వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమాన్ని సందర్శించిన భారత రాష్ట్రపతి

11 డిసెంబరు, 2017

గాడ్ టాక్స్ విత్ అర్జున హిందీలో విడుదలైంది

వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమాన్ని సందర్శించిన భారత రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్‌తో, (ఆయనకు కుడివైపున) ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘుబర్ దాస్ మరియు ఝార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్ము (కుడివైపు చివర)లకు, వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. యొక్క సీనియర్ సన్యాసులు వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో ఆతిధ్యమిచ్చారు.

నవంబర్ 15, 2017న, గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, పరమహంస యోగానందగారి గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత యొక్క హిందీ అనువాదాన్ని అధికారికంగా విడుదల చేస్తున్న గౌరవార్థం యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా రాంచీ ఆశ్రమాన్ని సందర్శించారు. శ్రీ కోవింద్‌తో పాటు ఝార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్ము; ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘుబర్ దాస్ (కుడివైపు చిత్రం చూడండి), ఇంకా అనేక ఇతర ప్రముఖులు హాజరయ్యారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షుడు స్వామి చిదానందగారు, గౌరవనీయ అతిథులకు ఆతిథ్యం అందించిన వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసుల బృందానికి నాయకత్వం వహించారు. వీరితో ఇంకా, దాదాపు 3000 మంది వై.ఎస్.ఎస్. సభ్యులు మరియు స్నేహితులు ఈ సందర్భంగా హాజరయ్యారు, ఇది సంస్థ యొక్క శత జయంతి (1917-2017) గౌరవార్థంగా, 2017 వై.ఎస్.ఎస్. శరద్ సంఘం సమయంలో జరిగింది.

ఈ వేడుకలు భారత జాతీయ గీతాలాపనతో ప్రారంభమయ్యాయి, అనంతరం స్వామి చిదానంద గిరి, వై.ఎస్.ఎస్. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ సభ్యులు పుష్పగుచ్చాలు మరియు శాలువలతో గౌరవ అతిధులను సత్కరించి లాంఛనంగా స్వాగతం పలికారు. శ్రీ కోవింద్, శ్రీమతి ముర్ము మరియు శ్రీ దాస్ లాంఛనంగా దీప ప్రజ్వలనం గావించారు. ప్రేక్షకులు కరతాళల మధ్య, గాడ్ టాక్స్ విత్ అర్జున హిందీ ప్రతిని ఝార్ఖండ్ గవర్నర్ అధికారికంగా విడుదల చేశారు. అనంతరం ఆమె తొలి ప్రతిని భారత రాష్ట్రపతికి అందజేశారు. వై.ఎస్.ఎస్. ప్రధాన కార్యదర్శి స్వామి స్మరణానంద మాట్లాడుతూ, యోగా యొక్క ఈ పవిత్ర గ్రంథం అవగాహనకు శ్రీ పరమహంస అందించిన అరుదైన రచన గూర్చి వక్కాణిస్తూ పరమహంస యోగానందవారి భగవద్గీత వ్యాఖ్యానం యొక్క ప్రాముఖ్యత గురించి ఇలా వివరించారు: “భగవద్గీత శతాబ్దాలుగా వివిధ మతాలకు చెందిన అనేకమంది సాధువులకు ప్రియమైన గ్రంథం ఇది. భగవద్గీత గురించి అనేక వ్యాఖ్యానాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకొక వ్యాఖ్యానం అవసరమా? అవును. ఎందుకంటే గాడ్ టాక్స్ విత్ అర్జున అనేది కేవలం మరొక వివరణ కాదు. ఇది గీత యొక్క ఒక ప్రత్యేకమైన, ముఖ్యంగా యోగా శాస్త్రానికి సంబంధించిన ఆవిష్కరణ.”

శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారి చే దీప ప్రజ్వలనం
భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్,(ఆయనకు కుడివైపున) ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘుబర్ దాస్ మరియు ఝార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్ము (కుడివైపు చివర)లకు వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్.యొక్క సీనియర్ సన్యాసులు వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో ఆతిథ్యమిచ్చారు.
భగవాన్ కృష్ణుని చిత్రాన్ని భారత రాష్ట్రపతికి బహూకరిస్తున్న స్వామి చిదానంద
స్వామి చిదానందగారు భగవాన్ కృష్ణుడి చిత్రాన్ని భారత రాష్ట్రపతికి బహూకరించారు.
గాడ్ టాక్స్ విత్ అర్జున హిందీ అనువాదాన్ని అధికారికంగా విడుదల చేయుచున్న రాష్ట్రపతి
గాడ్ టాక్స్ విత్ అర్జున హిందీ అనువాదాన్ని గవర్నర్ అధికారికంగా విడుదల చేసి మొదటి ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు.

భారతదేశ ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించాలనే పరమహంసగారి లక్ష్యం గురించి మాట్లాడుచున్న స్వామి చిదానంద.

స్వామి చిదానంద గిరి వ్యాఖ్యలు

స్వామి చిదానందగారు సభను ఉద్దేశించి ప్రసంగించారు, గాడ్ టాక్స్ విత్ అర్జున ఎలా వాస్తవికత దాల్చించిందో క్లుప్తంగా వివరించారు ఇంకా భారతదేశ ఆధ్యాత్మిక తత్వసారాంశం మొదట పాశ్చాత్య దేశాలకు, తిరిగి వెనుకకు భారతదేశానికి కలిపి ప్రపంచమంతటికీ అందించాలనే పరమహంసగారి లక్ష్యాన్ని గురించి మాట్లాడారు.

ఆయన తన ప్రసంగాన్ని ఈ మాటలతో ముగించారు: “గౌరవనీయులైన రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, ఈ రోజు మీరు ప్రపంచ-ప్రశంసలు పొందిన పరమహంసగారి గీతా వ్యాఖ్యానం యొక్క ఈ చక్కని క్రొత్త ప్రతి ఆవిష్కరించడమే కాకుండా; మరీముఖ్యంగా మీరంతా భారతదేశం యొక్క ఏకైక మరియు అత్యంత శక్తివంతమైన బహుమతిని ప్రపంచానికి అందచేసిన సంకల్పానికి మరియు అంగీకారానికి, మనమంతా ఆనందంగా సంబరాలు చేసుకుందాం. నిజంగా, దేన్నైతే భారతదేశం పరిరక్షించి, భద్రపరచి ఇప్పుడు ప్రపంచ కుటుంబ దేశాలతో అత్యంత ఉదారంగా పంచుకుంటుందో ఇటువంటి విశ్వజనీన ఆధ్యాత్మసంబంధమైన శాస్త్రం లేకుండా నాగరికత మనుగడ సాగించలేదు. ఇది ఎంత ముఖ్యమైనదంటే, విడదీయని, ఇంకా అందరినీ ఐక్యంగా ఉంచే, ఒక ఆధ్యాత్మిక చైతన్యం–ప్రతి ఆత్మలో, ప్రతి జీవాత్మలో అనంతమైన దివ్య సామర్థ్యాలను మేల్కొలిపే ఓ ఆధ్యాత్మికత, ఇదే ఆత్మపరంగా మాట్లాడాలంటే, అన్ని ఆత్మలు ఒకే భగవంతుని పితృత్వభావం క్రింద సోదరులు మరియు సోదరీమణులు అని వెల్లడిస్తుంది – ప్రపంచ చరిత్ర యొక్క ఈ క్లిష్ట సమయంలో మానవాళి మనుగడ కోసం,నిజమైన ఉన్నత పురోగతికి ఇదే ప్రధాన అవసరం.

“కాబట్టి, చివరిగా, శ్రీ శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు అందించిన దివ్యమైన ఈ అద్భుత గ్రంథం, పవిత్ర భగవద్గీత యొక్క కాంతి మనందరికీ, భారతదేశానికి, సమస్త ప్రపంచ మార్గాన్ని ప్రకాశవంతం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలి. ఓం. శాంతిః. శాంతిః. శాంతిః.”

నేటి ప్రపంచంపై పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక ప్రభావంపై ప్రసంగించుచున్న రాష్ట్రపతి కోవింద్.

భారత రాష్ట్రపతి ప్రసంగం

అనంతరం రాష్ట్రపతి కోవింద్ హిందీలో ప్రసంగించారు. ప్రకృతి సౌందర్యం మరియు ఆధ్యాత్మికత యొక్క అద్వితీయ సమ్మేళనాన్ని కలిగి ఉన్న ఆశ్రమ మైదానం గుండా నడవడం తనను ఎంతగా ఆకట్టుకుందో చెప్పడం ప్రారంభించారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి మరియు ఇతర దేశాల నుండి వచ్చిన భక్తులను ప్రస్తావిస్తూ, వారి ధ్యాన మార్గానికి తన ప్రశంసలను హృదయపూర్వకంగా ఆంగ్లంలో వ్యక్తపరిచారు మరియు వారందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీ కోవింద్ మాట్లాడుతూ, “సమస్త మానవాళికి నిరంతరాయంగా సేవ చేస్తూ శత వత్సరాలు పూర్తి చేసుకున్న యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను నేను అభినందిస్తున్నాను మరియు శ్రీ పరమహంస యోగానంద ఆలోచనలు మరియు ఆదర్శాలతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీ పరమహంస యోగానంద సందేశం ఆధ్యాత్మికతకు సంబంధించిన సందేశం. మతం యొక్క పరిమితులను దాటి, అన్ని మతాలను గౌరవించాలనే సందేశం ఆయనిది; ప్రపంచ సోదరభావమే ఆయన దృక్పథం.”

పరమహంసగారి గీతా వ్యాఖ్యానాన్ని హిందీలో తీసుకొచ్చినందుకు వై.ఎస్‌.ఎస్‌.ను రాష్ట్రపతి కోవింద్ ప్రశంసించారు, “ఈ హిందీ అనువాద ప్రచురణ ద్వారా, ఈ పుస్తకంలో అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని అందించే బోధనలు, రోజువారీ జీవితంలో చాలా సహాయపడతాయి, ఇవి ఇప్పుడు చాలా పెద్ద పాఠకుల సంఖ్యకు అందుబాటులోకి వచ్చాయి. గీతా బోధలను తమ ప్రవర్తనలో చేర్చుకున్న ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండగలుగుతారు మరియు ప్రతికూలతలను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతారు” అని కూడా ఆయన తన నమ్మకాన్ని వ్యక్తపరచారు. ఇప్పుడు హిందీలో అందుబాటులోకి వచ్చిన పరమహంస యోగానందవారి గీతా వ్యాఖ్యానం ద్వారా లక్షలాది మంది ప్రజలు తమను తాము బాగా తెలుసుకుని, తమ జీవితాలను మెరుగుపరుచుకునే మార్గాన్ని గుర్తించగలరని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.”

నేటి ప్రపంచంపై పరమహంస యోగానందవారి ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రశంసిస్తూ రాష్ట్రపతి ఇలా అన్నారు: “శ్రీ పరమహంస యోగానంద భౌతికవాదం మరియు పోటీ తత్వంలో నిండిన నేటి యువ తరాన్ని కూడా బాగా ఆకట్టుకున్నారు. తీవ్రమైన పోటీ మధ్య అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి మరియు విజయాన్ని సాధించడం ద్వారా, చాలా మంది యువకుల విజయాలకు స్ఫూర్తి [పరమహంసగారి] ఒక యోగి ఆత్మకథ అన్నారు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన పుస్తకం, మరియు మీలో చాలామంది దీనిని చదివారని నేను అనుకుంటున్నాను; నాకు కూడా ఆ అవకాశం వచ్చింది. జీవితంలో అందరూ అనుసరించాల్సిన సరైన మార్గాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుంది.”

బయలుదేరే ముందు లిప్త కాల శోషణ

కార్యక్రమం తర్వాత, రాష్ట్రపతి కోవింద్ ప్రస్తుతం ప్రార్థనా మందిరంగా సంరక్షిచబడుతున్న శ్రీ పరమహంసగారి ఆవాస గృహాన్ని సందర్శించడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. స్వామి చిదానంద ఆయనను మరియు ఇతర ప్రముఖులను ఈ పవిత్ర స్థలానికి తీసుకెళ్లారు, అక్కడ వారు కొన్ని క్షణాలు మౌనంగా గడిపారు. అపుడు పొందిన అనుభవానికి చలించిపోయిన రాష్ట్రపతి కోవింద్ తన ఆశ్రమ సందర్శనను ఎంతో ప్రశంసిస్తూ సెలవు తీసుకున్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని సారాంశాలు భారతీయ టెలివిజన్‌లో ప్రసారం చేయబడ్డాయి మరియు మరుసటి రోజు వార్తాపత్రికలలో నివేదికలు ప్రచురించబడ్డాయి. వారి ప్రసంగం యొక్క వీడియో (హిందీలో) ఆయన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేయబడింది (క్రింద చూడండి).

పరమహంస యోగానందగారి గది నుంచి బయటకు వస్తున్న రాష్ట్రపతి కోవింద్.
పరమహంసగారి మందిరాన్ని సందర్శించిన తర్వాత ఝార్ఖండ్ గవర్నర్ మరియు ముఖ్యమంత్రితో భారత రాష్ట్రపతి.

ఇతరులతో పంచుకోండి