సద్గురువు యొక్క సహాయం గురించి పరమహంస యోగానందగారు

21 మార్చి, 2024

ఒక పరిచయం:

ఆధ్యాత్మిక మార్గంలో సార్వత్రికంగా సత్యమైన రెండు అంశాలను గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?

  1. మీ జీవితంలో సంపూర్ణమైన ఆనందం మరియు పరిపూర్ణతను పొందగల స్థానాన్ని చేరుకోవడం సాధ్యమేనని మీరు గాఢంగా భావిస్తుంటే, మీరు భావిస్తున్నది నిజమే.
  2. మరియు మీరు ఒంటరిగా అక్కడికి చేరుకోలేరు — మనకొక దృష్టాంతంగా నిలిచే, ఒక వివేకవంతులైన మార్గదర్శి, మన స్వీయ దృక్పథం కంటే దూరదృష్టిగలవారు ఈ మార్గంలో మనకు అవసరం.

పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ ఈ వాక్యంతో మొదలవుతుంది: “పరమ సత్యాల అన్వేషణ, దానికి తోడుగా ఉండే గురు-శిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి.”

పరమహంసగారి ఆత్మకథ లోని మొదటి పదాల నుండి చివరి వరకు దాని సమస్తమంతా — మనమందరం కోరుకునే ఆనందకరమైన అవగాహనలో సంపూర్ణంగా స్థిరపడిన వ్యక్తి మార్గనిర్దేశనం చేయడం ద్వారా వచ్చే అత్యున్నత ప్రయోజనాన్ని వెల్లడిస్తుంది.

ఆ గ్రంథం ప్రచురించబడినప్పటి నుండి, సద్గురువు యొక్క శాశ్వతమైన అర్థాన్ని మరియు ప్రాముఖ్యతను అన్వేషకులకు ఎక్కువగా పరిచయం చేస్తూనే ఉంది — మరియు అలాంటి వ్యక్తి యొక్క బోధనలను హృదయపూర్వకంగా అనుసరించగలవారికి యోగా యొక్క సనాతన అద్భుతాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రతి మార్చిలో, పరమహంసగారు మరియు ఆయన ప్రియ గురుదేవులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి గౌరవార్థం, స్మారకోత్సవ ధ్యానాలను మేము నిర్వహిస్తాము (ఈ ఇద్దరు మహాత్ముల మహాసమాధి వార్షికోత్సవాలను పురస్కరించుకుని). మరియు ఆ ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించి, ప్రపంచంలో వెలుగును తీసుకువచ్చి, జీవితాలలో పరివర్తన తెచ్చేందుకు జ్ఞానోదయం పొందిన సద్గురువు ద్వారా దైవం ఎలా పని చేస్తుందనే దాని గురించి పరమహంసగారి ప్రేరణ క్రింద ఇవ్వబడినది.


పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:

భగవంతుణ్ణి స్వయంగా తెలుసుకొన్నవాడే సద్గురువు…కనుక ఆయన ఇతరుల స్వీయ విముక్తికి, ఆరోహణకు దారి చూపగలిగినవాడు.


అంతర్గతంగా ఉన్న ఆత్మను బయల్పరచేందుకు సహాయం చేసి, ఆరోహణ ద్వారా పరమాత్మలోని శాశ్వతమైన విముక్తిని పొందేందుకు సద్గురువు మీకు మార్గదర్శనం చేస్తాడు.


పాఠశాలలో లౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, దాని గురించి తెలిసిన ఉపాధ్యాయుని నుండి మీరు నేర్చుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకోవడానికి కూడా భగవత్ సాక్షాత్కారం పొందిన ఆధ్యాత్మిక బోధకుడు లేక సద్గురువు అవసరమవుతారు. వారి భౌతిక సాన్నిధ్యంలో మీరు లేకపోయినా, లేదా ఆయన భూమిపై లేకపోయినా, మీరు భగవంతుడిని కనుగొనాలంటే అటువంటి సద్గురువు యొక్క బోధనలను మీరు తప్పక అనుసరించాలి.


గురు-శిష్యుల సంబంధానికి చెందిన దివ్య నియమాన్ని అర్థం చేసుకోవడం అవసరం. ఇది మనం భారతదేశంలో నేర్చుకుంటాం. ఇది చాలా సాధారణమైనది, కాని చాలా ముఖ్యమైనది: మీరు ముందుగా సద్గురువును కనుగొనాలి; అప్పుడు నిజమైన ఆధ్యాత్మిక పురోగతి ప్రారంభమవుతుంది.


జీవితమనే లోయలో గుడ్డిగా కదలాడుతున్నప్పుడు, అంధకారంలో మీరు కూరుకుపోతున్నప్పుడు, దృష్టి ఉన్న వారి సహాయం మీకు కావాలి. మీకొక సద్గురువు కావాలి. ప్రపంచంలో సృష్టించబడిన గొప్ప గందరగోళం నుండి బయటపడటానికి జ్ఞానోదయం పొందిన వ్యక్తిని అనుసరించడమే ఏకైక మార్గం. నా పట్ల ఆధ్యాత్మిక ఆసక్తిగల నా గురువును కలుసుకొనేవరకు నాకు నిజమైన ఆనందం మరియు స్వేచ్ఛ లభించలేదు, నాకు మార్గనిర్దేశం చేసే జ్ఞానం ఆయనకు ఉండేది.


నిజమైన సద్గురువుని కనుగొనడానికి భారతదేశమంతటా నేను అన్వేషించాను. నేను పుస్తకాలలో అన్వేషించాను; నేను ఒక మందిరం నుండి మరొక మందిరానికి, ఒక పవిత్ర స్థలం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించాను; కాని నా సందేహాలు నన్ను ప్రతి చోటా అనుసరించాయి. కాని సాక్షాత్కారం పొందినవారిని — నా గురువు, శ్రీయుక్తేశ్వర్‌ గారిని — కనుగొన్నప్పుడు, ఆయన నేత్రాలలో ఆ దైవాత్మను దర్శించినప్పుడు, సందేహాలన్నీ తొలగిపోయాయి. ఆయన ఆశీర్వాదంతో నా జీవితం మొత్తం మారిపోయింది. అందుకే సద్గురువును, ఆయన బోధనలను అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను గురించి నేను మీకు నొక్కి చెబుతున్నాను.


ఇతరుల హృదయాలలో తాను స్థానం పొందాలనే కోరిక సద్గురువుకు ఉండదు, కాని వారి చైతన్యంలో భగవంతుని చైతన్యాన్ని మేల్కొల్పాలని వారు ఆశిస్తారు.


భగవంతుని సాన్నిధ్యాన్ని పొందేందుకు, జ్ఞానమనే ఉలిని ఎలా ఉపయోగించాలో నా గురువు నాకు చూపించారు. దివ్య ప్రకాశంగల సద్గురువుల సూచనలను అనుసరించినట్లయితే, ప్రతి ఒక్కరు అదే విధంగా చేయగలరు.

వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌లోని “ఆధ్యాత్మిక అన్వేషణలో గురువు పాత్ర” చదవడం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలోని ఈ ముఖ్యమైన అంశంపై పరమహంస యోగానందగారు అందించిన జ్ఞానాన్ని మీరు గ్రహించవచ్చు. తన రచనలలోని ఈ సారాంశంలో, ఒక అన్వేషకుడికి మరియు అతడు లేదా ఆమె గురువుకు మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని గురించి పరమహంసగారు ఎంతో ఉన్నతంగా వివరించారు.

దైవాన్ని పొంది, ఆత్మసాక్షాత్కారం పొందేందుకు అన్వేషకులకు దారి చూపగల నిజమైన గురువు యొక్క స్వభావం మరియు అటువంటివారితో మన చైతన్యాన్ని ఎలా అనుసంధానం చేసుకోవాలో తెలుసుకొనేందుకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క ప్రస్తుత మరియు గత అధ్యక్షుల అనేక చిన్న వీడియోలను చూడటానికి వై.ఎస్.ఎస్. బ్లాగ్‌లోని మరొక పేజీని కూడా సందర్శించవలసిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

ఇతరులతో పంచుకోండి