“దైవత్వంతో ఒక వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడం” అనే అంశంపై శ్రీ దయామాత

9 ఫిబ్రవరి, 2024

కమలం

ఈ క్రింద ఉన్న సారాంశం ఫైండింగ్ ద జాయ్ వితిన్ యు: పర్సనల్ కౌన్సెల్ ఫర్ గాడ్-సెంటెర్డ్ లివింగ్ అనే పుస్తకంలోని “దేవుని పట్ల మీ ప్రేమను గాఢతరం చేసుకోవడం” అనే ప్రసంగం నుండి సంగ్రహించబడింది. పరమహంస యోగానందగారి తొలి సన్నిహిత శిష్యులలో శ్రీ దయామాత ఒకరు, 1955 నుండి 2010లో తాను పరమపదించే వరకు గురుదేవుల సంస్థకు ఆధ్యాత్మిక అధిపతిగా ఆమె సేవలందించారు.

దేవుణ్ణి అన్వేషించడానికి ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆశ్రమంలోకి ప్రవేశించాలని మీరు అనుకోనవసరం లేదు. మీరు ఎంత క్రియాశీలకంగా ఉన్నా, ఆయనతో ప్రేమపూర్వకమైన, వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడానికి మీరు సమయాన్ని కనుగొనవచ్చు.

నా బాధ్యతలతో పాటు, గురుదేవుల సంస్థకు చెందిన వ్యవహారాలను ఈ దేశంలోనే కాకుండా భారతదేశంలోను మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోను దృష్టి సారించవలసి ఉన్నందున, నేను కూడా మీలాగే తీరిక లేకుండా ఉండేదాన్ని. కాని దేవుడికే నా మొదటి ప్రాధాన్యం. ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేను వేటినీ అనుమతించలేదు. అవసరమైనదేమిటంటే దేవుని కొరకు పరితాపం, మరియు దైనందిన ధ్యానంలో ఆయన కోసం సమయం కేటాయించే సంకల్పశక్తి.

ధ్యానం మీకెప్పుడు ఒక దినచర్యగా, మందకొడి పనిగా ఉండకూడదు. నా ప్రయాణాలలో నేను దేవాలయాలు, మసీదులు మరియు చర్చిలకు వెళ్ళాను, కాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు పరధ్యానంగా ఉన్న మనస్సులతో తమ ప్రార్థనలను పలకడం నేను చూశాను.

ఏసుక్రీస్తు నడయాడిన మరియు ఆయన దేవునితో అనుసంధానం పొందిన జెరూసలేంలోని పవిత్రమైన ప్రదేశాలను నేను సందర్శించినప్పుడు, అక్కడ చర్చిలో సేవను నిర్వహిస్తున్న మతాచార్యుడు యాంత్రికంగా ప్రార్థిస్తున్నాడన్న సంగతి నాకు గుర్తుంది, ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నాడో ఆయన కంటే ప్రేక్షకుల పట్ల అతడు ఎక్కువ ఆసక్తితో ఉన్నాడని గమనించాను. అప్పుడు నా ఆంతరిక భావన ఇలా ఉండింది: “లేదు, లేదు, లేదు! మీరు ఇక్కడ ఉన్నది క్రీస్తుతో అనుసంధానం పొందడానికి!”

అదే విధంగా, భారతదేశంలోని దేవాలయాలలో దేవునికి అర్చనలు నిర్వహిస్తున్న పురోహితులు నిరంతరం ప్రజలతో మాట్లాడుతూ తీరికలేకుండా ఉండడం చూశాను. ఎవరిని ఉద్దేశించి వారు ప్రార్థనలు చేస్తున్నారో ఆయన వాటిని ఆలకించడం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్న భక్తులు ఆయన గురించి ఆలోచించడం లేదు!

ఆధునిక మతంలోని ముఖ్యమైన లోపం ఏమిటంటే, అది ఎవరి చుట్టూ ఎక్కువగా తిరగాలో ఆయనను అన్యమనస్కంగా పూర్తిగా మరచిపోయి, బాహ్యమైనదానిలో అది నిమగ్నమైపోతోంది.

మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు గురుదేవులు బోధించినదేమిటంటే, మన కర్తవ్యమంతా దేవుడితోనే. ఏ ఇతర పరధ్యానం లేకుండా కనీసం దేవునితో ఐదు నిమిషాలు మాట్లాడండి, అప్పుడు ఆయనతో మీ బాంధవ్యం క్రమేణా మరింత వాస్తవమవుతోందని మీరు కనుగొంటారు.

ఏకాగ్రమైన భక్తిని పెంపొందించుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, దేవుని నామాన్ని లేదా ఒక చిన్న ఆలోచనను లేదా ప్రార్థనను ఆయనను ఉద్దేశించి మానసికంగా పదే పదే జపించడం. దీనిని భారతదేశంలో జప యోగం అని పిలుస్తారు, మరియు పశ్చిమ దేశాలవారు దీనిని “సాన్నిధ్యాన్ని అభ్యసించడం” అనే ఒక పద్ధతిగా తెలుసుకున్నారు.

భగవంతుని పట్ల వాంఛను వ్యక్తం చేయడానికి, ఆయనను ఉద్దేశించి ఒక కీర్తనను ఆలపించడం కూడా సహాయపడుతుంది — ఇందుకు గురుదేవుల కాస్మిక్ ఛాంట్స్ లోని ఒక కీర్తనను ఉపయోగించుకోవచ్చు. ఆయన కోసం వ్రాసినవి కాకపోయినా, ఎన్నో అందమైన ప్రేమ గీతాలతో దేవుణ్ణి ఉద్దేశించి గానం చేయవచ్చు. గురుదేవులకు నచ్చిన వాటిలో ఒకటి “ద ఇండియన్ లవ్ కాల్.” మానవ ప్రేమికుడి కోసం కాకుండా, దేవుని కోసం అటువంటి మనోభావాలను మరియు వాంఛలను వ్యక్తం చేయడం ఎంతో ఉద్వేగంగా ఉంటుంది.

అలాగే, దేవుని ప్రేమలో లీనమైపోయిన గురుదేవుల జీవితం వంటి, గొప్ప మహాత్ముల జీవితాలను పఠించండి.

భక్తిని మేల్కొల్పడానికి గొప్పగా సహాయం చేసేది ఏమిటంటే, మీరు బాగా ప్రేమించే వ్యక్తి గురించి, మీకు ప్రేరణగా నిలిచిన వ్యక్తి యొక్క ప్రేమ గురించి ఆలోచించడం. తన తల్లి పట్ల ఉన్న ప్రేమ గురించి గురుదేవులు తలిచేవారు, అది అందమైనది, దివ్యమైనది మరియు స్వచ్ఛమైనది; ఆయన ఆమెను ఆరాధించేవారు. ఆ వ్యక్తి కోసం మీకు గల ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొన్నప్పుడు — ఉదాహరణకు మీ తల్లి — మీ మనస్సులోని ఆ భావనను జగన్మాత మీదకి మళ్ళించండి. “ఓహ్, జగన్మాతా, నా తల్లి రూపంలో నా దగ్గరకు వచ్చినది నువ్వేనని నాకు తెలుసు.”

తల్లిదండ్రులు, భర్త, భార్య, బిడ్డ లేదా స్నేహితుడు ఎవరైనా కావచ్చు. ఆ వ్యక్తి యొక్క చక్కని గుణాన్ని గురించి ఆలోచించండి, మీ హృదయంలో ప్రేమ ఉప్పొంగినప్పుడు, వెంటనే మీ మనస్సును దేవునిపై ఉంచండి. ఆ క్షణాల్లో ఇలా ఆలోచించండి: “నువ్వు ఈ వ్యక్తిలో ప్రేమను కలిగించకపోతే ఈ వ్యక్తి నన్ను ప్రేమించలేడు.” దేవుని నుండే ప్రేమ అంతా వస్తుంది. మీరు ఈ విధంగా ఆలోచించినప్పుడు, క్రమంగా మీరు ప్రేమించేవారి వెనుక ఉన్న ప్రేమ పట్ల ప్రేమను పెంపొందించుకోవడం ప్రారంభిస్తారు.

మీ రోజువారీ జీవితంలో, ఎవరైనా మీకు ఏదైనా సహాయం చేసినప్పుడల్లా, ఆ బహుమతిని స్వీకరిస్తున్నప్పుడల్లా దేవుని హస్తమును దర్శించండి. ఎవరైనా మీ గురించి దయతో ఏదైనా మాట్లాడినప్పుడు, ఆ మాటల వెనుక దేవుని స్వరాన్ని ఆలకించండి. మీ జీవితంలో ఏదైనా మంచి జరిగినప్పుడు లేదా అందమైనది పొందినప్పుడు, అది దేవుని అనుగ్రహంతో పొందినట్లుగా భావించండి.

జీవితంలో మీరు పొందిన ప్రతిదాన్ని దేవునితో ముడిపెట్టుకోండి. ఆ విధంగా మీరు ఆలోచించినప్పుడు, మీరు అకస్మాత్తుగా ఒక రోజు, “నేను చేయవలసినదంతా ఆయన ఒక్కడి కోసమే కదా,” అని కనుగొంటారు.

మానవులందరి జీవితాలకు దేవుడే ఆదారభూతమైనవాడు. మన కార్యకలాపాలన్నిటి వెనుక ఉన్న ప్రధాన సూత్రదారి ఆయనే, మన గొప్ప శ్రేయోభిలాషి మరియు ఉపకారి ఆయనే. ఆయనను ప్రేమించడానికి మరియు ప్రతిఫలంగా ఆయన ప్రేమను స్వీకరించడానికి ఇంతకంటే గొప్ప ప్రోత్సాహం ఏదైనా ఉంటుందా?

కమలం

ఇతరులతో పంచుకోండి