“సెల్ఫ్-రియలైజేషన్: నోయింగ్ యువర్ ఇన్ఫినిట్ నేచర్,” అనే ప్రసంగం యొక్క సారాంశం ఈ క్రింద పోస్ట్ చేయబడినది. పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు వ్యాసాల సంకలనం సంపుటం IV నుండి సేకరించబడి త్వరలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా మరియు తరువాత యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా విడుదల చేయబడే సాల్వింగ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్, సంపుటం IV లో దీన్ని పూర్తిగా చదవగలరు.
అన్ని గొప్ప మతాల బోధనలు దేవుని వద్దకే చేరుస్తాయి; కానీ వారి వైవిధ్యభరితమైన బాహ్య ఆచారాలనే అడ్డదారులు అంతిమంగా సాధకుడిని ధ్యానం అనే ఒక ఆంతరిక రాజమార్గం వైపు తీసుకురావాలి.
శరీరం మరియు పరిమిత ప్రపంచం పై ఆలోచనల నుండి చైతన్యాన్ని ఉపసంహరించుకోవడం మరియు దానిని పరమాత్మలో విలీనం చేయడమే భగవంతుడిలో లీనం కాగల ముక్తి కి ఏకైక మార్గం. యేసు ధ్యానం చేశాడు. దేవుని వైపు అవసరమైన మొదటి అడుగులైన — నైతిక మరియు ఆధ్యాత్మిక సత్యాలను ఆయన ప్రజా బాహుళ్యానికి బోధించాడు; కానీ తన దగ్గరి శిష్యులకు మాత్రం ఆయన దేవునితో నిజమైన ఐక్యత పొందగల ధ్యానం అనే ఉన్నత శాస్త్రాన్ని బోధించాడు.
కేవలం ధ్యానం అనే ప్రక్రియ మాత్రమే మీకు స్వేచ్ఛను తెచ్చిపెట్టదు; మీ స్వభావం ధృఢంగా మరియు స్వచ్ఛంగా ఉండాలి. మీ మొత్తం జీవితం మరియు ప్రవర్తన సత్యం యొక్క నియమాలకు సామరస్యంగా ఉండాలి. యమం మరియు నియమం అనేవి యోగధ్యాన మార్గం యొక్క మొదటి నియమాలు — పది ఆజ్ఞలకు అనుగుణంగా మీరు చేయకూడని కొన్ని విషయాలు (“నువ్వు చంపకూడదు,” “నీవు తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు,” “నీవు వ్యభిచారం చేయకూడదు” మరియు మొదలైనవి); మరియు మీరు అనుసరించాల్సిన సానుకూల సూచనలు: స్వచ్ఛత, సమచిత్తముతో కూడిన సంతృప్తి, ఆత్మపరిశీలన (స్వీయ-అధ్యయనం), భగవంతుని పట్ల భక్తి మరియు స్వీయ-క్రమశిక్షణ.
ధ్యానంలో పురోగతి సాధించాలంటే, మీరు గర్వం, కోపం, దురాశ, అసూయ నుండి విముక్తి పొందేందుకు కృషి చేయాలి. మీరు ప్రజలతో కపటంగా ఉండకూడదు; మీరు నిజాయితీగా భావించనిదాని గురించి మౌనం వహించండి. స్వార్థంతో ఇతరుల నుండి దేనినీ కోరవద్దు; మీరు ఏవీ ఆశించకపోతే, జనులు మీ నుండి ఏమి తీసుకోగలరు? దేవుడు తప్ప నాకు వేరే ఆశయం లేదు కాబట్టి, నన్ను ఎవరూ బాధించలేరు. నేను ఏ వ్యక్తిపైనా కోపాన్ని ప్రదర్శించాలనుకోను మరియు కోపాన్ని ప్రదర్శించడం ద్వారా నన్ను ఎవరూ రెచ్చగొట్టలేరు. కాబట్టి శాంతియుతంగా, స్వీయ-నియంత్రణతో మరియు నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి. లేకపోతే, తప్పుడు ప్రవర్తన ధ్యానం యొక్క అనుకూల ప్రభావాలను నిరోధిస్తుంది.
మీరు ఆలోచించే ప్రతి ఆధ్యాత్మిక తలంపు మీ శాశ్వత స్నేహితునిగా ఉంటుంది. మరియు మీరు పొందుపర్చుకొనే ప్రతి చెడు భావన, చాలా చాలాకాలం పాటు మీ శత్రువుగా ఉంటుంది; నీవు దానిని వధించే వరకు అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. దాన్ని గుర్తుంచుకోండి. దేవునికి దగ్గరయ్యేందుకు ఉపయోగపడే దశలవారీ పద్ధతులను నేను మీకు సూచిస్తున్నాను. మొదట, తప్పుడు ఆలోచనలు మరియు అలవాట్ల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి. రెండవది, మంచి అలవాట్లను ఏర్పరచుకోండి మరియు మంచి పనులు చేయండి.
ఆసనం లేదా భంగిమ మూడవ సోపానం అవుతుంది: గాఢంగా ధ్యానం చేయడానికి శరీరం మీ నియంత్రణలో ఉండాలి.
ఇప్పుడు ప్రాణాయామం (ప్రాణం లేదా ప్రాణశక్తి నియంత్రణ), శరీరం మరియు మనస్సు, శ్వాస మరియు హృదయ స్పందనలను శాంతపరిచే పద్ధతులు వస్తాయి. ప్రాణాయామం అనేది సాక్షాత్కారానికి సంబంధించిన ప్రాథమిక కళ. మీరు మర్త్య శ్వాసను జయించకపోతే మీరు భగవంతుడిని కనుగొనలేరు. శ్వాస మనస్సును ఇంద్రియస్థాయికి కట్టివేస్తుంది. మీ శ్వాస ప్రశాంతమైనప్పుడు, మీ మనస్సు అంతర్ముఖ మవుతుంది. శ్వాసరహిత స్థితే దేవుణ్ణి చేరే మార్గం. ప్రాణాయామం సాధన చేస్తే, ధ్యానం ఎలా చేయాలో మీకు తెలుస్తుంది — దేవుడిని ఎలా గ్రహించవచ్చో, ఆయనతో ఒక్కటై ఎలా ఉండవచ్చో తెలుస్తుంది.
ప్రాణాయామం ద్వారా వచ్చే మనస్సు యొక్క అంతర్ముఖ స్థితినే ప్రత్యాహారం అంటారు. అదే తదుపరి సోపానం: ఇంద్రియాలకు దూరంగా చైతన్యం అంతర్ముఖమై ఉంటుంది. అప్పుడు నిజమైన ధ్యానం ప్రారంభమవుతుంది.
శ్వాస, శరీరం మరియు బాహ్య అనుభూతుల నుండి మీ దృష్టి విముక్తమైనప్పుడు, అది భగవంతునిపైనే ఏకాగ్రంగా దృష్టిని కేంద్రీకరించగలదు. దాన్నే అష్టాంగ యోగ మార్గంలో ఆరవ సోపానమైన ధారణ, ఏకాగ్రత అంటారు. ఆంతరిక నిశ్చలత్వంలో, ఆత్మ యొక్క బ్రహ్మాండమైన స్వరాన్ని ఓం, శబ్దం లేదా ఆమెన్ రూపంలో వింటారు.
మీరు ఆ గొప్ప, సాంత్వన కలిగించే విశ్వ స్పందనను వింటూ మరియు దానిలో లీనమైనప్పుడు, మీ చైతన్యం అంతరిక్షమంతటా విస్తరిస్తుంది. అదే ధ్యానం, భగవంతుని అనంతత్వాన్ని గురించిన భావనపై ధ్యానం.
ధ్యానం యొక్క ఏకాగ్రత మరియు జ్ఞానం ఇంకా గాఢమైప్పుడు, ఒకవ్యక్తి అంతిమ స్థితి, సమాధి, చేరుకుంటారు, దీనిలో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యాన ప్రక్రియ మరియు ధ్యానం యొక్క వస్తువు (దేవుడు) ఐక్యమవుతారు. సమాధిలో, ప్రత్యక్ష అనుభవం ద్వారా దేవుడు, మీరు ఒక్కటేనని మీరు తెలుసుకుంటారు.
ధ్యానం ఒక్కటే మార్గం. యేసు ఇలా బోధించాడు, “ఎడ తెగకుండా ప్రార్థించండి.” దానర్థం ఏమిటి? చెదురుమదురు ప్రార్థనతో ఐదు నిమిషాలు కూర్చొని, ఆపై పరుగెత్తడం మాత్రం కాదు; కానీ భగవంతుడిని తెలుసుకోవాలనే మీ ఆత్మ యొక్క మొరకు బదులుగా సమాధానం వచ్చే వరకు ధ్యానం చేయడం.
అనంతమైన అతీంద్రియ సంపూర్ణుడిగా, ఆయన వ్యక్తి నిరపేక్షుడు. అయినప్పటికీ అందరికీ తండ్రి-తల్లి-స్నేహితుడుగా, ఆ పరమాత్ముడు సన్నిహితంగా వ్యక్తిగతం; మరియు అలాగే, ఆయన మీకు సమాధానం ఇస్తాడు. ఆయన ప్రారంభంలో మౌనంగా ఉంటాడు; కానీ మీరు మీ అభ్యర్థనలతో పట్టుదలగా ఉంటే, ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన మీతో గుసగుసలాడే ప్రదేశానికి మీలో కొందరు సమీపిస్తున్నట్లు నేను భావిస్తున్నాను.
దేవుడు ప్రతిస్పందించే వరకు వదులవద్దు: “జగన్మాతా, నువ్వు నాతో మాట్లాడాలి. నాతో మాట్లాడకపోతే వెయ్యిసార్లయినా నేను మరణిస్తాను.” మీరు పూర్తిగా చిత్తశుద్ధి గలవారని మీరు ఆమెను నమ్మించినప్పుడు, నేను మీకు చెబుతున్నది నెరవేరుతున్నట్లుగా మీరు కనుగొంటారు.
మీరు ధ్యానాన్నిఎంత గాఢంగా చేయాలంటే, దాని ప్రభావం రోజంతా మీ కార్యకలాపాలలో కొనసాగుతూ ఉండాలి. మిమ్మల్ని సృష్టించిన వ్యక్తిని అన్వేషించేందుకు తీరిక లేకుండా ఉండకండి. మీరు ప్రపంచానికి రాజు అయితే, ఏమిటి? మీరు దేశాలన్నిటినీ జయించినంత మాత్రాన జరిగేదేమిటి? మీరు చనిపోతున్నారని, మీరు నిస్సహాయులని ఒకరోజు మీరు తెలుసుకుంటారు. ప్రాపంచిక వస్తువులను సొంతం చేసుకోవాలని ఎందుకు తాపత్రయపడతారు? ఏ సమయంలోనైనా అవి మీ నుండి తీసికోబడవచ్చు — మీరు మరణ ద్వారం గుండా వెళుతున్నప్పుడు అవి మిమ్మల్ని ఖచ్చితంగా వదలి వేస్తాయి. బదులుగా, మీ నుండి ఎప్పటికీ తీసుకోబడనిదేమిటో దానిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ధ్యానం చేయనివారికి దేవుడు అత్యంత సందేహాస్పదుడు, అయినప్పటికీ ఆయన అత్యంత ఆధారపడదగిన వాస్తవమని యోగికి తెలుసు. మరియు ఆయనను కనుగొన్న “వారి ప్రతిఫలం ఘనమైనది.”
భారతదేశంలోని గొప్ప యోగులలో నేను నిజమైన ఆనందాన్ని చూచాను. భూమిపై వారి నివాసం సాధారణమైన గుహ మాత్రమే కావచ్చు; కానీ వారు రాజులకు రాజైన దేవుని పరమానందంతో చిరునవ్వులు చిందిస్తూ, సృష్టి అంతటిపై తమ శక్తిని సురక్షితంగా నిలుపుకున్న మహారాజులు.
దేవుని ఈ చైతన్యాన్ని పొందడమే మీ అంతిమ మరియు అత్యంత విలువైన లక్ష్యమని గ్రహించండి; నేను మీకు సోపానాలన్నిటినీ తెలియజేస్తున్నాను, తద్ద్వారా అక్కడికి ఎలా చేరాలో మీరు తెలుసుకుంటారు.
నిశ్శబ్దంగా కూర్చొని ఒక చిన్న ప్రార్థన చెప్పడం వల్ల మీకు దేవుని సాక్షాత్కారం లభించదు; మీ ప్రార్థనతో మరియు దేవునిపై ఉన్న కోరికతో నిశ్శబ్దాన్ని మథనం చెయ్యాలి. ఫలితం అద్భుతంగా ఉంటుంది. మీరు ఆ ప్రయత్నం చేయాలి: మీకు పదాలను అందివ్వడానికి నేనిక్కడ లేను, కాని దేవుని ప్రేమతో మీ ఆత్మను పోషింపజేయడానికి నేనున్నాను.
ఈ బ్లాగ్ పోస్ట్‌లో, భగవంతునితో మన ఏకత్వాన్ని గ్రహించేందుకు ప్రాణాయామ పద్ధతుల యొక్క ప్రాముఖ్యత గురించి పరమహంసగారు ప్రస్తావించారు. క్రియాయోగ శాస్త్రంలో భాగమైన అత్యున్నత ప్రాణాయామ పద్ధతులు, యోగదా సత్సంగ పాఠాలు కోరిన విద్యార్థులకు బోధించబడతాయి. ధ్యానం యొక్క క్రియాయోగ శాస్త్రంలోని దశలవారీ పద్ధతులు మరియు “జీవించడం-ఎలా” అనే అంశం పై సూత్రాలను అనుసరించి ఆయన చేసిన సమగ్ర సూచనలను అందించడానికి పరమహంస యోగానందగారు వై.ఎస్.ఎస్ పాఠాలు రూపొందించారు.



















