“పరిపూర్ణత కోసం జిజ్ఞాస” — ఒక కథ

10 జనవరి, 2023

శ్రద్ధ మరియు వివేకంతో సరియైన దిశలో చేసే చిన్న చిన్న ప్రయత్నాలు పరిపూర్ణతకు ఎలా దారితీస్తాయో అనే దాని గురించి ఒక సాంప్రదాయక కథ పునరావృతం చేయబడింది.

ఆ మహా శిల్పి అయిష్టంగానే తన ఉలి, సుత్తిలను ప్రక్కనబెట్టి, ఇంత వేళకాని వేళ తన శిల్పశాలకి వచ్చిందెవరో చూడడానికి వెళ్ళాడు.

పౌర్ణమి వెలుతురులో వాకిలిలో నిలబడి ఉన్న ఒక పరిచయస్తుడిని గమనించిన ఆ శిల్పి ఒక నిశ్శబ్ద అభివాదంతో పలకరించి, తిరిగి తన పనిలోకి వెళ్ళాడు. స్నేహితుడు అతని వెనుకే నడిచాడు. “నిన్ను చూసి చాలా రోజులయింది! ఆ విగ్రహం కోసం నీవు ఇంకా పనిచేయడం లేదు కదా?” అని అడిగాడు.

అయినా ఏమీ బదులివ్వకుండా , తాను నెలల తరబడిగా శ్రమిస్తున్న విగ్రహం వైపు తన స్నేహితుడిని నడిపించాడు ఆ శిల్పి. అది చూసి అతను మాన్పడిపోయాడు. చివరికి నెమ్మదిగా ఇలా అన్నాడు, “ఇంతకుముందెన్నడూ నీవు జీవము నిండిన మూర్తిని ఇంత గొప్పగా అభివ్యక్తీకరించలేదు. ఇదే ఇప్పటివరకు నీ అత్యుత్తమ కృతి.”

“ఇది పూర్తయ్యాక అలా ఉంటుందని భావిస్తున్నాను” అని శిల్పి బదులిచ్చాడు. “కానీ నాకు ఇంకా చాలా పని మిగిలింది. పై అంగీ సరిగా లేదు. ఇంకా చూడు—ఈ కండరానికి స్పష్టత కావాలి; మరి ఆకృతిలో ఇంకా మృదుత్వం రావాలి.”

స్నేహితుడు ఆక్షేపించాడు, “అవన్నీ చాలా అల్పమైన విషయాలు.!”

ఆ మహా శిల్పి, తన స్నేహితుడి వైపు తిరుగుతూ అన్నాడు, “ఆహ్, కానీ ఆ అల్ప విషయాలే పరిపూర్ణతను తీసుకువస్తాయి, పరిపూర్ణత అల్పమైనదేమీ కాదు.”

ఇతరులతో పంచుకోండి