పరమహంస యోగానందగారి “మానసిక గాడుల నుండి బయటపడేందుకు ఆచరణాత్మక సలహాలు”

8 ఏప్రిల్, 2025

“మానసిక గాడుల నుండి ఎలా బయటపడాలి” అనే ప్రసంగం నుంచి సంగ్రహించబడిన సారాంశం ఈ క్రింద పోస్ట్ చేయబడినది. ఈ ప్రసంగం జూలై 14, 1940న కాలిఫోర్నియాలోని ఎన్సినీటస్‌లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ గోల్డెన్ లోటస్ టెంపుల్‌లో ఇవ్వబడింది. ఈ పూర్తి ప్రసంగం పరమహంస యోగానందగారి ప్రసంగాల, వ్యాసాల సంకలనం, సంపుటం IV, సాల్వింగ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్ (Solving the Mystery of Life), లో లభిస్తుంది. ఇది త్వరలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా మరియు తరువాత యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా విడుదల చేయబడుతుంది.

కమలం-ఆరంజ్-రేఖాచిత్రం

మర్త్యజీవి నుండి దైవజీవిగా మన స్థితిని మార్చుకోవడమే భూమిపై ఉన్నప్పుడు మన ప్రధాన కర్తవ్యం. కానీ ఆకట్టుకునే ఆటవస్తువులతో ఈ ప్రపంచమంతా నిండి ఉంది — ఆకర్షణీయమైన భౌతిక వస్తువులు మన దృష్టిని ఆకట్టుకుంటాయి — మరియు అనేక పద్ధతులలో మన ఆలోచనలు మరియు ప్రవర్తన, కోరికల మార్గాల్లోకి మళ్లించబడతాయి.

జ్ఞానం ద్వారా మార్గనిర్దేశనం పొందలేకపోతే, మనం ఈ సంకుచిత మార్గాలలో చిక్కుకొని ఆధ్యాత్మిక పురోగతి పొందలేము. మన కోరికలన్నింటిలో దైవాన్ని అన్వేషించడం అనేది ప్రధానమైనదిగా భావించినప్పుడు మాత్రమే శాశ్వతమైన ఆనందానికి దారితీసే మార్గాన్ని మనం కనుగొనగలం.

జీవితంలో మీ పురోగతిని విశ్లేషించుకోండి: మీరు ఒక గాడిలో ఉన్నారా?

మీరు మట్టిరోడ్డులో ప్రయాణిస్తుండగా, మీ వాహనం బురదలో కూరుకుపోతే, దాన్ని బయటకు తీసేందుకు నైపుణ్యం అవసరమవుతుంది — మరియు బహుశా బయటకు లాగే ట్రక్ అవసరం కావచ్చు! — అదే విధంగా, మానవజాతి మానసిక గాడుల్లో చిక్కుకుపోయినప్పుడు, దాని నుండి ఎలా బయటపడాలి అనే అంశంపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

మీరందరూ క్రమానుగతంగా మీ జీవితంలోని పురోగతిని విశ్లేషించుకొని, మీరు గాడిలో ఉన్నారేమోనని పరిశీలించుకోవాలి. ముందుగా, ఎలాంటి దారిలో మీరు వెళుతున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ జీవిత గమ్యస్థానానికి ఖచ్చితంగా తీసుకెళ్ళే మృదువైన, ప్రకాశవంతమైన రాచబాటలో మీరు ప్రయాణిస్తున్నారా?…

అయినప్పటికీ మీరు సరియైన దిశలో లేకపోయే అవకాశం ఉంది. మీరు మీ మీద చాలా నమ్మకంతో ఉండి, అజాగ్రత్తగా మీ కళ్ళను రోడ్డుపై నుండి మరల్చినట్లయితే, మీరు దారి తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ఒక గుంతలోకి జారిపోయే అవకాశం ఉంది.

మర్త్యజీవితంలోని ఏ మార్గంలోనైనా ఒకరు గాడుల్లో పడిపోవచ్చు; మానవుడి చైతన్యాన్ని పట్టుకోవడానికి అవి ప్రతిచోటా కొలువై ఉన్నాయి. కొన్ని మీ భావాలను బలవంతపు కోపంగా మారుస్తాయి; కొన్ని మిమ్మల్ని నిరాశావాదం లేదా నిరుత్సాహ మనస్తత్వంలో చిక్కుకుపోయేలా చేస్తాయి; మరికొన్ని మిమ్మల్ని దురాశ లేదా అసూయ లేదా అతిగా విమర్శించడం వంటి స్థిరమైన అలవాట్లలో పట్టి ఉంచవచ్చు….

కారు బురదలో లేదా ఇసుకలో కూరుకుపోయినప్పుడు, డ్రైవర్ ఏక్సిలరేటర్‌పై కాలుతో గట్టిగా నొక్కి చక్రాలు వేగంగా తిరిగేలా చేస్తాడు, కాని కారు అదే స్థలంలో ఉండిపోతుంది — చాలామంది వ్యక్తుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. వారి జీవితమనే ఇంజిను నడుస్తున్నప్పటికీ, వారి చక్రాలు ఉపయోగం లేకుండా తిరుగుతుంటాయి. అటువంటి వ్యక్తుల పురోగతి మరియు పెరుగుదల చాలాతక్కువగా ఉంటుంది. వారు తమ శరీరం పరిపక్వత చెందడంవల్ల తాము కూడా అభివృద్ధి చెందామని అనుకుంటారు, కాని వారి మెదడు, వారి మనస్సు, వారి వైఖరులు స్థిరంగా — మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా అపరిపక్వంగా ఉంటాయి.

కమలం-ఆరంజ్-రేఖాచిత్రం

మానసిక క్షోభ నుంచి బయటపడేందుకు ఓ కళ ఉంది. అందరికీ దూరంగా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మీతో నిశ్శబ్దంగా మీరు మాట్లాడుకోండి. మిమ్మల్ని మెరుగుపర్చుకొనే మార్గాల కోసం, మీరు మీ జీవితాన్ని మరింత విలువైనదిగా మరియు ఆసక్తికరంగా మార్చుకునే మార్గాల గురించి ఆలోచించండి.

మీ జీవితంలో దేవుని ఉనికిని ఎక్కువగా సాధన చేయడం ద్వారా దేవునితో గాఢమైన సంబంధాన్ని పెంపొందించుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. మీరు ఏమి చేస్తున్నారో ఇతరులతో చెప్పవలసిన అవసరంలేదు. ఆంతరంగికంగా దేవునితో ఉండండి.

సమస్త శాంతికి, సకల సంతోషాలకు ఆయనే మూలం. ఆయన నిత్యనూతన ఆనందం. ఆయనను తెలుసుకోవడం ద్వారా, మీ జీవితం ఇకపై నిరుత్సాహంగా, చికాకుగా ఉండదు. ప్రేరణాత్మకమైన నూతన ఆలోచనలు సదా మీ చైతన్యంలోకి ప్రవహిస్తాయి.

తమ స్వభావంలో ఎటువంటి సానుకూల మార్పు చూపని “మానసిక గృహోపకరణాలు” వంటి వ్యక్తులను మీరు చూచినప్పుడు: “నేను వారిలా ఉండాలనుకోవడం లేదు!” అని భావించండి.

బోస్టన్‌లో నాకు అలాంటి వ్యక్తి తెలుసు. ఆమె ఒక అద్భుతమైన ఆత్మ, చాలా నిర్మలమైనది మరియు తెలివైనది. కాని ఆమెకు కొన్ని ప్రతికూల లక్షణాలు ఉన్నాయి. పదిహేనేళ్ల క్రితం ఉన్న అదే భయాల గురించి, అదే ప్రతికూల ఆలోచనలు మరియు లక్షణాలతో ఆమె ప్రతిస్పందిస్తుంది.

అలా ఉండకండి. నిరాదరణతో ఎండిపోకండి. మీరు సజీవంగా ఉండాలనుకుంటున్నారు, చనిపోయిన మోడులా కాదు! ఉదాహరణకు, మీరు పాత గులాబీ పొదను తీసుకొని, ఎండిపోయిన పుల్లలను కత్తిరించి, నీరు పోసి, దానిని జాగ్రత్తగా సంరక్షిస్తే, క్రమంగా జీవశక్తి ఆ పొదగుండా ప్రవహించడం ఆరంభమై, చిన్నఆకులు చిగురించడం ప్రారంభమవుతుంది. ఆపై సూర్యకాంతి ఆ పొద మీద ప్రసరించినప్పుడు, అద్భుతమైన పువ్వులు కనిపిస్తాయి. సరైన సంరక్షణతో, దాని సౌందర్యం మరియు సువాసనలతో అది మనల్ని అలరిస్తూ, పెరుగుతూ, వికసిస్తూనే ఉంటుంది.

మీరు అలా ఉండవచ్చు. మీ పురోగతిని స్తంభింపజేసి, మిమ్మల్ని పనికిరానివారిగా అనుభూతిని కలిగించిన పాత అలవాటులన్నింటినీ వదిలించుకోండి. మీ శరీరం, మనస్సు మరియు ఆత్మలో నూతన అనుభవాలు, నూతన గుణాలు, నూతన మెరుగుదలలనే ఆకులు మరియు పుష్పాలను నిరంతరం వృద్ధి చేయండి.

పరీక్షల శీతాకాలం వచ్చినప్పుడు, జీవితంలోని కొన్ని ఆకులు రాలిపోతాయి. ఇది మామూలే. దీనికి పట్టింపు లేదు. మీరు ముందుకు సాగుతూ ఉండండి. “ఫర్వాలేదు, వేసవి వస్తోంది, నేను మళ్ళీ వికసిస్తాను” అని అనండి. కఠినమైన చలికాలాన్ని తట్టుకునేలా చెట్టుకు భగవంతుడు అంతర్గతశక్తిని ఇచ్చాడు. మీకు అంతకంటే ఎక్కువ శక్తి ఇవ్వబడింది.

జీవితంలోని శీతాకాలాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రావు, కాని నూతన ఉత్సాహం మరియు నిర్మాణాత్మక ప్రయత్నాలకు మిమ్మల్ని ప్రేరేపించడానికే వస్తాయి, ఇవి అందరికీ వచ్చే నూతన అవకాశాల వసంతకాలంలో వికసిస్తాయి.

మీతో మీరు ఇలా అనుకోండి, “నా జీవితంలో ఈ శీతాకాలం కొనసాగదు. నేను ఈ పరీక్షల పట్టు నుండి బయటపడతాను, మరియు అభివృద్ధి అనే కొత్త ఆకులను, పూవులను వికసింపజేస్తాను. స్వర్గలోకపు పక్షి నా జీవితంలోని కొమ్మలపై మరొకసారి వాలుతుంది.”

ఉదాహరణకు, మీరు భయాందోళనలు లేదా జీర్ణసమస్యలు లేదా ఇతర ఒత్తిడితో బాధపడుతున్నారని మీరు కనుగొంటే, దాని గురించి నిర్మాణాత్మకంగా ఏదైనా చేయండి. మీరు కొద్దికాలం బాధపడ్డా, మీరు నిస్సహాయ స్థితిలో పడకుండా ఉంటే సరిపోతుంది.

దీర్ఘకాలికవ్యాధి అనేది మీరు ఎప్పటికీ బయటపడలేరని మీరు భావించే మానసిక గాడుల యొక్క ఒక రూపం. మీ మనస్సు అనారోగ్యం లేదా పరిమితుల సూచనలను అంగీకరించకూడదు. సహజంగానే, శరీరం ఎప్పుడూ అలాగే ఉంటుందని భావించడం అవాస్తవికం; దీనిని చాలాకాలం పాటు బాగా ఉంచవచ్చు, కాని చివరికి అది వృద్ధాప్యం వచ్చి, బలహీనపడుతుంది. మీ మనస్సు లొంగిపోవాలని దీని అర్థంకాదు. మనసును స్వేచ్ఛగా ఉంచుకోవాలి.

మీరు మీ శరీరాన్ని చూస్తే అది ముసలిదాని వలే అనిపించవచ్చు. కాని మీ కళ్ళు మూసుకుని, మీ స్వస్వరూపాన్ని గమనిస్తే, మీరు ఆత్మస్వరూపమని తెలుసుకుంటారు. జీవితం యొక్క బాహ్య కవచానికి కళ్ళు మూసుకొని ఆత్మ యొక్క అంతర్నేత్రం తెరిచినప్పుడు, మరణం లేదు, వృద్ధాప్యం లేదు, భౌతిక సరిహద్దులు లేవు.

మీరు పరిశుద్ధమైన ఆత్మ. ప్రతిరాత్రి గాఢనిద్ర యొక్క స్వేచ్ఛలో యదార్థముగా మిమ్మల్ని మీరు ఆ విధంగా దర్శిస్తారు, ఎందుకంటే మీకు రూపం లేదు, శరీర బరువు లేదు, పురుషుడు లేదా స్త్రీ అనే స్పృహ లేదా ఏదైనా స్థిరమైన వ్యక్తిత్వం లేదు. జాగరూకత అనేది సర్వోత్కృష్టమైన మానసిక గాడి అవుతుంది. ఆ స్థితిని నియంత్రించడం వల్ల ఒకరు భౌతిక జీవితబంధం నుండి విముక్తి పొందుతారు. నిద్ర అనేది అపస్మారకమైన విశ్రాంతి; మరియు దాని ప్రభావాలు తాత్కాలికమైనవి. గాఢమైన ధ్యానంలో లభించే సర్వోత్కృష్టమైన నిశ్శబ్దం మీ చైతన్యాన్ని శాశ్వతంగా విడుదల చేయడానికి ఏకైక మార్గం. ధ్యానం ద్వారా మీరు సర్వవేళలా చైతన్యంతో కూడిన అంతర్గత స్వేచ్ఛను నిలుపుకోవడం నేర్చుకుంటారు.

రోజు గడిచిన తర్వాత, ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చొని, ఆ రోజు కార్యకలాపాలను క్లుప్తంగా విశ్లేషించుకోండి. అప్పుడు మానసికంగా దివ్యసంకల్పం చేయండి, “నాకు పరిమితి కలిగించిన అన్ని గాడులు, ఆలోచనలు మరియు అనుభవాల నుండి నేను విముక్తును. నా మనస్సు అవధులులేని పరమానందభరితమైన, భగవంతుని శాంతిలో విశ్రాంతి తీసుకుంటోంది.” అలాంటి సమయాలలో ఎంత ఆనందం కలుగుతుంది! ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము.

కాని చాలామంది ఆ ప్రయత్నం చేయరు. భౌతిక విషయాలను సాధించడమే వారి ప్రాధాన్యత. తమ గుండె కొట్టుకోవడం వల్ల మరియు శ్వాస ప్రవహించడం వల్ల తాము జీవిస్తున్నామని వారు భావిస్తారు. కాని అది జీవించడం కాదు; అది కేవలం ఉనికిలో ఉండడం. వారి సాఫల్య చక్రాలు జీవిత రహదారిలో ఇసుక గాడులలో చిక్కుకున్నాయి.

మీరు ఆ స్థితిలో ఉన్నట్లయితే, లోపలి నుండి అకస్మాత్తుగా అదనపుశక్తిని ప్రసరింపజేయండి, తద్వారా మీ జీవితపు కారు స్థిరమైన పురోగతితో స్వేచ్ఛగా సాగే రాచబాట పైకి దూకుతుంది. అప్పుడు మీరు పరధ్యానం కలుగచేసే గుంతలను తప్పించుకుంటూ, సాఫీగా సాగిపోవచ్చు; ఆనందము, శాంతి, ప్రశాంతత వంటి భగవంతుని యొక్క విస్తారమైన, అందమైన అనుభూతుల దృశ్యాలు చేరి, అక్కడ సేద తీరవచ్చు.

ఆ దృశ్యం సత్యమైనది. అది ఊహ కాదు. కాని అక్కడికి చేరుకోవడానికి మీరు ధ్యానం ద్వారా ఏర్పడే గాఢమైన నిశ్శబ్దంలోకి ప్రవేశించాలి. మర్త్య ఆలోచనలులేని ఆ ఆంతరిక నిశ్చలత్వంలో, మీ ఆత్మ అన్ని మానసిక అశాంతి ప్రకంపనలకు దూరమైనట్లు మీరు గమనిస్తారు.

ఇతరులతో పంచుకోండి