నిగూఢంగా ఉన్న జీవశక్తి మూలాధారంతో అనుసంధానం పొందడం గురించి పరమహంస యోగానందగారు

10 ఏప్రిల్, 2024

ఒక పరిచయం:

మీరు మరింత జీవశక్తిని అనుభవించాలనుకుంటున్నారా? మనమందరం అలాగే అనుకుంటాం. అలా కావాలనుకుంటే, మనం తినే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవచ్చు, మనకు ఎంత విశ్రాంతి లభిస్తోంది, వివిధ కార్యకలాపాలను మనం ఎలా నిర్వహిస్తున్నాము మరియు మన స్వప్నాలను అధిక ఉత్సాహం మరియు సంకల్పంతో ఎలా సాకారము చేసుకుంటాము అనే వాటిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వలన మన శక్తి మరియు దృక్పథంలో ఉపయోగకర మార్పును మనం గమనించవచ్చు.

కాని పరమహంస యోగానందగారి బోధనలు, జీవితం యొక్క తెరవెనుక నిగూఢమైన శక్తి యొక్క మూలాధారంతో మనం సచేతనంగా అనుసంధానమైనప్పుడు, ఎంతో గొప్ప ప్రాణం మరియు శక్తితో మన రోజులు ఎలా నిండి ఉంటాయనేదాని గురించి అత్యధికంగా ఉద్ఘాటిస్తాయి.

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క సంఘమాత మరియు మూడవ అధ్యక్షురాలైన శ్రీ దయామాత ఒకసారి ఇలా చెప్పారు, “మానవుడు దేవుణ్ణి అంగీకరించినా లేకపోయినా, నిజం ఏమిటంటే, అదృశ్యంగా ఉన్న దైవ ఉత్పత్తిస్థానం నుండి నిరంతరం ప్రవహించే ప్రాణం, జీవశక్తి మరియు మేధస్సుపైనే మన ఉనికి పూర్తిగా ఆధారపడి ఉంది.”

యవ్వనాన్ని మనము తరచుగా క్షణికమైనదిగా మరియు బాహ్యమైన స్థితిగా పరిగణిస్తామని ఆమె వివరించారు, “అది లోపలి నుండి ప్రసరించే మనస్సు మరియు ఆత్మ యొక్క ఒకానొక జీవశక్తి — దేవుని శాశ్వతమైన శక్తి మరియు పరమానందంతో మన గాఢమైన అంతర్గత సంబంధాన్ని అనుభవించటము ద్వారా ఉద్భవించే ఒక ఆనందం.”

జ్ఞానాన్ని గ్రహించడం మరియు ప్రాణమంతటికీ మూలాధారంతో అనుసంధానం పొందేందుకు పరమహంసగారు అందించిన ప్రక్రియలు సరళమైనవే కాని అత్యంత శక్తివంతమైనవి. ఈ ప్రక్రియలను సాధన చేయడం ద్వారా ఎక్కువ జీవశక్తిని అనుభవించడానికి మీరు ఈ ప్రేరణను వినియోగించుకొంటారని మేము ఆశిస్తున్నాము.

పరమహంస యోగానందగారి ఉపన్యాసాలు మరియు రచనల నుండి:

మీరు ఒక కొండపై నుండి ఒక నగరంలో అందంగా ప్రకాశిస్తున్న విద్యుత్ దీపాలను చూసినప్పుడు, ఆ దీపాలను ప్రకాశవంతం చేయడానికి విద్యుత్తును అందిస్తున్నది ఒక డైనమో అని మీరు మర్చిపోతారు. కాబట్టి మానవులలోని ప్రకాశవంతమైన జీవశక్తిని మీరు చూసినప్పుడు, వారిని ఉల్లాసంగా ఉంచేదేదో మీకు తెలియదు, అప్పుడు మీరు ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉన్నట్లే. ఆ శక్తి, అదృశ్యంగా ఉన్నప్పటికీ, అది చాలా స్పష్టంగా వ్యక్తమవుతోంది. అది అన్నివేళలా మన ఆలోచనల వెనుక దాగుడుమూతలాడుతోంది.

బాహ్య వనరుల (ఆహారం, ప్రాణ వాయువు మరియు సూర్యరశ్మి) నుండి పొందిన ప్రాణశక్తులతో మరియు అంతర్గత మూలం — విశ్వ చైతన్యం — నుండి ఉద్భవించిన జీవశక్తి (ప్రాణం) తోను శరీరం నర్తిస్తోంది. అంతర్గత ఆత్మ మూలం నుండి వచ్చే ప్రాణశక్తులు మరియు చైతన్యం లేకుండా, శారీరక శక్తి యొక్క బాహ్య వనరులతో శరీరాన్ని పోషించడం జరుగదు.

ఘనపదార్థాలలో నిక్షిప్తం చేయబడ్డ శక్తిస్వరూపులైన దేవదూతలుగా దేవుడు మనలను రూపొందించాడు — ప్రాణశక్తి ప్రవాహాలు ఈ మానవ శరీరం అనే భౌతిక దీపంలో మిరుమిట్లుగొల్పుతున్నాయి. కాని మానవ శరీరం యొక్క బలహీనతలు మరియు శరీర దౌర్భల్యాల మీద ఏకాగ్రత వలన, అనిత్యమైన మానవ శరీరంలో ఉన్న శాశ్వతమైన, నాశనం లేని ప్రాణశక్తి యొక్క గుణములను ఎలా అనుభవించాలో మనం మర్చిపోయాము.

1916 లో నేను కనుగొన్న మరియు అభివృద్ధి చేసిన శక్తిపూరణ వ్యాయామాల పద్ధతి, జీవాన్ని ఇచ్చే ప్రాణశక్తితో శరీరాన్ని సచేతనంగా పూరించడం చాలా ప్రయోజనకరమైన, సరళమైన మరియు శ్రమలేని పద్ధతి. కణజాలాలు, కణాలు మరియు రక్తాన్ని ఉద్దీపనం మరియు విద్యుదీకరణం చేయడం వలన అవి వ్యాధికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పొందుతాయి.

మీ రక్తాన్ని జీవశక్తితో నింపడానికి సరైన విధంగా శ్వాసించడం చాలా ముఖ్యం….ఈ పద్ధతిని నేర్చుకొని సాధన చేయండి: మొదట, ద్వంద్వ శ్వాసతో శ్వాసని బలంగా బయటకు నెట్టండి (ఒక చిన్న శ్వాస మరియు ఒక దీర్ఘ శ్వాస). అప్పుడు, ఒక ద్వంద్వ శ్వాసతో శ్వాస తీసుకోండి (ఒక చిన్న శ్వాస మరియు ఒక దీర్ఘ శ్వాస), ఇబ్బంది లేకుండా ఊపిరితిత్తులను నింపగలిగినంతవరకు శ్వాస తీసుకోండి. ప్రాణవాయువును పూర్తిగా గ్రహించి ప్రాణంగా మారటానికి వీలు కలిగిస్తూ, కొన్ని క్షణాలపాటు ఊపిరితిత్తులలో గాలిని నిలిపి ఉంచండి. అప్పుడు, ద్వంద్వ శ్వాసతో ఊపిరి విడిచిపెట్టడం మరియు తీసుకోవడం పునరావృతం చేయండి. ఈ పద్ధతిని స్వచ్ఛమైన గాలిలో ఉదయం 30 సార్లు మరియు రాత్రి 30 సార్లు సాధన చేయండి. ఇది చాలా సరళమైనది. మీరు దీన్ని అనుసరిస్తే మీరు గతంలో కంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఈ వ్యాయామం ఎంతో ఎక్కువ ప్రాణశక్తిని తీసుకువస్తుంది; మరియు మీ రక్తాన్ని శుద్ధి చేసి ప్రశాంతతను పెంచుతుంది.

మీలో నుండి ఉబుకుతున్న గాఢమైన ఆనందంతోను, మరియు ధైర్యంతో కూడిన ఉల్లాసంతోను మీ విధులన్నిటినీ నిర్వహించడం నేర్చుకోండి. అప్పుడు మీ దైనందిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు మీ శరీరమంతా జీవశక్తి ప్రవాహముతో ఉప్పొంగడాన్ని మీరు గమనిస్తారు.

ఈ గొప్ప నియమం కొంతమందికి మాత్రమే తెలుసు, కాని చాలా తక్కువ మంది దీనిని ఆచరణలో పెడతారు: మీ శరీరమంతా జీవశక్తితో నిండుతోందని నిరంతరం భావిస్తూ ఉండండి, ముఖ్యంగా అది బలహీనంగా అనిపించినప్పుడు, అప్పుడు మీ మెదడు నుండి మీ శరీరంలోకి శక్తి ప్రవహించడాన్ని మీరు అనుభూతి చెందుతారు. ఆహారం, గాలి మరియు సూర్యకాంతి వంటి బాహ్యమైన భౌతిక వనరుల నుండే కాకుండా, ఒక నూతన, రహస్యమైన, అదృశ్యమైన స్వీయ జీవశక్తి మూలాన్ని మీరు తెరవడం ప్రారంభిస్తారు.

ఈ ప్రాణం యొక్క మూలస్థానము గురించి మీకు స్పృహ ఉంటే, దాని జీవనాధారమైన శక్తి నుండి నిరంతరం దాన్ని ఎలా పొందవచ్చో మీకు తెలుస్తుంది.…ఈ ప్రాణం యొక్క సారం గురించి లక్షలాది మందికి తెలియదు, అయినప్పటికీ వారు ఎల్లప్పుడూ ఆ దేవుని శక్తిని వినియోగించుకొంటున్నారు. ఆ శక్తి గురించి ఎందుకు స్పృహలో ఉండకూడదు?

సృజనాత్మకము, ప్రాణాధారమైన భగవంతుడి శక్తితో మీరు నింపబడుతున్నారని భావించండి. మీ మర్త్య చైతన్యపు గతవైఫల్యాలు, భయం, వ్యాధి వృద్ధాప్యాన్ని చెరిపేస్తూ భగవంతుని నిత్య చైతన్యం మీ శరీరంలో వ్యక్తమవుతోందని భావించండి. ఈ ఆలోచనను గాఢమైన శ్రద్ధతో పునరావృతం చేయండి: “తండ్రీ, నీవు నా శరీరంలో, నా మనస్సులో, నా ఆత్మలో ఉన్నావు. నేను నీ రూపంలో తయారయ్యాను. నీ నిత్యయవ్వనము, శక్తి, అమరత్వం మరియు ఆనందంతో ప్రకాశించేలా నా శరీరాన్ని, మనస్సును ఆత్మను దీవించు.”

మీ జీవితాన్ని ఎక్కువ శక్తితో నింపడం గురించి మరియు పరమహంసగారు పైన పేర్కొన్న శక్తిపూరణ వ్యాయామాల గురించి మరింతగా తెలుసుకోవడానికి, దివ్య ప్రణయం పుస్తకంలోని “జీవశక్తి రహస్యం” అనే సారాంశాన్ని చదవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

ఇతరులతో పంచుకోండి