“పరమహంస యోగానందగారి జ్ఞానాన్ని ఎలా సముపార్జించాలో నేర్చుకోవడం” — శ్రీ మృణాళినీమాత తెలిపిన ఒక వృత్తాంతం

09 నవంబర్, 2023

2011 నుండి 2017లో తాను పరమపదించే వరకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌కు సంఘమాతగా మరియు నాల్గవ అధ్యక్షురాలిగా సేవలందించిన శ్రీ మృణాళినీమాత యొక్క వ్యాసం “ది సైన్స్ ఆఫ్ స్పిరిచ్యువల్ స్టడీ అండ్ ఆర్ట్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్” నుండి ఈ బ్లాగ్ పోస్ట్ సంగ్రహించబడినది. 2017 జనవరి – మార్చి యోగదా సత్సంగ పత్రిక సంచికలో ఇది ప్రచురించబడినది.

మేము నివసిస్తున్న ఎన్సినీటస్ లో (ఆశ్రమంలో) మాకు ఒక చిన్న శిష్యబృందం ఉండేది; ఆదివారం ఉదయం, గురుదేవులు [పరమహంస యోగానంద] శాన్ డియాగో మందిరంలో (లాస్ ఏంజిలిస్ లోని హాలీవుడ్ మందిరానికి ప్రత్యామ్నాయంగా) వారం విడిచి వారం ఇచ్చే ఉపన్యాసాలకు మేము హాజరయ్యేవాళ్ళం.

తన ఉపన్యాసాలు లేదా పాఠాలు చెబుతున్నప్పుడు వాటిని వ్రాసుకోమని మమ్మల్ని ఆయన ప్రోత్సహించేవారు. తరువాత, ఆ వారంలో, మేము ప్రతి సాయంత్రం ఆశ్రమంలోని విశ్రాంతి ప్రదేశంలో లేదా భోజనాల గదిలోని బల్ల చుట్టూ చేరి మేము వ్రాసుకొన్నది సరిపోల్చుకునేవాళ్ళం.

వారి బోధనల నుండి మేము గ్రహించినదాన్ని మాలోని ప్రతి ఒక్కరము మళ్ళీ స్మరించుకొని, వాటిని మేము చర్చించేవాళ్ళం. ఆ తరువాత, మాలోని ప్రతి ఒక్కరం, స్వయంగా మేము వ్రాసుకున్న ఆయన బోధనలను మా స్వీయ ఆలోచనలతో పునఃనిర్మించేవాళ్ళం. అలాగే, మా స్వీయ జీవితాలలో ఆ బోధనలను ఎలా అన్వయించుకోవచ్చో ఆత్మపరిశీలన చేసుకునేవాళ్ళం.

అలా మేము ఒకటి, రెండు వారాలు, గురుదేవుల బోధనల్లోని ఒక తరగతిపై గడిపేవాళ్ళం. అది మాకు గురుదేవుల జ్ఞానాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని ఎలా అలవరచుకోవాలో మాత్రమే కాకుండా, దానిని ఎలా అన్వయించుకోవాలో నేర్పించింది.

కొన్నిసార్లు గురుదేవులు తరువాత వారంలో ఎన్సినీటస్ కు తిరిగి వచ్చినప్పుడు, మేము మా తార్కిక అధ్యయనంలో ఉన్నప్పుడు గురుదేవులు గదిలోకి వచ్చేవారు. సహజంగానే గురుదేవుల ముందు మా “పాండిత్యము”ను వివరించడానికి సిగ్గుపడేవాళ్ళం!

కాని గురుదేవులు కూర్చుని ఇలా అనేవారు, “లేదు, లేదు, కానివ్వండి; ముందుకు సాగండి.” అప్పుడు మేము నేర్చుకున్నదాన్ని వ్యక్తీకరించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఎంతో సంతోషించేవారు. మేము ఎంత గ్రహించామో తెలుసుకోవడానికని పాఠశాలలోని ఒక ప్రధానాధ్యాపకుడిలా ఆయన మమ్మల్ని ఇలా ప్రశ్నించేవారు: “ఇప్పుడు దీని గురించి నేను ఏమి చెప్పాను?” లేదా “దాని గురించి నేను ఏమి చెప్పాను?” “నేను వాడిన ఆ పదానికి అర్థమేమిటి?” అని అడిగేవారు.

మాకు అన్నీ అర్థం కాలేదన్న విషయం మాత్రం నేను మీకు చెప్పగలను! కాబట్టి ఉపన్యాసాలకు మేము హాజరైనప్పుడు, మా యువ ఆశ్రమవాసులను మందిరంలోని ముందు వరుసలో గురుదేవులు కూర్చోబెట్టేవారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు, బహుశా ఒక గాఢమైన లేదా సంక్లిష్టమైన తాత్విక అంశాన్ని ప్రస్తావించిన తరువాత, ఆయన తన ప్రసంగాన్ని ఆపి, ఉపన్యాస వేదికపై నుండి మమ్మల్ని చూసి, “మీకు అర్థమైందా?” అని అడిగేవారు.

“ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు?” లేదా “ఆయన చెబుతున్నదానితో క్రింద ఉన్న ఆ చిన్న పిల్లలకు సంబంధమేమిటి?” అని సమావేశములో ఉన్న మిగిలినవారు ఆశ్చర్యపోయి ఉండవచ్చు.

జ్ఞానసముపార్జన కోసం తన చరణాలను ఆశ్రయించిన చిన్న శిష్యులకు గురువుగా, మరియు జగద్గురువుగా—ప్రపంచంతమంతటికీ ఒక గురువుగా—జనబాహుళ్యానికి ఈ సత్యాలను ప్రసాదించేవారిగా ఆయన రెండు పాత్రలను నిర్వర్తిస్తున్నారని మీరు తెలుసుకోవచ్చు.

గురుదేవులు మాతో ఉన్నప్పుడు మాకు మార్గదర్శిగా ఉండేవారు. మేము పొరపాటు చేస్తున్నప్పుడు కొన్ని మాటల ద్వారా లేదా మౌనంగా ఒక అర్థవంతమైన చూపుతో కూడా ఆయన మాకు తెలియజేసేవారు. సరైన ప్రవర్తనా విధానం ఎలా ఉండాలో మాకు వారు తెలియచెప్పేవారు.

ఈ విషయాలను మనకు తెలియజేయడానికి ఆయన భౌతిక రూపంలో లేరు. కాని, ఆయన మాతో ఇలా చెప్పారు: “నేను గతించిన తరువాత, నా బోధనలే మీకు గురువు. ఈ ఎస్.ఆర్.ఎఫ్. [వై.ఎస్.ఎస్.] బోధనల ద్వారా మీరు నాతోనూ, నన్ను పంపిన మహా గురువులతోనూ అనుసంధానంలో ఉంటారు.”

ఆ మాటలు ఎంత సత్యమైనవో నేను ఇప్పుడు గ్రహించాను. ఎందుకంటే పరమహంసగారి బోధనలను ఆయన పుస్తకాల నుండి, ఎస్.ఆర్.ఎఫ్. (వై.ఎస్.ఎస్.) పాఠాల నుండి క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నపుడు, అవి నిరంతర ప్రేరణకు మూలాధారం మాత్రమే గాక, మనకు వ్యక్తిగత మార్గనిర్దేశాన్ని మరియు సలహాలను కూడా అందిస్తాయని మనం గ్రహిస్తాం.

మనకు నిజంగా మార్గనిర్దేశం అవసరమైనప్పుడు, మనల్ని మభ్యపెట్టడానికి లేదా ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్న ఏదో మాయా శక్తి నుండి మనకు నిజంగా రక్షణ అవసరమైనప్పుడు, గురుదేవుల బోధనలను మన జీవితంలో భాగంగా చేసుకొంటే, ఆ భోదనలలోని గురుదేవుల వచనాలే మనకు సహాయం చేస్తాయి.

ఈ దిగువన ఉన్న లింకు ద్వారా మీరు యోగదా సత్సంగ పాఠాలు—పరమహంస యోగానందగారి ధ్యాన శాస్త్రం మరియు సమతుల్య ఆధ్యాత్మిక జీవన కళపై సమగ్ర గృహ-అధ్యయన కోర్సు—గురించి మరింత తెలుసుకోవచ్చు. ఈ పాఠాలను తన బోధనలలో ప్రధానమైనవిగా పరమహంసగారు ఊహించారు—క్రియాయోగ ధ్యాన ప్రక్రియలను మరియు సంపూర్ణ జీవన విధానాన్ని అందించారు—తద్ద్వారా సాధకులు ఆ సూచనల నుండి నేరుగా పరమహంసగారి జ్ఞానాన్ని గ్రహించవచ్చు మరియు ఆధ్యాత్మిక మార్గంలో గురుదేవుల వ్యక్తిగత మార్గనిర్దేశాన్ని పొందవచ్చు.

ఇతరులతో పంచుకోండి