“నిత్య యవ్వనం — ఆత్మగా మీ నిజతత్వాన్ని వ్యక్తం చెయ్యండి” గురించి శ్రీ దయామత

9 ఏప్రిల్, 2024


యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ లకు 1955 నుండి 2010లో గతించే వరకు ప్రియమైన సంఘమాతగా మరియ అధ్యక్షులుగా శ్రీ శ్రీ దయామాత ఉన్నారు. ఆమె ద్వైమాసిక లేఖలు దశాబ్దాలుగా వై.ఎస్.ఎస్. భక్తులకు నిరంతరం మార్గదర్శకత్వం చేస్తూ ప్రేరణకు ప్రతిష్టాత్మకమైన ఆధారంగా నిలిచాయి. 2001లో ఆమె పంపించిన ఒక లేఖ ఇక్కడ అందించబడింది, దీనిలో యవ్వనం యొక్క నిజమైన మూలాన్ని మరియు దాన్ని మన జీవితాల్లో ఆనందంగా ఎలా ప్రసరింపజేయవచ్చో మనకు ప్రేమగా గుర్తుచేస్తారు.

ప్రియతములారా,

యవ్వనాన్ని పొడిగించుకోవడమే నేటి ప్రజల ప్రాధాన్యంగా ఉంది. కాని యవ్వనంగా కనిపించడం మరియు యవ్వనంగా ప్రవర్తించడం వంటి బాహ్య అంశాలపైనే వారు దృష్టి పెడతారు. యవ్వనమనేది జీవితంలోని జీవశక్తిని మరియు సాధించే శక్తిని అందించే చైతన్యం యొక్క ఉన్నత స్థితి అని పరమహంస యోగానందగారు తన జీవితంలో నిరూపించారు.

ఆయన దివ్య ఆలోచనలు గల వాస్తవ ప్రపంచంలో నివసించారు. మన శరీరాలు మరియు మనస్సులు మనమేమిటనే సత్యాన్ని వ్యక్తపరిచేలా చేసే ఆలోచనలను పెంపొందించుకోవాలని మనకు నేర్పించారు: “మీరు, నిత్యయవ్వనం గల ఆత్మస్వరూపులు. మీ చైతన్యంలో ఈ ఆలోచనను ముద్రించండి: ‘నేను ఆత్మను, పరమాత్మ యొక్క నిత్యయవ్వన ప్రతిబింబాన్ని; నేను యవ్వన శక్తితో, ఆశయంతో, విజయం సాధించే శక్తితో సచేతనంగా ఉన్నాను.’”

దేవుణ్ణి తమ దైనందిన ఉనికిలోకి తెచ్చుకున్నవారే అత్యంత సచేతనగల “సజీవ” వ్యక్తులు.

యవ్వనానికి సంబంధించిన భౌతిక సాధనాలు, అవి దేవుని నియమాలపై ఆధారపడినంత వరకు ఆరోగ్యానికి సంబంధించినవి, అవి అనివార్యంగా తాత్కాలికమైనప్పటికీ విలువైనవి. నిజమైన యవ్వనం అనేది శరీర శ్రేయస్సును కాపాడుకోవడం కంటే చాలా ముఖ్యమైనది. ఇది మనస్సు మరియు ఆత్మ నుండి ఆంతరికంగా ప్రసరించే జీవశక్తి — దేవుని శాశ్వతమైన శక్తి మరియు ఆనందంతో మన గాఢమైన అంతర్గత సంబంధాన్ని అనుభూతి చెందడం ద్వారా జనించే ఆనందం.

జీవితంలోని ఉత్తమ అనుభవాలను సద్వినియోగం చేసుకోవడం మరియు శారీరక పరిమితుల వల్ల కలిగే ఇబ్బందులను నిరాకరించే సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసే యవ్వన ఉత్సాహంగల ఆత్మ లక్షణాన్ని భక్తులలో చూడడాన్ని నేను ఇష్టపడతాను.

మనం యుక్తవయసులో ఉన్నా లేక వృద్ధాప్యంలో ఉన్నా, మన మనస్సు మరియు సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో మన ఆసక్తిని నిరంతరం సమీక్షించుకున్నప్పుడు, హృదయం ఎల్లప్పుడూ ఇవ్వడానికి మరియు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మన పరిస్థితులు ఎలా ఉన్నా భగవంతునిపై విశ్వాసం ఉంచినప్పుడు, మనం నిజంగా అంతర్గత “యవ్వనత్వపు ఊట”ను స్వీకరిస్తున్నాము.

ప్రజలు ఆయన వయస్సును గురించి అడిగినప్పుడు, పరమహంసగారు సంతోషంతో ఇలా సమాధానమిచ్చేవారు: “నాకు వయస్సు లేదు; నా వయస్సు ఒక్కటే — అనంతం.” మీ బాహ్య రూపానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వకండి; అనేక లోక-సంబంధిత నివాసాలలో మీరు ధరించిన లెక్కలేనన్ని శరీర వస్త్రాలలో ఇది ఒకటి.

రోజులో అప్పుడప్పుడు మరియు రోజంతా, ప్రత్యేకించి మనస్సు ధ్యానంలో ఏకాగ్రతగా ఉన్నప్పుడు, మీరు భగవంతుని నిత్యమైన జీవంతో కూడిన ఆత్మ అని, ఆయన నిత్య యవ్వనంతో మరియు సౌందర్యంతో దీవించబడ్డారని మీరు గుర్తు చేసుకోండి. పరమహంసగారు ఇలా చెప్పారు: “తండ్రితో మీ ఏకత్వాన్ని అనుభవించండి….మీ శరీరం, మనస్సు మరియు ఆత్మలో ఆయన అనంతమైన అమరత్వాన్ని నమోదు చేస్తూ ఆయన వైభవాన్ని అనుభవించండి.”

దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు,

దయామాత

ఇతరులతో పంచుకోండి