భారతీయ ఉన్నతాధికారులు రైలుకు పునఃనామకరణం చేసి పరమహంస యోగానందగారిని గౌరవించారు

25 జూన్, 2015

జూన్ 21న మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా భారతదేశంలోని రాంచీ—1918లో తన “జీవించడం-ఎలా” పాఠశాల మరియు ఆశ్రమం స్థాపించిన నగరం—మరియు కోల్‌కతాలోని హౌరా స్టేషన్ ను కలిపే ఎక్స్‌ప్రెస్ రైలుకు పునఃనామకరణం చేయడం ద్వారా పరమహంస యోగానందగారు గౌరవించబడ్డారు.టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ 25న ఆన్‌లైన్ ప్రచురణలోని ఒక వ్యాసంలో నివేదించినట్లుగా, ఈ రైలును ఇప్పుడు “క్రియాయోగ ఎక్స్‌ప్రెస్” అని పిలవడం జరుగుతుంది.

ఝార్ఖండ్—రాంచీ ఉన్న రాష్ట్రం— లోని ఇద్దరు ఉన్నతాధికారులు, యోగా చేసిన ఆచరణాత్మకమైన, లోతైన మార్పుల గురించి మరియు యోగాను ప్రపంచవ్యాప్తంగా ఆచరించేందుకు మార్గదర్శక ప్రభావం చూపించిన పరమహంస యోగానందగారి కార్యాచరణను గురించి ప్రశంసించేందుకు వచ్చిన అవకాశాన్ని స్వీకరించి తమ వ్యాఖ్యానాలను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.)కు విడివిడిగా లేఖల ద్వారా పంపించారు.

గౌరవనీయులైన ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్, వై.ఎస్‌.ఎస్. రాంచీ ఆశ్రమానికి దిగువనున్న ఈ లేఖను పంపించారు:

“భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ హటియా-హౌరా-హటియా ఎక్స్‌ప్రెస్ కు ‘క్రియాయోగ ఎక్స్‌ప్రెస్’ గా పునఃనామకరణం చేశారని తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. పరమహంస యోగానందగారి తపో భూమియైన రాంచీ గుర్తింపుకు ఇది ఒక క్రొత్త కోణాన్ని జోడించింది. దీనికి నేను మన గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారికి మరియు మన రైల్వే మంత్రి శ్రీ సురేష్ ప్రభుగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక పురోగతి, స్వీయ-క్రమశిక్షణ మరియు శరీరం-మనస్సు యొక్క జీవశక్తి కోసం యోగా యొక్క ప్రాముఖ్యత విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. రాంచీ నుండి ప్రారంభించి, భారతదేశంలోను మరియు ప్రపంచవ్యాప్తంగాను పరమహంస యోగానందగారు తన క్రియాయోగ బోధనలను విస్తృతంగా వ్యాప్తి చేయడం మరియు పాశ్చాత్య దేశాలలో యోగాపై అవగాహనను మేల్కొల్పడం, మనందరికీ ఎంతో గర్వకారణం.

పరమహంస యోగానందగారి నిస్వార్థ ప్రయత్నాల వల్లనే ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగాన్ని అనుసరించే లక్షలాది మంది, దైవానుసంధానం యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రయత్నాల ద్వారా, ప్రపంచమంతా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంది. ఆయన ప్రయత్నాలు యోగా వ్యాప్తిని ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాయి.

“భారతదేశంలోను మరియు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలలో యోగా బోధలను వ్యాప్తి చేస్తున్నందుకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, రాంచీకి, నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు ఈ సందర్భంగా వారి త్రైమాసిక పత్రికను విజయవంతంగా ప్రచురిస్తున్నందుకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.”

గౌరవనీయులైన ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ముగారి నుండి మరో ప్రశంసాపూర్వక లేఖ అందుకోవడం జరిగింది:

“యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా చొరవతో, హౌరా-హటియా-హౌరా ఎక్స్‌ప్రెస్‌ కు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ‘క్రియాయోగ ఎక్స్‌ప్రెస్’ అని పేరు పెట్టడం నాకు ఆనందాన్ని కలుగజేసింది, ఇది యోగా సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసేందుకు సహాయపడుతుంది.

“యోగా అనేది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు శక్తివంతమైన సాధనం మాత్రమే కాదు, శారీరక వ్యాధులను కూడా అది నయం చేస్తుంది. ఒక వ్యక్తి యొక్క శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిలో అది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరాన్ని అది శక్తితో నింపి మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. యోగాను విస్తృతంగా అవలంబించడం వల్ల ఆరోగ్యకరమైన ప్రజలు, ఒక ఆరోగ్యకరమైన సమాజం మరియు ఒక ఆరోగ్యకరమైన దేశం అనే భావన కార్యరూపం దాల్చవచ్చు. మన దేశం తీసుకున్న చొరవతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం, మరియు ఈ సందర్భంగా నిర్వహించిన శిబిరాల్లో ప్రజలు చురుకుగా పాల్గొనడం గర్వించదగ్గ విషయం.

“యోగా సందేశాన్ని జాతీయంగా మరియు అంతర్జాతీయంగా వ్యాప్తి చేసేందుకు పరమహంస యోగానందగారు స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యాచరణను నేను ఎంతగానో అభినందిస్తున్నాను.”

క్రొత్తగా రైలుకు పెట్టిన పేరు సాంకేతికంగా సముచితమైనది. రాంచీలో పాఠశాల మరియు ఆశ్రమాన్ని ఆయన స్థాపించే సంవత్సరాల్లో, పరమహంసగారు తరచుగా రాంచీ మరియు కోల్‌కతా మధ్య రైలులో ప్రయాణించేవారు. క్రియాయోగాన్ని పాశ్చాత్య దేశాలకు, తద్ద్వారా ప్రపంచానికి పరిచయం చేసేందుకు నియమించబడిన సమయం వచ్చిందని సూచించే ఒక అంతర్దర్శనం తరువాత, బహుశా జులై 1920లో రాంచీలో రైలు ఎక్కడం వారి అత్యంత ముఖ్యమైన ప్రయాణం.

ఇతరులతో పంచుకోండి