“జీవశక్తి రహస్యం” గురించి పరమహంస యోగానంద

9 ఏప్రిల్, 2024


శక్తి యొక్క భౌతిక ఆధారాలను (సరియైన ఆహారం, క్రమబద్ధమైన శ్వాసక్రియ, తగినంత సూర్యకాంతి) మరియు అలాగే అంతర్గత ఆధారాలను (ఆత్మ మరియు పరమాత్మల నుండి ప్రవహించే దివ్య జీవశక్తులు మరియు చైతన్యం) వివేకవంతంగా ఉపయోగించడం ద్వారా — మనలో ప్రతి ఒక్కరు మన శరీరాలు మరియు మనస్సులలో అద్భుతమైన జీవశక్తిని సంరక్షించుకొనే విధానాన్ని నేర్చుకోవడమెలాగో పరమహంసగారు తన రచనలు మరియు పాఠాలలో వివరించారు.


పరమహంస యోగానందగారి ప్రసంగాల, వ్యాసాల కూర్పు అయిన రెండవ సంపుటం
దివ్య ప్రణయం లోని ఒక ప్రసంగం “అలసట లేకుండా పనిచేయడం ఎలా,” లో ఈ సూత్రాల గురించి క్రింద ఉన్న సారాంశంలో వివరించారు.

ఆహారం నుండి వచ్చే శక్తిది రెండో స్థానం మాత్రమే. విశ్వమంతా వ్యాపించి ఉంటూ, మన శరీరం చుట్టూ ఉన్న వివేకవంతమైన విశ్వశక్తి నుండే శరీరంలోకి అత్యధికంగా శక్తి ప్రవహిస్తుంది….

ఆహారాన్ని శక్తిగా మార్చడానికి శరీరానికి కొన్ని గంటలు పడుతుంది, కాని సంకల్పాన్ని ప్రేరేపించేది ఏదయినా సరే శక్తిని వెంటనే పుట్టిస్తుంది.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా బోధించే శక్తిపూరణ వ్యాయామాలు విశ్వవ్యాప్తంగా ఉన్న శక్తిని సంకల్పం ద్వారా గ్రహించి శరీరంలోని కోట్ల కొలది కణాలకు సంకల్పంతో పంచి ఇవ్వడమనే సూత్రం మీద ఆధారపడి ఉన్నాయి.

నిరుపయోగమైన కార్యకలాపాల వల్ల, నిగ్రహించని భావోద్రేకాల వల్ల, అనుచిత జీవనవిధానాల వల్ల శక్తి నిరంతరం వ్యర్థమవుతూ ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా తక్కువ శక్తి ఖర్చు అవుతుంది, కాని కోపం, ద్వేషం, ఇతర ఉద్రేకాలతో ఉన్నప్పుడు మీరు చాలా ఎక్కువ శక్తి వినియోగించవలసి ఉంటుంది. ఒక సున్నిత యంత్రాన్ని పనిచేయిస్తున్నప్పుడు తగిన జాగ్రత్త అవసరం; శరీరమనే యంత్రాన్ని వాడుతున్నప్పుడు ఇదే విషయం గుర్తుంచుకోవాలి…

అందుచేత, ఉన్న శక్తిని పొదుపు చెయ్యడం, కొత్త శక్తిని సంకల్పం ఉపయోగించి శరీరంలోకి తెచ్చుకోవడమే జీవశక్తికి రహస్యం. ఎలా?

మొదట, మీరు మనస్ఫూర్తిగా పని చెయ్యాలి. ఏదయినా చేయదగిన పని అయినప్పుడు, అది మనస్ఫూర్తిగా చేసినప్పుడు మీకు ఎక్కువ శక్తి ఉంటుంది, ఎందుకంటే తద్ద్వారా మీరు మెదడులో నిలువ ఉన్న శక్తిని గ్రహించడమే కాక, మెడుల్లా ద్వారా శరీరంలోకి విశ్వశక్తి ప్రవాహాన్ని ఎక్కువగా ఆకర్షిస్తారు….

మన పనులకు కావలసిన శక్తి ప్రవాహాన్ని శరీరమనే బేటరీ యొక్క భౌతిక సరఫరా నుండి — ఆహారం, ప్రాణ వాయువు, సూర్యరశ్మి నుండి వడబోసిన శక్తి ద్వారా మాత్రమే చాలా వరకు గ్రహిస్తాము. మన సంకల్పం సచేతనంగా ప్రయోగించడం ద్వారా అదృశ్యంగా ఉన్న విశ్వశక్తి స్థానం నుండి అవసరమైనంత శక్తిని గ్రహించే అవకాశాన్ని మనం సాధారణంగా ఉపయోగించుకోము.


సంకల్పం, శక్తి కలసికట్టుగా పనిచేస్తాయి

సచేతనంగా ఉపయోగించిన సంకల్పానికి, ఊహకు మధ్య భేదం ఉంది. ఒకరు చేయాలని ఆశిస్తున్నదాని భావనే ఊహ.

పగలూ, రాత్రీ ఎక్కువ ప్రాణశక్తితో ఉన్నట్టు ఊహించుకోవడం వల్ల మీకు కొంత బలం వస్తుంది, ఎందుకంటే ఊహించడానికి కొంతయినా సంకల్పం అవసరమవుతుంది. అలా కాకుండా, ఒక వ్యక్తి ప్రాణశక్తిని సచేతనంగా సంకల్పించినప్పుడు, నిజంగా అక్కడ శక్తి వెంటనే ఉంటుంది.

మీకు కోపం వచ్చి ఎవరినయినా గట్టిగా కొట్టారనుకోండి, ఉద్రేకం చేత ప్రేరేపించబడిన సంకల్పం ఆ పని కోసం శక్తిని ఆకర్షిస్తుంది; కాని ఆ వెంటనే శక్తిప్రవాహం ఆగిపోతుంది, మీ ప్రాణశక్తి తరిగిపోతుంది.

కాని అనుకూల దృక్పథంతో, ఎడతెగకుండా మీ శరీరంలోకి శక్తి సరఫరాను సంకల్పిస్తూ, యోగదా శక్తిపూరణ వ్యాయామ సూత్రమయిన సచేతన ప్రాణ శక్తి నియంత్రణను ప్రయోగిస్తే, ఇచ్ఛాశక్తిని ఉపయోగించడం ద్వారా, విశ్వశక్తి స్థానం నుండి అపరిమితమైన శక్తిని పొందగలుగుతారు.

శరీరం కణాల సమూహమే కాబట్టి, దానిలో శక్తి తగ్గినప్పుడు మీరా విధంగా శరీరమంతటిని సంకల్పంతో శక్తివంతంగా చేసినప్పుడు, ఆ కణాలు తక్షణమే నిరంతరాయ శక్తితో పూరణ చెందుతాయి. శరీరంలోకి అధిక శక్తిని ప్రవేశపెట్టే మీటయే సంకల్పము.

ఆ విధంగా సంకల్పం యవ్వనాన్ని, బలాన్ని నిలిపి ఉంచే ఒక ముఖ్యాంశం. మీకు వృద్ధాప్యం వచ్చిందని నమ్మితే మీ సంకల్పం హీనమవుతుంది. మీరు ముసలివారవుతారు.

అలసిపోయాను అని ఎప్పుడూ అనవద్దు; అది సంకల్పశక్తిని నిర్వీర్యం చేస్తుంది. అప్పుడు నిజంగానే అలసిపోతారు. “నా శరీరానికి విశ్రాంతి కావాలి” అనండి. శరీరాన్ని తన పరిమితులను మీ ఆత్మకు విధించనివ్వకూడదు. ఆత్మ శరీరాన్ని పాలించాలి. ఎందుకంటే ఆత్మ శరీరం వల్ల పుట్టనూ లేదు, శరీరంపై ఆధారపడీ లేదు. ఆత్మ యొక్క సంకల్పంలోనే సమస్త శక్తి ఉంది.

భగవంతుడు సంకల్పించాడు, కాంతి పుట్టింది — విశ్వ సృజనాత్మక శక్తి ఘనీభవించి, ఆకాశంగాను, మన శరీరాలు గానూ, ఇంకా అన్ని రూపాలను ధరించింది. సంకల్పమే కాంతి, ఎందుకంటే భగవంతుని సంకల్పం యొక్క మొదటి వ్యక్తీకరణ కాంతి. ఈ కాంతి లేక విద్యుచ్ఛక్తి ప్రాణులను సృష్టించడానికి వీలయిన ప్రమాణమని భగవంతుడు గమనించాడు.

పదార్థమే కాంతియా లేక కాంతే పదార్థమా అని శాస్త్రజ్ఞుడు తర్కిస్తాడు. కాంతే ముందుగా వచ్చింది, అదే పదార్థంలోని మౌలిక నిర్మాణం.

అందుచేత, శక్తి, సంకల్పం కలసికట్టుగా పని చేస్తాయని తెలుసుకోవాలి. అది చాలా సరళమైన సూత్రం. శక్తి, భౌతిక విషయాల నుండే వస్తుందనే అభిప్రాయానికి మనం అలవాటు పడిపోవడం వల్ల, విశ్వవ్యాప్తమైన శక్తిని సంకల్పం ద్వారా తక్షణం గ్రహించగలమని నమ్మము, ఆకర్షించము.

యోగదా సత్సంగ విధానం ద్వారా సంకల్పాన్ని ఉపయోగించి అపారమైన విశ్వశక్తిని నేరుగా గ్రహించడం నేర్చుకుంటే, మీకు ఏ మాత్రం అలసట అనేదే ఉండదు.


క్రియాయోగ మార్గంలో భాగంగా పరమహంస యోగానందగారు బోధించిన వై.ఎస్.ఎస్. శక్తిపూరణ వ్యాయామాలు మరియు సంపూర్ణ ధ్యాన శాస్త్రం గురించి నేర్చుకునేందుకు, యోగదా సత్సంగ పాఠాలు — ఒక సమగ్ర గృహ అధ్యయన పాఠ్యక్రమం, జీవశక్తిని సృష్టించుకోవడం మరియు శరీరం, మనస్సు, ఆత్మల గరిష్ట శ్రేయస్సు కోసం ఆయన లోతుగా అందించిన “జీవించడం ఎలా” బోధనలు — గురించి చదివి దరఖాస్తు చేసుకొనేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

ఒక యోగి ఆత్మకథ లో ఆయన ఇలా వ్రాశారు, “సులభంగాను, నిర్దుష్టంగాను ఉండే క్రియాయోగ పద్ధతుల్ని క్రమక్రమంగా, నియమానుసారంగా పెంచుతూ సాధన చెయ్యడంవల్ల, మనిషి శరీరం రోజురోజుకూ సూక్ష్మరూపంలో పరివర్తన చెందుతూ ఉంటుంది, మరియు విశ్వశక్తి తాలూకు అనంత సామర్థ్యాల్ని అభివ్యక్తం చెయ్యడానికి తగి ఉంటుంది.”

ఇతరులతో పంచుకోండి