పరమహంస యోగానందగారి కార్యానికి మీరు ఇస్తున్న ప్రేమపూర్వక మద్దతుకు ధన్యవాదాలు

22 మార్చి, 2022

పరమహంస-యోగానందగారికి-ప్రేమపూర్వక-మద్దతు-బ్లాగ్

ప్రియమైన దివ్య ఆత్మస్వరూపులారా,

మన ప్రియ గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా 105వ వార్షికోత్సవం సందర్భంగా మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆదర్శప్రాయమైన ఆయన దివ్యప్రేమను వ్యక్తం చేసే మీలోని ప్రతి ఒక్కరి ద్వారా ఆయన ఆత్మ జీవించే ఉంటుంది.

మన ప్రియ గురుదేవుల దివ్య ఆధ్యాత్మిక కుటుంబంలోని అంకితభావంగల సభ్యులైన మీ అందరి నుండి మాకు లభించిన ప్రేమ మరియు మద్దతు మమ్మల్ని గాఢంగా స్పృశించాయి, గడిచిన దశాబ్దాలలో అత్యంత సవాళ్ళను ఎదుర్కొన్న కాలాలలో ఒకటిగా ఈ సంవత్సరం నిలిచిపోతుంది. మాకు మీరందించిన కీలకమైన సహకారం గురుదేవుల కార్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేలా చేశాయి – జీవితాలను ఉన్నతంగా మార్చే క్రియాయోగ బోధనలతో అనేక మంది సత్యాన్వేషకులను చేరుకోవడం మరియు మహమ్మారి బారిన పడిన వారి కోసం అనేక మానవతా కార్యకలాపాలను నిర్వహించడం.

ఆన్‌లైన్‌ సామూహిక ధ్యానం యొక్క ఆశీస్సులు

మన ప్రియతమ అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు జనవరి 31, 2021న వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్‌ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు, తద్వారా భారతదేశంలోను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతరులతో సామూహికంగా ధ్యానం చేసుకునే పావనమైన అవకాశాన్ని భక్తులకు మరియు స్నేహితులకు కలుగచేశారు. గత సంవత్సరంలో ఆన్‌లైన్‌ ధ్యాన కేంద్రం యొక్క కార్యకలాపాలు అనేక రెట్లు పెరిగాయి – సాధనా సంగమాలు, పునశ్చరణ సంగమాలు (రిట్రీట్స్) భగవద్గీతపై ఉపన్యాసాలు, ఒక యోగి ఆత్మకథ యొక్క సామూహిక అధ్యయనం మరియు ఇంకా మరెన్నో – ప్రతివారం ఇంగ్లీష్, హిందీ మరియు ఇతర భారతీయ భాషలలో లభించే కార్యక్రమాల కోసం లాగిన్ అయ్యి పాల్గొన్న వేలాదిమంది తమ అద్భుతమైన ప్రతిస్పందన, అపారమైన ప్రశంసలు మరియు ప్రేమను వ్యక్తం చేశారు.

మహమ్మారి తీవ్రంగా వ్యాపించిన రెండవ దశలో వై.ఎస్.ఎస్. సన్యాసులు ప్రతిరోజు నిర్వహించిన ఆన్‌లైన్‌ స్వస్థతా సేవలు – కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న చాలామంది భక్తులకు – ఓదార్పును, మద్దతును, స్వస్థతను చేకూర్చే స్థిరమైన మూలాధారంగా, ఆధ్యాత్మిక జీవనరేఖగా నిరూపించబడ్డాయి.

వందలాది మంది భక్తుల సమన్వయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ సాధ్యమయ్యాయి.

గత సంవత్సరంలో మనమందరం కలిసి ఏమి సాధించాము

మీ ఉదారమైన సహాయం అనేక వై.ఎస్.ఎస్. పుస్తకాలు మరియు ఆడియో రికార్డింగ్ ల డిజిటలైజేషన్ ను సులభతరం చేసింది, ఇప్పటికే ఉన్న వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌ను నవీకరించడమే కాకుండా మొత్తం వెబ్‌సైట్‌ను వివిధ భారతీయ భాషల్లోకి అనువదించడానికి మరియు రూపొందించడానికి సన్యాసుల మార్గదర్శకత్వంలో చాలా మంది భక్తులు అవిశ్రాంతంగా పని చేశారు. ప్రస్తుతం వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌ హిందీ, తమిళ భాషలలోకి అనువదించబడింది. అదనపు భాషలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

మా విజ్ఞప్తులకు మీ హృదయపూర్వకమైన మరియు దయతో కూడిన ప్రతిస్పందన ద్వారా దేశవ్యాప్తంగా కొవిడ్-ఉపశమనకారక చర్యలను చేపట్టడం వై.ఎస్.ఎస్.కి సాధ్యమయ్యింది. ఈ విపత్తు సమయంలో మీరు చాలామంది ప్రాణాలను కాపాడేందుకు మరియు వేలాదిమందిని ఓదార్చేందుకు సహాయం చేశారు. పేదలకు మరియు అవసరమైన వారికి కొవిడ్-ఉపశమన సామాగ్రిని పంపిణీ చేయడానికి ధైర్యంగా సహాయం చేసిన వాలంటీర్లకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇటువంటి నిస్వార్థ సేవ కారణంగా అనేక నగరాలు మరియు పట్టణాలలో స్థానిక ప్రభుత్వ అధికారుల గుర్తింపును వై.ఎస్.ఎస్. పొందింది. అందుకు మీకు ధన్యవాదములు!

గత ఏడాది కాలంలో వై.ఎస్.ఎస్. కీలకంగా దృష్టి సారించిన కార్యకలాపాలలో ఒకటి ఏమిటంటే పాఠాల కొత్త సంచికను భారతీయ భాషల్లోకి అనువదించడం. అనేక మంది సన్యాసులు మరియు భక్తులతో కూడిన వేరు వేరు బృందాలు హిందీ, తమిళం, తెలుగు మరియు బెంగాలీ అనే నాలుగు ప్రధాన భాషల్లో ఈ కార్యాన్ని నెరవేర్చడంలో నిమగ్నమై ఉన్నాయి.

ముందు చూపుతో

ఇటీవల, వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు కేంద్రాలు సందర్శకుల వ్యక్తిగత ధ్యానాల కోసం తెరవబడ్డాయి, త్వరలో సామూహిక ధ్యాన కార్యక్రమములు మరియు ఇతర కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. దేశవ్యాప్తంగా సన్యాసుల పర్యటన కార్యక్రమాలను కూడా పునఃప్రారంభించాలని మేము యోచిస్తున్నాము.

మన ప్రియతమ గురుదేవుల మాటలలో దైవపరమైన ఆశ మరియు భద్రతను మనము పొందెదము గాక : “మీరు భగవంతునితో జీవించినట్లయితే, జీవితం మరియు మరణం, ఆరోగ్యం మరియు అనారోగ్యం యొక్క భ్రమల నుండి విముక్తి పొందుతారు. భగవంతునిలో ఉండండి. ఆయన ప్రేమను అనుభవించండి. దేనికీ భయపడకండి. దేవుని కోటలో మాత్రమే మనకు రక్షణ లభిస్తుంది. ఆయన సాన్నిధ్యాన్ని మించిన, సురక్షితమైన, సంతోషకరమైన స్వర్గం మరొకటి లేదు. మీరు ఆయనతో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదీ తాకదు.”

మన గురుదేవుల పావనమైన కార్యం కోసం మీరు చేసేదంతా విలువైనదిగా మేము భావిస్తున్నాము. మీరు వారి అడుగుజాడలను అనుసరించడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తున్నప్పుడు, భగవంతుడు మరియు గురుదేవుల విస్తారమైన ప్రేమను అనుభవించెదరు గాక.

దివ్య స్నేహంలో,
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

ఇతరులతో పంచుకోండి