శ్రీ దయామాతగారి పుస్తకం ప్రేమ మాత్రమే: మారే ప్రపంచంలో ఆధ్యాత్మిక జీవనం గడపటం లోని “నూతన సంవత్సరంలో ఆధ్యాత్మిక అవకాశం” అనే ప్రసంగం నుండి ఈ క్రింది సారాంశం సంగ్రహించబడింది. పరమహంస యోగానందగారి సన్నిహిత శిష్యులలో ఒకరైన శ్రీ దయామాత, 1955 నుండి 2010లో గతించేవరకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కు అధ్యక్షురాలిగా సేవలందించారు.
ఈ కొత్త సంవత్సరంలో మీలో ప్రతి ఒక్కరి కోసం నా ప్రార్థన ఏమిటంటే, ఆధ్యాత్మిక పథంలో మీ అత్యున్నత, అత్యుదాత్త లక్ష్యాలను మీరు సాధించాలని.
ఎవరైతే దివ్యప్రేమను కోరుకొంటున్నారో వాళ్ళకు అది లభించాలి. మీలో అవగాహనను అన్వేషించే వాళ్ళు, మానవ సంబంధాలలో కాకుండా అవగాహనకు మూలాధారమయిన ఆ దేవుడి దగ్గరే దాని కోసం అన్వేషించండి; బలం, ధైర్యం లేదా అణకువను కోరుకుంటున్నవాళ్లు, ఈ గుణాలను అలవరుచుకోవడానికి మీకు సహాయం చేయగలిగే, మిమ్మల్ని మీరు నిజమైన దైవసంతానంగా దర్శించగలిగేటట్లుగా మీలో ఉన్న దైవత్వాన్ని మేల్కొలపగలిగే, ఒకే ఒక ఆ గొప్ప గురువు సన్నిధికి వెళ్ళండి.
కొత్త సంవత్సరంలో, ధన్యులైన మన గురుదేవుల ప్రేరణ నాకు జ్ఞప్తికి వస్తున్నది: “మేల్కొనండి, ఇంక నిద్ర చాలు! మేల్కొనండి, ఇంక నిద్ర చాలు! మేల్కొనండి, ఇంక నిద్ర చాలు!”
శాంతి, ఆనందం, సంతోషం, దివ్యప్రేమలకు దారి ఏదంటే మీ చైతన్యాన్ని దేవుడిమీద కేంద్రీకరించి ఆయనలో స్థిరంగా ఉంచడమే. “దేవుడు మాత్రమే” అన్న ఒకే ఆలోచన మీద మనస్సు కేంద్రీకరించండి. “నువ్వు నా ధ్రువతారవు; నీలోనే నేను జీవిస్తున్నాను, కదులుతున్నాను, ఊపిరి పీలుస్తున్నాను, నా అస్తిత్వం నీలోనే ఉంది. నిన్ను ప్రేమించడమూ, నిన్ను సేవించడమూ తప్ప నాకు వేరే అవసరం ఏదీ లేదు.” ఈ కొత్త సంవత్సరంలో దీన్ని మీ నిరంతర ప్రార్థనగా చేసుకోండి.
రేయింబగళ్ళు దేవుడి మీదే మనస్సు లగ్నంచేసి ఆయన ప్రేమతో మైమరచిపొండి. ఆయన ఒక్కడే సత్యం. ఆయన ప్రేమలోనే జ్ఞానం, వినయం, ఆనందం, కరుణ, అవగాహన, తృప్తి ఇమిడి ఉన్నాయి. మనలో ప్రతి ఒక్కరం ఆ ప్రేమను మరింత పట్టుదలతో అన్వేషిద్దాం.
ఇంకా గాఢంగా ధ్యానించి, ఇంకా ఎక్కువ ఇష్టంతో ఇంకా ఎక్కువ ధర్మపరాయణత్వంతో, ఏకాగ్రతతో భగవంతుణ్ణి సేవించడానికి కృషి చేయండి.
సేవచేయడం మాత్రమే సరిపోదు; దాన్ని ప్రత్యేకంగా కలిగించిన ఒక అరుదైన అవకాశంగా భావించి మీ హృదయంలో గొప్ప విశ్వాసంతో, ఆనందంతో, ప్రేమతో సేవచేయండి.
దేవుడి మీద భక్తి గీతాలు పాడుకొంటూ, ఆ ఆనందకర చైతన్యాన్ని కొత్త సంవత్సరంలోని అన్ని దినాలకూ తీసుకొని వెళదాం. తద్ద్వారా ఈ సంవత్సరాన్ని దైవాన్ని గురించి ఆలోచిస్తూ మొదలుపెట్టినట్లుగానే, దైవాన్ని గురించి ఆలోచిస్తూ ముగిద్దాం!



















