విశ్వాసం యొక్క క్రియాశీలక శక్తి గురించి పరమహంస యోగానందగారు

24 జూన్, 2024

పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి…

విశ్వాసం అంటే పరిపూర్ణమైన నమ్మకం — దేవుడు సత్యమని మరియు ఆయన సహాయం మానవుడి జీవితంలోకి ప్రవహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, సహజావబోధంతో కలిగే దృఢ విశ్వాసం, ఆత్మ నుండి వచ్చే ఒక గ్రహింపు.

విశ్వాసం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే, ప్రతికూల ఆలోచనలు మరియు సందేహాల వల్ల దైవశక్తిని గ్రహించే మార్గం మూసుకుపోతుంది. మీరు అభ్యాసం చేసే కొద్దీ విశ్వాసం పెరుగుతుంది; కాని మీకు విశ్వాసం ఉన్నప్పుడు, మీరు ఏదైనా చేయగలరు. మీరు ఒకే ఆలోచనను ఎక్కువ కాలం అంటిపెట్టుకొని ఉండి, దానికి ప్రతికూలమైన దృష్టాంతాలు ఎదురైనా, అది అసాధ్యమని ప్రపంచమంతా నినదించినా, మీ విశ్వాసాన్ని సడలించకండి; ప్రజల ప్రతికూల ఆలోచనలతో మీరు పోరాడగలిగి, మీ లక్ష్యం కోసం పనిచేస్తూ, మీ స్వీయ ఆలోచనలను బలంగా ఉంచుకోగలిగితే, మీ లక్ష్యం మీకు సాకారమవుతుంది.

విశ్వాసం యొక్క శక్తితో, మునుముందుకు సాగిపోండి! దైనందిన ధ్యానం ద్వారా, ఆయనను ఎన్నడూ మరవకండి. ప్రతిరోజూ కొత్త దృశ్యాలు, ఆయన సాన్నిధ్యాన్ని గురించిన కొత్త విషయాలు మీకు వెల్లడవుతాయి. శక్తి ప్రవహిస్తుంది; ఎందుకంటే ఆయన శక్తి అక్కడ ఉంది. దానిని దృఢంగా గుర్తించండి; దాన్ని మీ ఉనికి యొక్క లోతుల్లో ప్రశాంతంగా జీర్ణించుకు పోనివ్వండి. ప్రాణశక్తిని నియంత్రించే శాస్త్రం [క్రియాయోగం] ద్వారా భగవంతుడు సమస్తాన్ని సృష్టించి, పోషించే సూక్ష్మ శక్తులను మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు, సృష్టి అంతటిపై ఆయనకున్న అధికారంలో మీరు భాగస్థులవుతారు.

విశ్వాసం యొక్క చుక్కానిని పట్టుకోండి, అవాంఛనీయ పరిస్థితులను పట్టించుకోకండి. దురదృష్టం యొక్క తీవ్రత కంటే ప్రచండంగా ఉండండి, మీకు కలిగే అపాయాల పట్ల నిర్భయంగా ఉండండి. కొత్తగా కనుగొన్న ఈ విశ్వాసం మీపై ఎంతగా క్రియాశీలక ప్రభావాన్ని చూపుతుందో, అంతగా బలహీనత పట్ల మీ బానిసత్వం మసకబారుతుంది.

ప్రతి వారం వెలువడే మా ఆన్‌లైన్ స్ఫూర్తిదాయక ప్రసంగాల పరంపరలో భాగంగా మే నెలలో విడుదలైన తన ప్రసంగం “దేవుని ప్రణాళికతో మన జీవితాలను అనుసంధానం చేయడం,” లో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్ అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు ప్రపంచ భవిష్యత్తు గురించి, అలాగే సానుకూల దృక్పథంతో విశ్వాసాన్ని కలిగి ఉండటం వల్ల వచ్చే అజేయమైన శక్తి గురించి పరమహంస యోగానందగారి సలహాలను పంచుకున్నారు. ప్రపంచ భవిష్యత్తు గురించి పరమహంసగారు ఏమి చెప్పారో తెలుసుకోవడానికి, కొత్తగా విడుదలైన స్వామి చిదానందగారి ఒక చిన్న వీడియోలోని ప్రసంగం చూడండి — మీరు దాని నుండి ప్రేరణ మరియు పరిజ్ఞానాన్ని పొందగలరని మేము ఆశిస్తున్నాము.

ఇతరులతో పంచుకోండి