నూతన సంవత్సరంలో విజయానికి రహస్యం గురించి శ్రీ పరమహంస యోగానంద

10 జనవరి, 2023

PY-2403_6-03-cropped_sepia

సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరం వచ్చింది. కానీ కొన్నిసార్లు సందేహం కలుగుతుంది: కొత్త సంవత్సరంలో మన జీవితాల్లో శాశ్వతమైన మార్పులు చేయడం నిజంగా సాధ్యమేనా?

మీరు అలవాట్ల యొక్క సున్నిత స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు — స్థిరమైన అలవాట్లను కూడా; మరియు మీ చైతన్యాన్ని మార్చడానికి మీ సంకల్పశక్తిని ఉపయోగించినప్పుడు, మీ జీవితంలోని అన్ని ఇతర అంశాలను మార్చడానికి అది అగ్రగామి అవుతుందని, భరోసా కలిగిస్తుందని పరమహంస యోగానందగారు చెప్పారు.

“కొత్త సంవత్సరంలో మన గమనాన్ని తీర్చిదిద్దుకోవడానికి సహాయకరమైన భగవంతుని అపార చైతన్యంతో అనుసంధానం పొందడానికి ఆత్మ పరిశీలన మరియు ధ్యానం చేయమని, ఆ తరువాత మన జీవితాలను అధీనంలో ఉంచుకొనేందుకు ఆయన దివ్య బహుమానాలైన ఆలోచనా శక్తిని మరియు సంకల్పాన్ని ఉపయోగంచుకోవలసిందిగా పరమహంసగారు ప్రోత్సహించేవారు” అని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ స్వామి చిదానంద గిరి అన్నారు.

మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మూడవ అధ్యక్షులు శ్రీ దయామాతగారు మనకు ఇలా హామీ ఇచ్చారు: “శాశ్వతమైన విలువగల లక్ష్యం కోసం తక్షణ సంతృప్తిని పక్కన పెట్టగల సామర్థ్యం, విలువైన దేనినైనా సాధించడానికి అవసరం. అలా చేయడం వలన అన్నిటినీ సాధించగల ఆత్మశక్తి యొక్క దృఢత్వం ఎక్కువగా వ్యక్తమవుతుంది.”

ఆ తర్వాత ఆమె ఈ కీలకమైన విషయాన్ని జోడించారు: “ఓర్పుతో పట్టుదలతో పనిచేస్తే విజయాన్ని సాధించడం మాత్రమే కాదు, అది అనివార్యమైనదనే నమ్మకంతో ప్రతిరోజూ చిన్న చిన్న అడుగులు వేయడం మంచిది.”

పరమహంసగారు చెప్పినట్లుగా, “మీ జీవితపు అగ్నికణం వెనుక అనంతం యొక్క జ్వాల ఉంది….మీ జీవితం వెనుక ఉన్న గొప్ప శక్తిని అనుభూతి చెందకుండా నిరోధించేది ఏదీ లేదు” అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.

కాబట్టి, గొప్ప నెరవేర్పు అనే ఆలోచనతో మీ ఆత్మ ఉప్పొంగుతోందా — కొత్త సంవత్సరం అనే ద్వారం ద్వారా విజయవంతంగా ఎలా అడుగుపెట్టాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?

పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:

మీరు నాటడానికి బాధ్యత వహించే కొత్త సంవత్సరాన్ని తోటగా చిత్రీకరించుకోండి. ఈ మట్టిలో మంచి అలవాట్లను నాటండి మరియు గతంలోని చింతలను మరియు తప్పుడు చర్యలనే కలుపు మొక్కలను తీసివేయండి.

ఈ కొత్త సంవత్సరంలో, మీ చైతన్యాన్ని మార్చుకోండి. స్వేచ్ఛకు దారితీసే సరైన ప్రవర్తన మరియు మంచి అలవాట్లను పెంపొందించుకోండి. “నేను చెడు అలవాట్లలో మునిగిపోను ఎందుకంటే అవి నా హితానికి వ్యతిరేకంగా ఉంటాయి; నేను నా ఇష్టానుసారం మంచితనాన్ని ఎంచుకుంటాను,” అని మీరు ఇలా చెప్పగలిగినప్పుడు, అదే స్వేచ్ఛ; మరియు నేను మీ కోసం కోరుకునేది అదే.

అలవాట్లు అనేవి కేవలం మెదడులోకి ఆలోచనలతో లోతుగా ఏర్పడ్డ గాడులు. మనస్సు యొక్క సూచి ఆ అలవాట్ల గాడులలో ఏర్పడ్డ ముద్రలను పదే పదే ప్రదర్శిస్తుంది….మనస్సు మరియు సంకల్పాన్ని ఉపయోగించి ఆ గాడుల ఆకృతులను మార్చవచ్చు.

ఆకస్మిక మార్పుల కోసం వెంటనే ప్రయత్నించవద్దు. మీ స్వాభావిక ఆజ్ఞాశక్తికి శిక్షణ ఇవ్వడం కోసం ముందుగా చిన్న విషయాలతో ప్రయోగాలు చేయండి.

మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, ఆ ఆకృతిని ఇప్పుడే అభివృద్ధి చేయడం మొదలుపెట్టండి. మీరు మీ మనస్సులో బలమైన ఆలోచనను చొప్పించినట్లయితే, మీరు ఇప్పుడే మీ చైతన్యంలోకి మీకు కావలసిన ఏ ధోరణిని అయినా చేర్చవచ్చు; అప్పుడు మీ చర్యలు మరియు మీ అస్తిత్వమంతా ఆ ఆలోచనకు కట్టుబడి ఉంటుంది. ఒకే దృక్పథంగల మనస్తత్వంలో స్థిరపడకండి. మీరు ఏ వృత్తిలో అయినా విజయం సాధించగలగాలి లేదా మీరు మనసుపెట్టిన దేనినైనా మీరు చేయగలగాలి. నేను ఒక పని చేయలేనని ఇతరులు చెప్పినప్పుడు, నేను దానిని చేయగలనని నా మనస్సులో నిర్ణయించుకున్నాను, మరియు ఆ పనిని నేను చేశాను!

గత సంవత్సరంలో జరిగిన అందమైన సంఘటనల గురించి ఆలోచించండి. నిరాశ కలిగించిన అనుభవాలను మరచిపోండి. మీరు గతంలో చేసిన మంచిని నూతన సంవత్సరం యొక్క తాజా నేలపై నాటండి, ఆ కీలకమైన విత్తనాలు మరింత మెరుగ్గా ఎదుగుతాయి.

ఇతరులతో పంచుకోండి