“ఆ బొగ్గుల బుట్ట” — భారతదేశపు ఒక సాంప్రదాయక కథ తిరిగి పునరావృతం చేయబడింది

09 నవంబర్, 2023

ఒక ముని, తన విద్యార్థులకు భగవద్గీతను బోధించిన తరువాత, వారు చేస్తున్న ఉదయపు పనులను గమనించాడు.

“ప్రేమల్, ఎందుకు బాధగా ఉన్నావు?” ఇటీవలే ఆశ్రమానికి వచ్చిన ఓ యువకుడిని ఆయన అడిగాడు.

“అయ్యా, గీత గురించి మీరు చెప్పే మాటలు వినడం నాకు ఎంతో ఇష్టం, కాని తరువాత నాకు పెద్దగా గుర్తుండటం లేదు. ఇతర అబ్బాయిలు ఈ పవిత్ర బోధనల గురించి సులభంగా మాట్లాడతారు, కాని నాకు ఏమీ తెలియడం లేదు.” ప్రేమల్ నిరుత్సాహంగా నేలవైపు తలదించుకున్నాడు. “ఇక్కడ ఉండదగ్గవాడిని కాదని నేను అనుకుంటున్నాను,” అని అతను ముగించాడు.

ఆ ముని ఒక్క క్షణం ఆలోచించి, ఇలా అన్నాడు, “ప్రేమల్, ఆ బొగ్గు బుట్ట నా దగ్గరకు తీసుకురా.” సేవ చేయడమంటే ఆ బాలుడికి చాలా ఇష్టం, మరియు పొయ్యి దగ్గరకు బొగ్గును తీసుకెళ్ళడానికి విద్యార్థులు ఉపయోగించే బుట్టతో ఆసక్తిగా తిరిగివచ్చాడు. రోజూ బొగ్గును మోయడం వల్ల బుట్ట లోపలంతా దాని దుమ్ముతో నల్లగా ఉంది.

“నదిలోని నీటిని బుట్టలో నింపి నా దగ్గరకు తిరిగి తీసుకురా” అని ఆజ్ఞాపించాడు. గందరగోళంగా ఉన్న బాలుడి రూపాన్ని చూసి, ఆయన ఇంకా ఇలా అన్నాడు “నేను చెప్పినట్లు చెయ్యి, అంతే.”

బాలుడు బుట్టను నదిలో ముంచాడు, కాని అతను తిరిగి వచ్చేలోపు నీరంతా బయటకు కారిపోయింది. “మళ్ళీ అలాగే చెయ్యి,” అని ముని ఆజ్ఞాపించాడు. బాలుడు ఐదుసార్లు బుట్టలో నీటిని నింపాడు, ప్రతిసారీ అతను వేగంగా పరిగెత్తినప్పటికీ, ఆ ముని వద్దకు అతను చేరుకునేలోపే బుట్ట ప్రతిసారీ ఖాళీ అయిపోయింది.

చివరగా ఆ బాలుడు ఇలా అన్నాడు, “గురువుగారు, మీరు నాకు అసాధ్యమైన పని అప్పగించారు. మీ కోసం ఈ బుట్టలో ఎన్నిసార్లు నీళ్ళు తీసుకురావాలని ప్రయత్నించినా ప్రయోజనం లేదు.”

ముని అతని వైపు ప్రశ్నార్థకంగా చూసి “దానితో ఉపయోగం లేదని అంటున్నావా? బుట్ట లోపల చూడు,” అన్నాడు.

ఆ బాలుడు చూసినప్పుడు, ఆ బుట్ట ఇప్పుడు భిన్నంగా ఉంది. అది పరిశుభ్రంగా ఉంది; నల్లటి ధూళితో ఉన్న జాడలన్నిటినీ నీరు పోగొట్టేసింది.

అప్పుడు ఆ ముని ఇలా వివరించాడు, “మనం భగవద్గీత చదువుతున్నప్పుడు నీకు అన్నీ గుర్తుండకపోవచ్చు లేదా అర్థం కాకపోవచ్చు. కాని అనిత్యమైన భ్రమ మరియు భయాల నుండి నీ హృదయం పరిశుభ్రమయ్యే వరకు, ఓర్పు మరియు భక్తితో కేవలం వినడం వలన కూడా, క్రమంగా నీ చైతన్యం మార్పు చెందుతుంది.”

బాలుడి చుట్టూ ఆప్యాయంగా చెయ్యి వేస్తూ, ముని ఇలా అన్నాడు: “దేవుడు పండితుడు కాదు, కాని ఆయన ఒక ప్రేమికుడు. నీవు ఆయనను చిత్తశుద్ధితో అన్వేషిస్తే, ఆయన నిన్ను సమూలంగా ఎలా మార్చివేశాడో ఏదో ఒక రోజున నీవు తెలుసుకొంటావు.”


ఇతరులతో పంచుకోండి