రాజర్షి జనకానంద
రాజర్షి జనకానంద: ఏ గ్రేట్ వెస్ట్రన్ యోగి (Rajarsi Janakananda: A Great Western Yogi) అనే గ్రంథము నుండి క్రింద విషయాలు సేకరించబడినవి ఆర్డర్ చేయండి
పరమహంసగారు తన పదునెనిమిది నెలల పాటు ఇండియా, యూరోప్ ల యాత్ర ముగించుకొని అమెరికాకు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని, లాస్ ఏంజిలిస్ లోని సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయములో 1937 జనవరి 3వ తేదీన ఒక విందును ఏర్పాటు చేయడము జరిగింది. ఆ విందులో రాజర్షి జనకానందగారు (1892 – 1955) (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంస్థకు పరమహంస యోగానందుల ప్రధమ వారసుడు మరియు అధ్యక్షుడు) ఇచ్చిన ప్రసంగముల నుండి గ్రహించబడినవి.
స్వస్థత చేకూర్చిన కాంతి అనుభవము
కేవలం ఐదు సంవత్సరముల క్రితం పరమహంస యోగానందగారిని కలిసే గొప్ప భాగ్యము నాకు మొదటిసారి కలిగింది. నాకు సత్యమన్నా, మతమన్నా, ఎప్పుడూ ఆసక్తి ఉండేది. అయినప్పటికీ ఎప్పుడూ క్రైస్తవాన్ని నేను అంగీకరించలేదు. వ్యాపారమే నా జీవితమయ్యింది. కాని నా అంతరాత్మ అశక్తతతోను, నా శరీరము క్షీణిస్తున్నట్లుగాను, నా మనసు కలతగాను ఉండేది. నేను చాలా ఆందోళనగా ఉండి నిశ్చలంగా కూర్చొనలేకపోయేవాడిని.
నేను పరమహంసగారిని కలిసిన తరువాత ఆయనతో కొంతసేపు ఉన్నప్పుడు, “నేను నిశ్చలంగా కూర్చొన్నాను” అని తెలుసుకొన్నాను. నా శరీరము కదలిక లేకుండా ఉంది; శ్వాస ఆడడం లేదన్నట్లుగా ఉంది. దాని గురించి నాకు ఆశ్చర్యము వేసి పరమహంసగారి వేపు చూశాను. గొప్ప తెల్లని కాంతి నాకు అగుపించింది. అది ఆ గది మొత్తాన్ని నింపివేస్తున్నట్లుగా తోచింది. ఆ అద్భుతమైన కాంతిలో నేనొక భాగమయ్యాను. అప్పటి నుండి ఆందోళన నుండి విముక్తుడి నయ్యాను.
అత్యంత విలువైన ఏదో ఒక సత్యాన్ని నేను కనుగొన్నానని నాకు అనిపించింది. స్వస్థత చేకూర్చిన కాంతి అనుభవము నాకు కలిగే వరకు, ఏ మాత్రము పరిచయములేని ఆధ్యాత్మిక రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నానన్న జ్ఞానము నాకు కలగలేదు.
పరమహంసగారి బోధనలలో ఒక గొప్ప విశేషమేమిటంటే ఎవరైనా గుడ్డి నమ్మకాలపై ఆధారపడనవసరం లేదు. అతడు తెలుసుకుంటాడు. తనకు తెలుసని తనకు తెలుసు. ఎందుకంటే సత్యాన్ని అనుభవించాడు కాబట్టి. సాధారణంగా మానవుడు తన జ్ఞానేంద్రియాలు – కన్నులు, చెవులు, ముక్కు, నాలుక, చర్మముల ద్వారా ఆలోచిస్తాడు. వస్తువులకు సంబంధించిన జ్ఞానాన్ని పొందుతాడు. తన లోపల లోతుగా ఉన్న ఆత్మే, తాను ఆలోచించడానికి మరియు బాహ్య ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా గ్రహించడానికి సాధ్యం చేస్తోందనే జ్ఞానం అతడికి ఉండదు. జీవితం యొక్క, నిజమైన జీవితం యొక్క ఉనికిని/పరమార్థాన్ని అవగాహన చేసుకోవడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి మరియు తన చైతన్యాన్ని జీవిత పరమార్థంతో ఐక్యం చేయాలి.
జ్ఞానము లేని సంపద ఆనందాన్ని ఇవ్వ జాలదు
పరమహంసగారిని నేను కలవక ముందువరకు నాకు ఎలా అనిపించేదంటే “అప్పుడు నాకున్నదానికంటే ఆ సమయంలో నాకు ఉన్నదానికంటే, మానవుడు పూర్తి స్థాయిలో జ్ఞానాన్ని కలిగి ఉండగలడన్న ఆలోచన నాకు ఉండేది కాదు. ప్రాపంచిక విషయాలను అనుభవించినప్పటికీ బాధ అనే కొన వద్దకు చేరుకున్నట్లుగా ఉండేది. ఎందుకంటే క్షణము క్రితమే నేను చెప్పినట్లుగా నా అంతరాత్మ అశక్తతతో ఉండేది. నా శారీరక పరిస్థితి బాగుండలేదు. నాకు ఏదీ తృప్తి నిచ్చేది కాదు. బ్రహ్మాండమైన ఐశ్వర్యంగల వారిని గమనించే అవకాశం కనుక మీకు వస్తే, వారిలో చాలా మంది అసంతృప్తితోను, దుఃఖముతోను ఉన్నారని తెలుసుకుంటారు. జ్ఞానము లేని సంపద ఆనందాన్ని ఇవ్వదు. మనమందరం జీవితంలో ఆనందాన్ని వెతుకుతున్నాము. మనం చేసే ప్రతి పనిలోను మనం ఆనందాన్నే వెతుకుతున్నాము.
ఆత్మ సాక్షాత్కార మార్గము - భక్తి యోగముల మేలు కలయిక
ఆత్మ సాక్షాత్కార మార్గములో ప్రతి వ్యక్తీ పునర్జీవితుడు అవుతాడు. అతడు జీవాత్మ పరమాత్మతో ఐక్యమవడాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకుంటాడు. పరమహంస యోగానందగారు బోధించిన ఆత్మ సాక్షాత్కార మార్గము శాస్త్రీయమైనది. యోగము – తనలో చేసుకొనే శాస్తీయ అభ్యాసము, భక్తి యొక్క మేలు కలయికే ఆత్మ సాక్షాత్కారము. భక్తితో కూడిన యోగాభ్యాసము ద్వారా మనిషి తనలోని దివ్యత్వమును సాక్ష్యాతకరించుకుంటాడు.
మతానికి ఒకే ఒక ఉద్దేశ్యము ఉంటుంది. ప్రతి మనిషి తన సర్వ వ్యాపకత్వాన్ని తెలుసుకోవడమే! దానిని పొందడమే స్వర్గము. నా స్వీయ అనుభవము ద్వారా నా దృఢమైన అభిప్రాయము ఏమిటంటే, “ఆత్మ సాక్షాత్కారము పొందుటకు గట్టి ప్రయత్నము చేయనిదే ఏ వ్యక్తి మోక్షాన్ని, దేవునిలో అంతిమ స్వేచ్ఛని పొందలేడు.”
తూర్పు - పడమటి దేశ సంపదల మేలు కలయిక ఎంతో అవసరము
భౌతిక సంపదలో అమెరికా అగ్రస్థానములో ఉంది. ఆత్మజ్ఞాన సంపదలో భారతదేశము ప్రధమ స్థానములో ఉంది. ఈ రెండింటి సమన్వయము ఆదర్శ ప్రపంచ నాగరికతకు దారి తీస్తుంది.
ఎవరైతే ప్రాపంచిక భోగాలలో మునిగి తేలుతుంటారో, వారు ఆ భోగాల గురించే ఆలోచిస్తుంటారు. వారు సంపదలపై వ్యామోహాన్ని పెంచుకుంటారు. వ్యామోహము వలన వారు సంపదకు బానిసలౌతారు. మనము మన అలవాట్లకు మన సంపదలకు బానిసలౌతాము. నిజానికి సంపద మనలను బానిసలుగా మార్చదు. అజ్ఞానము, వ్యామోహాలే బానిసత్వానికి కారణము.
భోగాలపట్ల వ్యామోహమున్న వాడు స్వేచ్ఛగా ఉండడు. అతడు ఏ వస్తువులపట్ల ఎక్కువగా ఆధారపడి ఉంటాడో వాటిని తప్పక కోల్పోవలసి వస్తుంది.అయితే ఒకటి మాత్రము స్థిరముగా ఉంటుంది. అదే పరమాత్మ. దేని నుండి అయినా సరే! పరమాత్మను వేరుచేసి చూడండి, అందులో ఆకర్షణ ఏమాత్రము ఉండదు. నిజంగా జీవితమే పరమాత్మ.
శరీరము పోయిన తరువాత కూడా మనతో రెండు ఉంటాయి: ప్రాణము మరియు చైతన్యము. ఈ రెండింటిని తప్ప అన్నింటినీ మనము వదులుకోవచ్చు. ఇవి మనతో శాశ్వతంగా ఉంటాయి. సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ బోధనలు మన చైతన్యాన్ని; అంతరంగిక పరమాత్మానుభవాన్ని – ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలియజేస్తాయి.
పరమహంసగారు తమ శిష్యులను “ఇది మీరు నమ్మి తీరాలి” అని ఎప్పుడూ చెప్పలేదు. “క్రియను అభ్యసించండి – మీలోని ఆత్మ వైభవాన్ని మీకు మీరే కనుక్కోండి”, అంటారు యోగానందగారు.
పరమహంస యోగానంద - ఒక ప్రేమ మూర్తి (ప్రేమావతారులు)
గురువు ఒక దేవుని దూత వంటి మన ప్రియతమ. పరమహంసగారిలో ఒక నిస్వార్థ ప్రేమ మూర్తిత్వము మనకు కనిపిస్తుంది. ఆయన దివ్యానందము కలిగి ఉన్నారు – ఆత్మ సాక్షాత్కారము పొందిన మహాత్ముల పరంపరతో వారు సంబంధాన్ని కలిగి ఉన్నారు. పాశ్చాత్యులకు ఈ విషయము కొత్తగా ఉంటుంది. ఆ మహాత్ములందరూ ఒకరితో ఒకరు సంబంధాన్ని కలిగి ఉన్నారు. వారందరూ పరమాత్మతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. వారి శక్తుల ద్వారా ఇతరులకు పరమాత్మానుభవాన్ని కలిగించగలరు. నిజంగా మనమెంతో అదృష్టవంతులము, ఆ భారతదేశం భగవదనుభూతిని పొందుటకు సహాయపడే గురువును మనకు అందించింది. (అయితే కొందరు మనవాళ్లు భారత దేశము పాములను ఆడించే దేశముగా భావిస్తారు.)
ఆత్మతో అనుసంధానంలో ఉండేవారికి మరే విధంగానూ అనుభవంలోకి రాని అందం, మాధుర్యం తెలుసు.
ఒక సాధువు/మహర్షి యొక్క సన్నిధిలో ఆనందముగా ఉండడము ఎంత స్వర్గమో కదా! నా జీవిత సంఘటనలన్నిటిలోను పరమహంసగారు నాపై కురిపించిన ఆశీస్సులే గొప్ప సంపదగా భావిస్తాను.
సనాతన భారతీయ మహర్షులు ఆత్మ శాస్త్రాన్ని అభివృద్ధి పరిచారు
మొదట నాకు కూడా భారతదేశమును గూర్చి దురభిప్రాయముండేదని నేను ఒప్పుకోక తప్పదు. “భారతీయులు పాములను ఆడించే ఆటగాళ్లు” అనుకునే వాడిని. ఇప్పుడు ఆ దేశాన్ని ఎంతో గౌరవిస్తాను ఎందుకంటే ఆ దేశములోని మహర్షులు అన్ని శాస్త్రాలలో గొప్పవైన – ఆత్మ సాక్షాత్కార శాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని – అభివృద్ధి పరిచారు.