ఆధ్యాత్మిక గీతాలాపన, మానసిక చిత్రణ మరియు ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక నేత్రము యొక్క దివ్య కాంతితో అనుసంధానం

పరమహంస యోగానందగారు మరియు వారి గురు పరంపర బోధించిన ధ్యాన సాధనలో ముఖ్యమైనది ఏమిటంటే, శరీరంలో ఆధ్యాత్మిక నేత్రము లేదా కూటస్థ లేదా క్రీస్తు చైతన్య కేంద్రం అని పిలువబడే కనుబొమ్మల మధ్య బిందువు వద్ద దృష్టిని మరియు ధ్యాసను నెమ్మదిగా కేంద్రీకరించడం. ఆధ్యాత్మిక నేత్రము యొక్క ప్రాముఖ్యతను పరమహంసగారు తరచుగా నొక్కి చెప్పేవారు, శరీరంలో సహజావబోధానికి మరియు దివ్య అవగాహనకు ఇది కేంద్ర బిందువు, ఏసు కూడా ఇలా చెప్పాడు: “నీ కన్ను ఒక్కటే అయినప్పుడు, నీ శరీరమంతా కూడా కాంతితో నిండుతుంది” (మత్తయి 6:22). ఈ విషయాన్ని ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసి స్వామి సరళానంద యొక్క ఇటీవల విడుదలైన ‘ది డీపర్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైష్ట్’ అనే స్ఫూర్తిదాయక వీడియోలో మనోహరంగా చర్చించారు.

ఆధ్యాత్మిక నేత్రము గురించి సంక్షిప్త పరిచయాన్ని మీరు క్రింద చదివి, ఈ పావన ఆధ్యాత్మిక కేంద్రంతో అనుసంధానమయ్యే కొన్ని పద్ధతులను అభ్యసించవచ్చు — మీ జీవితంలోకి, మీ చైతన్యంలోకి, తద్ద్వారా ఈ ప్రపంచంలోకి మరింత కాంతిని తెచ్చుకోవచ్చు. (ఈ పేజీ దిగువన మరింతగా తెలుసుకోవడానికి కొన్ని వనరుల జాబితా పొందుపరచబడ్డాయి, ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఇది మిక్కిలి లోతైన విషయం.)

ఆధ్యాత్మిక నేత్రాన్ని ఒక “హేమ నీలి జ్వాల (Opal Flame)” గా వర్ణన – కీర్తన ద్వారా ఐక్యత

ఆధ్యాత్మిక నేత్రము గురించి “హేమ నీలి జ్వాల (Opal Flame)” పేరుతో పరమహంస యోగానందగారు ఒక కీర్తనను స్వరకల్పన చేశారు (దీనిని వారి కాస్మిక్ ఛాంట్స్ అనే పుస్తకంలో కనుగొనవచ్చు).

పరమహంసగారు స్థాపించిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. నిర్వహించే రోజంతా క్రిస్మస్ ధ్యానంలో భాగంగా, క్రిస్మస్ సమయంలో తరచుగా గానంచేసే ఈ కీర్తన, నుదిటిలోని ఆధ్యాత్మిక నేత్రపు “ద్వారం” గుండా భక్తుని యాత్రను వివరిస్తుంది.

గాఢంగా ధ్యానిస్తున్న భక్తుడు, ఆధ్యాత్మిక నేత్రాన్ని బాహ్యంలో బంగారు కాంతిగా, దానిలోపల నీలివన్నె కాంతి వలయంగా, కేంద్రంలో అయిదు కోణాల తెల్లటి నక్షత్రంగా దర్శిస్తాడు. (బాప్టిస్టు అయిన యోహాను ద్వారా ఏసు దీక్ష తీసుకున్నప్పుడు, మెరిసే నక్షత్ర ఆధ్యాత్మిక నేత్రాన్ని “దివ్యలోక౦ ను౦డి కపోతంలా దిగివచ్చే ఆత్మ”గా చూశాడని పరమహంసగారు వివరి౦చారు. దాని “రెక్కలు” నీలం మరియు బంగారు కిరణాల కాంతి వలయాలను సూచిస్తాయి.)

భక్తి మరియు ప్రాణాయామ (ప్రాణశక్తి నియంత్రణ) పద్ధతుల ద్వారా — వై.ఎస్.ఎస్. పాఠాలలో బోధించిన క్రియాయోగ ధ్యాన శాస్త్రం వంటివి — ఈ మెరిసే కాంతి నక్షత్ర ద్వారం గుండా పయనించి సృష్టి అంతటా పరివ్యాప్తమై ఉన్న క్రీస్తు చైతన్యం (కూటస్థ చైతన్యం)తో అనుసంధానమవుతారు.

ఆధ్యాత్మిక నేత్రము యొక్క దివ్య కాంతిని మానసిక చిత్రణ చేయడానికి మరియు అనుసంధానం పొందడానికి, మీకు సహాయపడే ఈ గీతాన్ని (బిగ్గరగా లేదా మానసికంగా) ఇంగ్లీషులో పాడేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

“హేమ నీలిజ్వాల”

హేమ నీలి జ్వాల చూడాలంటే, తరిమి వేయి చీకటి ఎప్పటికి,
ఛేదిస్తూ నీ మౌనం ప్రాణాయామఖడ్గంతో.

నీలికన్ను తారలోంచి, చూడు క్రీస్తు నంతటా,
నిద్రిస్తూ ప్రతి అణువున, ప్రోటాన్లలో ఎలక్ట్రాన్లలో.

స్వర్ణ వర్ణ ప్రభాచక్రం అలంకరించు నీలిద్వారం;
నీలంలోని తార ద్వారా, కలువు క్రీస్తు నంతటా.

కాంతి రెక్కల తార-కపోతం వాలుతుంది నీ లలాటాన,,
చూపుతూ నీకు క్రీస్తు-పీఠం ప్రతీ హృదయపు శాంతిలోన.

నీ కన్నులు ఏక జ్యోతిగ చేసి, దర్శించూ తారా ద్వారం;
నీ దేహం తేజోమయమై, వెలిగించును ఆకాశం.

గురు జ్ఞాన ప్రేరణతో, తారా నేత్రాన్ననుసరించు,
చూడు పుట్టిన క్రీస్తుని క్రొత్తగా నీ అత్మలో.

జ్వాల రెక్కల తార-కపోతం, దీక్ష నియ్యి నాకు నీ కాంతిలో,
వ్యాపించు నా ఆత్మ క్రీస్తుతో సర్వవ్యాప్త ఆనందంలో.

పదార్థ భవనపు మెరిసే ద్వారమా, తారా! చూస్తా నే నీలో నుంచే
అన్నిటికీ జీవమిచ్చే సూక్ష్మ-కాంతి లోకాన్ని.

హేమ నీలి జ్వాల చూడాలంటే, తరిమి వేయి చీకటి ఎప్పటికి!

ఆధ్యాత్మిక నేత్రము పై నిర్దేశిత మానసిక చిత్రణ మరియు ధ్యానం

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులైన స్వామి చిదానంద గిరి గారు ఆధ్యాత్మిక నేత్రంపై నిర్దేశిత అనుభవాన్ని అందిస్తున్నారు. ఈ నిర్దేశిత మానసిక చిత్రణ మరియు ధ్యానం 2019లో భారతదేశపు “దీపాల పండుగ” అయిన దీపావళినాడు వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో స్వామి చిదానందగారు ప్రసంగించిన భాగంలోనిది. (“ది ఇన్నర్ సెలబ్రేషన్ ఆఫ్ దివాలి: అవేకినింగ్ ది లైట్ ఆఫ్ ది సోల్” అనే అంశంతో జరిగిన ఆ ప్రసంగంలో, యోగం యొక్క ఆత్మ-శాస్త్రాన్ని అభ్యసించడం ద్వారా మనలోని సర్వశక్తివంతమైన దివ్య కాంతి యొక్క జాగృతిని మనం ఎలా అనుభూతి పొందవచ్చో లోతుగా చర్చించారు.)

“ఆ చోటులో మీరు మొదటిసారి దృష్టి సారించినప్పుడు అది చీకటిగానే ఉండవచ్చు,” అని స్వామి చిదానందగారు చెప్పారు, “కాని ఆ చీకటి వెనుక ఆత్మ యొక్క ప్రకాశం ఉంది, మానవ రూపంలో పరమాత్ముని యొక్క వాస్తవమైన ఆ ఉనికి ఉంది.”

Play Video about The Inner Celebration of Diwali

మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారా?

లోపల ఉన్న ఆ దివ్య కాంతి రాజ్యం గురించి మరియు ఆధ్యాత్మిక నేత్రముతో సాధ్యమయ్యే అనేక అనుభూతి పొరల గురించి మీరు మరింతగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ కొన్ని సహాయకరమైన వనరులు ఉన్నాయి:

వై.ఎస్.ఎస్. పుస్తక విక్రయశాల ద్వారా లభ్యమయ్యే పరమహంసగారి శాస్త్రీయ వ్యాఖ్యానాలు, ఆధ్యాత్మిక నేత్రము గురించి పరిజ్ఞానం మరియు ప్రేరణల సంపదను కలిగి ఉన్నాయి:

యోగదా సత్సంగ పాఠాలు అనేవి క్రియాయోగ ధ్యానం మరియు సమతుల్య జీవన కళపై పరమహంస యోగానందగారి బోధనల యొక్క గృహ అధ్యయన పాఠ్యక్రమం. ఈ బోధనల అభ్యాసం, ఆధ్యాత్మిక నేత్రము యొక్క దివ్య ద్వార అనుభవం మరియు ప్రవేశములకు వీలు కల్పిస్తుంది.

అభ్యాసం చేయడానికి దివ్యసంకల్పం — దివ్య కాంతితో నిండిపోవడం

సంకల్పించండి: “నా భౌతిక నేత్రాలను మూసుకొని వస్తు ప్రపంచపు ప్రలోభాలను వెళ్ళగొడతాను. నా ద్వంద్వాత్మక నేత్రాలు ఆంతరిక ఏకైక కాంతి నేత్రములో తెరుచుకొనే దాకా నిశ్శబ్దపు అంధకారం గుండా గుచ్చి గుచ్చి చూస్తాను. సృష్టిలోని మంచి చెడుల ద్వంద్వాలను దర్శించే నా రెండు భౌతిక నేత్రాలు ఏకమయి, అన్నిటిలోనూ భగవంతుని దివ్య శుభాన్ని మాత్రమే దర్శించినప్పుడు, నా శరీరం మనస్సు, ఆత్మ ఆయన సర్వవ్యాపక కాంతితో నిండిపొయిన సంగతి నేను గమనిస్తాను.”

ఇతరులతో పంచుకోండి