“ప్రపంచానికి మరింతగా దైవకాంతిని తీసుకురావడం” గురించి పరమహంస యోగానందగారు

21 డిసెంబర్, 2023

పరిచయం:

సంవత్సరంలోని ఈ తరుణంలో భిన్న మతాలకూ సంస్కృతులకూ చెందిన అనేకమంది, ఏకాగ్రత మరియు శాంతితో, ఈ ప్రపంచంలో అంతర్భాగమైన దివ్య కాంతిని ఉద్ఘాటించే ఆచారాలు, స్మృతులలో — మనలను ఉద్ధరించి మరియు సంరక్షించే ఆ దివ్య కాంతి యొక్క శక్తిలో — తమను తాము లీనం చేసుకుంటారు.

ఈ భూమిపై, కృష్ణుడు మరియు క్రీస్తు వంటి గొప్ప ఆత్మల అవతారాలలో, మరే ఇతర రూపాలలో కన్నా అధికంగా ఆ శక్తివంతమైన ఉనికి వ్యక్తమవుతుంది, వారు దైవ కాంతి మరియు గాఢమైన ప్రేరణ యొక్క స్వరూపాలుగా మన దగ్గర అవతరించారు — మరియు వారు, తాము పొందిన జ్ఞానోదయాన్ని చేరుకునే పద్ధతులను, ఈ యుగంలో మన ముందుకు తెచ్చారు.

అన్నింటికీ మించి, మనం వారిలా మారగలమని మరియు తప్పక మారవలసినదని గుర్తు చేయడానికే మహాత్ములు విచ్చేస్తారు — మనం దివ్యానందాన్ని కనుగొనడానికి మరియు ప్రపంచం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికీ!

భగవంతుని సంతానంగా మనం కూడా “ప్రపంచమంతటా దైవప్రేమను, సోదరభావాన్ని వ్యాపింపజేయడానికి కాంతి దూతలుగా” మారడానికి ప్రయత్నించాలని పరమహంసగారు చెప్పేవారని వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. నాల్గవ అధ్యక్షులు మరియు సంఘమాత అయిన శ్రీమృణాళినీమాత తెలిపారు. అన్నిటిలాగే దీనికి కూడా సమయం, సాధన ఆవశ్యకమవుతుంది.

ఈ పర్వదిన తరుణంలోని విభిన్న కార్యకలాపాలన్నింటికీ, కొన్ని క్షణాలపాటు విరామమిచ్చి, ఆంతరిక దైవ కాంతితో మనఃపూర్వకముగా అనుసంధానమవ్వడం, మరియు ప్రపంచానికి అవసరమైన “కాంతి దూత”లలో ఒకరిగా ఉండటమంటే ఏమిటో పర్యాలోచన చేయుటకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:

చలన చిత్రశాలలోని ప్రదర్శన కేంద్రం నుండి వచ్చే కాంతి పుంజం ద్వారా కదలాడే చిత్రాలు కొనసాగినట్లే, మనమందరం కూడా అనంతత్వపు విశ్వకాంతి యొక్క ప్రదర్శన కేంద్రం నుండి ప్రసరించే దివ్య కాంతి ద్వారా కొనసాగించబడుతున్నాము.

ఒక గుహలో చీకటి వేల సంవత్సరాలపాటు రాజ్యమేలవచ్చు, కాని కాంతి ప్రవేశించగానే, ఆ చీకటి ఎన్నడూ లేనట్లుగా అదృశ్యమవుతుంది….గాఢమైన ధ్యానంలో మీ ఆధ్యాత్మిక నేత్రాన్ని తెరవడం ద్వారా, అన్నిటినీ వెల్లడిచేసే దివ్య కాంతితో మీ చైతన్యాన్ని నింపడం ద్వారా మీరు దానిని తరిమికొట్టవచ్చు.

ప్రతి సంవత్సరం క్రిస్మస్ సమయంలో, క్రీస్తు-ప్రేమ మరియు ఆనందం యొక్క ప్రకంపనలు సాధారణమైనవాటి కంటే శక్తివంతంగా దివ్య లోకాల నుండి భూమికి ప్రసరిస్తాయి. ఏసు జన్మించినప్పుడు భూమిపై ప్రకాశించిన అనంతమైన కాంతితో ఆకాశం నిండిపోతుంది. భక్తి మరియు గాఢమైన ధ్యానం ద్వారా అనుసంధానం పొందిన వ్యక్తులు ఏసుక్రీస్తులో గల సర్వవ్యాప్త చైతన్యం యొక్క పరివర్తనకారక ప్రకంపనలను అద్భుతమైన రీతిలో ప్రత్యక్ష అనుభూతిని పొందుతారు.

చీకటి అంటే వెలుతురు లేకపోవడం. మాయ అంటే చీకటి; సత్యము అంటే కాంతి. మీ జ్ఞాన నేత్రాలు మూసుకుపోయాయి, కాబట్టి మీరు చీకటిని మాత్రమే దర్శిస్తారు; మరియు మీరు అదే మాయలో వ్యధ చెందుతున్నారు. మీ చైతన్యాన్ని మార్చుకోండి; మీ నేత్రాలను తెరవండి, నక్షత్రాలలోని ఆ దివ్యకాంతి ప్రకాశాన్ని మీరు దర్శిస్తారు. అంతరిక్షంలోని ప్రతి అణువులోనూ భగవంతుని దరహాసపు వెలుగును మీరు దర్శిస్తారు. ప్రతి ఆలోచన వెనుక ఆయన జ్ఞాన సముద్రాన్ని మీరు అనుభూతి చెందుతారు.

[సంకల్పించండి: ] “నీ కరుణ యొక్క కాంతి, నేను ఒక్కటేనని నాకు తెలుసు. దుఃఖ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న వారికి నేను దీపస్తంభంగా ఉండెదనుగాక.”

భగవంతుని దివ్యశక్తి నా ద్వారా ప్రవహిస్తుంది: నా వాక్కు ద్వారా, నా బుద్ధి ద్వారా, నా కణాల ద్వారా, నా చైతన్యం యొక్క ప్రతి రేణువు ద్వారా — ప్రతి ఆలోచన, ఆయన దివ్య కాంతి ప్రవహించే ఒక మార్గం. మీ హృదయాలను తెరచి, దివ్యకాంతి మీ ద్వారా కూడా ప్రవహిస్తోందని గ్రహించండి. నేను గ్రహించినట్లుగానే, మీరు కూడా గ్రహించెదరుగాక; నేను దర్శించినట్లుగా, మీరు కూడా దర్శించెదరుగాక.

మేలుకోండి! మీ నేత్రాలు తెరవండి, అప్పుడు భగవంతుడి యొక్క మహిమను మీరు దర్శిస్తారు — భగవంతుని కాంతి యొక్క విస్తారమైన మార్గం అన్నిటిలో వ్యాపిస్తోంది. దివ్యమైన సత్యవాదులుగా ఉండమని నేను మీకు చెబుతున్నాను, అప్పుడు మీరు, మీ ప్రశ్నలన్నిటికీ భగవంతునిలో సమాధానం కనుగొంటారు. ధ్యానం ఒక్కటే మార్గం.

క్రిస్మస్ వేడుకల లోతైన ఉద్దేశం గురించి పరమహంస యోగానంగారి జ్ఞాన వాక్కులను — సృష్టిలోని ప్రతి కణంలోను మరియు మనలో ప్రతి ఒక్కరిలోను ఉన్న భగవంతుని విశ్వచైతన్యం యొక్క అనంతమైన కాంతితో మనం అనుసంధానం చేసుకోవడం గురించి వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌లో ఒక బ్లాగ్ పోస్ట్‌ను మీరు చదవవచ్చు.

ఇతరులతో పంచుకోండి