించినట్లే. మీకు ఏమి కావాలో దేవుడికి తెలుసు. మీరు చెవిని లాగితే, శిరస్సు కూడా దానితో పాటు వస్తుంది. దేవుడిని కనుగొనడం వల్ల, న్యాయమైన కోరికలన్నీ నెరవేరినట్లు మీరు కనుగొంటారు.

మీ అవచేతనలో సందేహించే మనస్సు ఇలా చెప్పవచ్చు, “ఓహ్, ధ్యానం వల్ల ఉపయోగం ఏమిటి? నేను ధ్యానం చేశాను, కాని దేవుడు నా దగ్గరకు రాలేదు!” నేను పోరాడవలసిన చెడు ఆలోచన మరియు ఆటంకము అదే. కాని నేను ధ్యానాన్ని నిలకడగా కొనసాగిస్తూ, సంకల్పం మరియు దివ్యసంకల్పంతో ఓటమి అనే ఆ ఆలోచన పోయే వరకు నిరంతరం అవచేతన మనస్సును ప్రతిఘటించినప్పుడు, దేవుడు సమాధి-పరమానంద వైభవంలో తనను తాను నాకు వెల్లడించాడు.

ఇతరులతో పంచుకోండి