“యుక్తమైన రీతిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మిమ్మల్ని మీరు ఇప్పుడే సన్నద్ధం చేసుకోండి” — పరమహంస యోగానంద

16 డిసెంబర్, 2022

పరమహంస యోగానందులు రచించిన ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: ద రిసరక్షన్ ఆఫ్ క్రైస్ట్ వితిన్ యు లోని క్రిస్మస్ సందేశంలోని సారాంశం ఇది — ఏసు యొక్క అసలైన బోధనలపై పరమహంసగారి ప్రవచన వ్యాఖ్యానం. “క్రీస్తు చైతన్య జననము మన స్వీయ చైతన్యంలో సాక్షాత్కారం పొందడమే నిజమైన క్రిస్మస్ వేడుక” అని ఆయన చెప్పారు. మేము పర్వదిన తరుణంలో అడుగిడే సమయాన, మనలో జనించే నిజమైన శాంతి మరియు సంతోషం కోసం ఉద్దేశించబడిన క్రిస్మస్‌ను పండుగలాగా మార్చడానికి “జీవించడం ఎలా” అనే జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఇప్పుడే ఆరంభించే అవకాశాన్ని శ్రీ పరమహంసగారు మనకు అందిస్తున్నారు.

సర్వ మానవాళిని సమానంగా ప్రేమించే — క్రీస్తు-ప్రేమను పూజావేదికగా — మీ హృదయాన్ని సృజించుకోండి, తద్ద్వారా మీరు జనులందరినీ ప్రేమించవచ్చు, వారి మానవ-మందిరాలలోని సర్వవ్యాపకమైన క్రీస్తు ఉనికిని సందర్శిస్తారు.

ఏసు తన విరోధులను క్షమించినట్లే — మీ నిజమైన మరియు మానసికమైన — శత్రువులందరినీ క్షమించండి. వారికి మీరు పంచే మంచికి బదులుగా తమ క్రూరమైన చర్యలతో, మాటలతో లేదా కృతఘ్నతతో మిమ్మల్ని శిలువ వేసే వారి పట్ల కరుణతో కూడిన అవగాహనతో మీ హృదయాన్ని నింపండి. మీ ప్రార్థన ఇలా ఉండనివ్వండి: “తండ్రీ, ఏ తప్పు చేస్తున్నారో తెలియని నా సోదరులను ప్రేమించడం నాకు నేర్పు. నా నిర్దయతో వారిని దుష్ట అగాధాలలోకి నడిపించనీయకు, మరి నా ప్రేమ వారిని మంచి జీవన మార్గాల వైపు ప్రేరేపించుగాక.

ఏసుక్రీస్తు యొక్క నిజాయితీ మరియు నిర్భయత్వంతో మీ జీవితంలోని సర్వ కార్యాలను శాసించండి.

సాతాను ప్రలోభాలను ఏసు అధిగమించినట్లే, దుఃఖాన్ని కలిగించే పరీక్షలను ఆత్మనిగ్రహంతో అధిగమించండి [పదకోశంలో మాయ చూడండి]. మంచి విషయాలన్నిటికీ ప్రాధాన్యతను పెంపొందించుకోండి. ఇంద్రియ దుర్వినియోగం చేయడం వల్ల పొందే తాత్కాలిక ఆనందాలను విడిచిపెట్టి, ఆత్మ యొక్క శాశ్వతమైన, నిజమైన ఆనందాన్ని అన్వేషించండి.

ఇతరులకు చెడుకు బదులు మంచిని, అపార్థానికి మారుగా అవగాహనను, నిర్దయకు ప్రతిగా కరుణను ఇవ్వండి. మీలో, అశాంతికి మారు శాంతిని, వ్యాకులతకు ప్రతిగా ప్రశాంతతను ఇంకా ఐహిక ఆనందానికి బదులుగా శాశ్వత ఆనందాన్ని భర్తీ చేయండి.

విశిష్ట ఆధ్యాత్మిక బహుమతులైన మీ ఉత్తమ గుణాలను అక్కఱ ఉన్న వారికి ఒసగండి మరియు మీ స్వీయ హితం కోసం మిమ్మల్ని ప్రేమించే మహాత్ముల నుండి అత్మోన్నత గుణాలను స్వీకరించండి.

ధ్యానం ద్వారా జాగృతమైన మీ చైతన్యంలో, ప్రతి క్రిస్మస్ తరుణంలోను లేదా మరే ఇతర కాలాల్లోనైనా క్రీస్తు మళ్ళీ జన్మించవచ్చని గుర్తుంచుకోండి. మీ అంకిత శ్రద్ధలో సరికొత్తగా జనించిన సర్వవ్యాపకుడైన, సజీవ క్రీస్తును దర్శించండి. మీకు అపరిచితమైన క్రీస్తును మీ దైనందిన గాఢ ధ్యానంలో ఆయనతో అనుసంధానం పొందడం ద్వారా నిత్యనూతనమైన, నిరంతరము పెరుగుతున్న ఆనందంగా తెలుసుకోండి. ధ్యానం యొక్క ఈ ఆనందంగా క్రీస్తును ప్రేమించండి, మీలో అతని పునరుత్థానం: ఈ విధంగా ప్రతి రోజు ఆధ్యాత్మిక క్రిస్మస్ ను జరుపుకోండి,

సమస్త ప్రకృతి వైభవంలోను, జాగృతమైన మీ జ్ఞానంలోను, నిజమైన సౌందర్యాన్ని సంతరించుకున్న ప్రతిదానిలోను, క్రీస్తు పరిమళ గుణాలతో నిండిన ప్రతి ఒక్కరిలోను క్రీస్తు యొక్క పునరుత్థానంను దర్శించండి.

క్రిస్మస్ తరుణంలో మీరు చేసే ప్రతీ పని క్రీస్తు గూర్చిన తలంపులతోను, క్రీస్తు యొక్క శాంతితోను నెరవేర్చండి.

అందరిలో ఉన్న క్రీస్తుకు అర్పిస్తున్నట్లుగా బహుమతులు ఇచ్చి పుచ్చుకోండి; మరియు మీ ప్రశాంత చైతన్యమనే క్రిస్మస్ మాను మీద దివ్యంగా అలంకరించబడి, దివ్య ఆత్మ లక్షణాలతో ప్రకాశిస్తున్న మీ హృదయాన్ని ఆయనకు బహుమతిగా సమర్పించండి. అక్కడ, క్రీస్తు నుండి స్వయంగా ఆయన్నే బహుమతిగా పొందండి.

ధ్యాన ద్వారము ద్వారా, ఖైదు చేయబడిన మీ ఆనందం విడుదలై, అంతటా నిండి ఉన్న క్రీస్తు యొక్క హృదయంలో విశ్రాంతి తీసుకోనివ్వండి. మీ ఆనందాన్ని సుదూర గ్రహాలలో, విశాల ఆకాశం పై, మీరు కలుసుకున్న, ప్రేమించిన మరియు మీకు అత్యంత సన్నిహిత ఆత్మల తరంగాలలో నాట్యం చేయనివ్వండి.అప్పుడు మీరు సృష్టి యొక్క ప్రతి వ్యక్తీకరణలో ఉన్న క్రీస్తును దర్శిస్తారు. క్రీస్తు యొక్క సర్వవ్యాపక ఆనందాన్ని మహాత్ములందరిలో, మానవులందరిలో, జీవులన్నిటిలో, నక్షత్రాలతో నిండిన విశ్వంలో, మీ ఆలోచనల ఊయలలో మరియు మీ ఆత్మ మందిరంలో కనుగొంటారు.

మీరు క్రిస్మస్ సమయంలో, వ్యక్తిగతంగా వై.ఎస్.ఎస్. ఆశ్రమం లేదా కేంద్రం లేదా ఆన్‌లైన్‌లో మాతో చేరాలని మేము ఆశిస్తున్నాము. దిగువన మీరు రెండు లింకులను కనుగొంటారు, ఒకటి మీకు సమీపంలో ఉన్న వై.ఎస్.ఎస్. కేంద్రాన్ని కనుగొనడానికి మిమ్మల్ని తీసుకువెళ్తుంది, ఇంకొకటి క్రిస్మస్ సమయంలో నిజమైన స్ఫూర్తిని గాఢంగా పొందడానికి మరింత ప్రేరణ మరియు మార్గదర్శకత్వంతో కూడిన వనరుల పేజీకి మిమ్మల్ని తీసుకు వెళుతుంది!

ఇతరులతో పంచుకోండి