యోగశాస్త్ర విశ్వజనీనత — మానవాళికంతటికీ ఒక ఆధ్యాత్మిక ఆశీర్వాదం

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులైన స్వామి చిదానంద గిరి, 2017లో భారతదేశంలో మాట్లాడుతూ ఇలా అన్నారు: “భారతదేశం సహస్రాబ్దులుగా మానవాళికి అత్యున్నతమైన ఆధ్యాత్మిక సత్యానికి ధర్మకర్తగా ఉంది. భారతదేశంలోని అత్యుత్తమమైన వాటిని మొదట పశ్చిమ దేశాలకు, తరువాత ప్రపంచానికి, ఆ తరువాత తన ప్రియమైన భారతదేశానికి తిరిగి తీసుకురావడం పరమహంసగారి యొక్క ప్రత్యేక దైవవిధి. భారతదేశం యొక్క ఉన్నత నాగరికత యొక్క స్వర్ణయుగమైన ఉన్నత యుగాలకు ఆయన తిరిగి వెళ్ళి, భారతదేశ సార్వత్రిక ఆధ్యాత్మికత సారాంశాన్ని, దాని స్వచ్ఛమైన రూపంలో తీసుకువచ్చారు. అదే యోగా. ఇది ఒక శాస్త్ర విజ్ఞానము, మతం యొక్క ఒక సంప్రదాయమో లేదా ఒక శాఖో కాదు; అందువలన, ఈ ఆధ్యాత్మిక వర ప్రసాదం—యోగా యొక్క తేజస్సు—మానవాళికంతటికీ నిజంగా ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక ఆశీర్వాదం కాబడింది.”

యోగాన్ని అభ్యసించడానికి మరియు దాని అద్భుతమైన ప్రయోజనాలను పొందడానికి నిర్దిష్టమైన జాతీయత, వర్గం లేదా మతానికి చెందినవారు కానవసరంలేదని పరమహంస యోగానందగారు తరచుగా సూచించారు. ఒక శాస్త్రంగా దాని నిజమైన విశ్వజనీనత అనేది — పాశ్చాత్య మరియు పశ్చిమ దేశాలలో ఏ దేశానికి చెందిన వారికైనా దాని ఫలితాలు పొందడంలోనే ఉంది.

మనమందరం స్థిరంగా యోగా ధ్యానాన్ని అభ్యాసం చేయడం ద్వారా, ఆనందం, ప్రేమ, కరుణ మరియు శాంతి యొక్క గాఢమైన ప్రభావాన్ని అనుభవించవచ్చు. ఇంకా ఈ మార్పులు మనలో కలిగేటప్పుడు, వాటి ప్రభావం మనకు తెలియకుండానే బయటకి కూడా వ్యాపిస్తాయి. మొదట మన కుటుంబానికి మరియు సమాజానికి మరియు తరువాత ప్రపంచానికి విస్తృతంగా వ్యాపిస్తాయి. పరమహంసగారు చెప్పినట్లుగా, “మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, అప్పుడు మీరు వేలాదిమందిని సంస్కరించగలరు.”

యోగా యొక్క ఒక గొప్ప ప్రయోజనం ఏమిటంటే, ధ్యానించేవారికి మొత్తం మానవాళితో ఏకత్వ భావన అభివృద్ధి చెందుతుంది. ఒకరి ఆధ్యాత్మిక విశ్వాసాలతో సంబంధం లేకుండా, లేక వాటి ఆవశ్యకతతో సంబంధం లేకుండా, యోగ శాస్త్రాన్ని అభ్యసించేవారు చివరికి ప్రతి దానిలో మరియు ప్రతి ఒక్కరిలో దివ్యత్వం ఉన్నదని గ్రహిస్తారు.

అటువంటి విశ్వజనీనతతో నిండిన హృదయాలు మరియు మనస్సులు మన కాలానికి నిజంగా చాలా అవసరం, సాంకేతిక పురోగతి ఫలితంగా మన ప్రపంచం విపరీతంగా కుంచించుకుపోయి, మనందరినీ చాలా దగ్గరగా ఉంచుతోంది. 1951లో ఒక సమావేశంలో, ప్రపంచానికి తన సందేశాన్ని క్లుప్తంగా వివరించమని పరమహంసగారిని అడగడం జరిగింది. మానవాళి తన ఆవశ్యకమైన ఐక్యతను గుర్తించవలసిన ప్రాథమిక అవసరాన్ని గురించి ఆయన మాట్లాడారు—ఆ ప్రవచనాత్మక వచనాలు మొదటిసారిగా ఆయన పలికినప్పటికంటే ఈనాడు అవి మరింత కీలకమైనవి:

“విశ్వవ్యాప్తంగా ఉన్న నా సోదర సోదరీమణులారా: దేవుడు మన తండ్రి అని, ఆయన ఒక్కడేనని దయచేసి గుర్తుంచుకోండి. మనమందరం ఆయన సంతానం, కాబట్టి మనం ఒకరికొకరు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా విశ్వజనీన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆదర్శవంతమైన పౌరులుగా మారడానికి నిర్మాణాత్మక మార్గాలను అనుసరించాలి. వెయ్యి మంది నివసించే సమాజంలో, ప్రతి వ్యక్తి ఇతరులను పణంగా పెట్టి తనను తాను సంపన్నం చేసుకోవడానికి అక్రమ సంపాదన, పోరాటం మరియు మోసం ద్వారా ప్రయత్నిస్తే, ప్రతి వ్యక్తికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది శత్రువులు ఉంటారు; అయితే, ప్రతి వ్యక్తి ఇతరులతో—శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా—సహకరిస్తే ప్రతి ఒక్కరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది స్నేహితులు ఉంటారు. అన్ని దేశాలు ప్రేమతో ఒకరికొకరు సహకరించుకొంటే, మొత్తం భూమండలమంతా అందరి శ్రేయస్సునూ ప్రోత్సహించడానికి పుష్కలమైన అవకాశాలు కలిగి శాంతితో జీవిస్తుంది.

“రేడియో, టెలివిజన్ మరియు విమాన ప్రయాణం వంటి మాధ్యమాలు మనందరినీ మునుపెన్నడూ లేని విధంగా దగ్గరకు చేర్చాయి. ఇకపై ఆసియావాసులకు ఆసియాగా, యూరప్‌ వాసులకు యూరప్‌గా, అమెరికా వాసులకు అమెరికాగా అది ఉండదని, అలాగే భగవంతుని ఆధ్వర్యంలో ఉన్న సార్వజనీన ప్రపంచమని మనం గ్రహించాలి. దీనిలో శారీరకంగా, మనసికంగా మరియు ఆత్మపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొని ప్రతి మానవుడు ప్రపంచానికి ఆదర్శవంతమైన పౌరుడిగా ఉండగలడు.

“ప్రపంచానికి అదే నా సందేశం, అదే నా విన్నపం.”

శరీరం, మనస్సు మరియు ఆత్మలలో ఒకరికొకరు ఆదర్శవంతమైన ప్రపంచ పౌరులుగా ఎదగడంలో సహాయపడడానికి అత్యంత గాఢంగా ప్రభావితం చేసే “నిర్మాణాత్మక సాధనాలు” యోగా యొక్క సార్వత్రిక శాస్త్రంలో కనుగొనవచ్చు.

ఇతరులతో పంచుకోండి