“నిజమైన భక్తి అంటే ఏమిటి?” అనే ప్రశ్నకు కృష్ణ భగవానుడి సమాధానం

9 ఫిబ్రవరి, 2024

కమలం

ప్రతి వారం నిర్వహించబడే వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆన్‌లైన్‌ స్ఫూర్తిదాయక ప్రసంగాల శ్రేణిలో భాగంగా ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసి స్వామి కమలానంద గిరి ప్రసంగం “అదృశ్య భగవంతుడిని భక్తి ఎలా వెల్లడిస్తుంది” నుండి ఈ కథ సంగ్రహించబడింది. పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ వీక్షించవచ్చు.

ఒక రోజు కృష్ణ భగవానుడు కొంతమంది శిష్యులతో కలసి ప్రకృతిని ఆస్వాదిస్తూ నది ప్రక్కన కూర్చున్నాడు. కొంతసేపటి తరువాత శిష్యులలోని ఒకతను ఒక ప్రశ్న అడగడానికి సాహసించాడు: “ప్రభూ కృష్ణా, నిజమైన భక్తి అంటే ఏమిటో మాకు వివరిస్తావా? ఒక నిర్మలమైన భక్తుడు నిజమైన భక్తిని ఎలా ఆచరిస్తాడు?”

తన శిష్యులు ఆధ్యాత్మిక భావనలను అర్థం చేసుకోవడంలో సహాయం చేయడానికి కృష్ణుడు ఎల్లప్పుడూ ఆసక్తి కనబరుస్తాడు, కాబట్టి శిష్యుడితో ఆయన ఇలా అన్నాడు: “నువ్వు నది దగ్గరకు వెళ్ళి నదీగర్భం నుండి ఒక గులకరాయిని తెచ్చి నాకెందుకు ఇవ్వకూడదు.” ఆ శిష్యుడు అందుకు అంగీకరించి, చిన్న గులకరాయిని తెచ్చి కృష్ణుడికి ఇచ్చాడు.

కృష్ణుడు ఇలా అన్నాడు: “ఈ గులకరాయి బయట ఎంత తడిగా ఉందో చూడు. ఇప్పుడు ఈ గులకరాయిని రెండుగా పగులగొట్టు.” ఆ శిష్యుడు ఒక పెద్ద రాయితో ఆ గులకరాయిని సగానికి పగులగొట్టాడు.

కృష్ణుడు ఇలా అన్నాడు: “ఆ గులకరాయి బయట తడిగా ఉన్నా కూడా లోపల ఎలా ఎండిపోయి ఉందో చూడు. పైకి మాత్రమే భగవంతుని పట్ల భక్తి, ప్రేమలనే పూత వేయబడిన భక్తుల్లా ఉంది ఇది. ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో, ఆదర్శవంతమైన పరిస్థితుల్లో ఉన్నంతవరకు మాత్రమే వారు అలా ఉంటారు. వారి లోపలి భాగం ప్రభావితం కాకుండా ఎప్పటికీ పొడిగా ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక వాతావరణం నుండి వారు తొలగించబడిన క్షణంలోనే, వారి భక్తి ఆవిరైపోతుంది.”

ఆ శిష్యులందరూ ఏకాగ్ర చిత్తంతో వింటున్నారు. అప్పుడు కృష్ణుడు లేచి నది వద్దకు వెళ్ళి తన పట్టు శాలువ అంచును నీటిలో ముంచాడు.

ఆయన దాన్ని తిరిగి శిష్యుల వద్దకు తీసుకువచ్చి ఇలా అన్నాడు: “మునిగిన కొన వరకు ఈ దారాలన్నీ పూర్తిగా ఎలా తడిచిపోయాయో చూడండి? చాలామంది భక్తులు ఇలాగే ఉంటారు. భగవంతుని పట్ల భక్తితో నిండిపోయినట్లుగా, ప్రేమతో తడిచిపోయినట్లుగా ఉంటారు. కాని నా శాలువను నీటి నుండి బయటకు తీసిన క్షణంలోనే గాలితో అది ఎండిపోతుంది, మరికొంత సమయం తరువాత దాని మీద నీటి జాడ ఏమాత్రం ఉండదు.

“అదే విధంగా, ఇటువంటి భక్తులు దైవ కార్యకలాపాలలో నిమగ్నమైనప్పుడు మరియు ఆధ్యాత్మిక సాహచర్యంలో ఉన్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మరియు ఆరాధిస్తున్నప్పుడు వారు భక్తితో నిండిపోతారు. కాని ఏ క్షణంలో వారు ప్రపంచంలోకి తిరిగి వెళతారో, వారి భక్తి ఆవిరైపోతుంది.”

తరువాత తమ గురువు ఏమి చేయబోతున్నారో అర్థం చేసుకోవడానికి శిష్యులు ప్రయత్నిస్తున్నారు. ఒక క్షణం తరువాత, కృష్ణుడు ఒక శిష్యుడికి పంచదార ముద్ద ఇచ్చి ఇలా అన్నాడు, “వెళ్ళి దీన్ని నీటిలో వెయ్యి,” ఆ శిష్యుడు అలాగే చేశాడు.

ఒక నిమిషం తరువాత, కృష్ణుడు ఇలా అన్నాడు, “వెళ్ళి దాన్ని తీసుకు రా.” శిష్యుడు వెళ్ళి చూశాడు కాని పంచదార నీటిలో కరిగిపోయింది, దాని జాడ ఎక్కడా లేదు. కృష్ణుడు ఇలా అన్నాడు: “ఒక నిజమైన భక్తుడు ఇలా ఉంటాడు. అతడు లేదా ఆమె తమ అహంకారాన్ని ఈశ్వరుడిలో కరిగించేస్తారు. అప్పుడిక ఎడబాటు ఉండదు. వారిద్దరూ ఒక్కటే.”

కమలం

ఇతరులతో పంచుకోండి