ఆత్మ-ప్రేరిత దివ్యసంకల్పాలు మీ జీవితాన్ని ఎలా మార్చగలవు అనే అంశంపై పరమహంస యోగానందగారు

17 మే, 2024

ఒక పరిచయం:

దివ్యసంకల్పాలు అంటే ఏమిటి? ఇది ఒక పిచ్చి ప్రశ్నలా అనిపించవచ్చు, కాని సానుకూల దృక్పథం మరియు ఆరోగ్యకర శ్రేయస్కరమైన భావాన్ని ఏర్పరచుకోవడంలో తనను తాను కేంద్రీకరించుకోవడానికి, ఎంతో విస్తృతంగా ఉపయోగించబడి మరియు ప్రశంసించబడుతున్న దివ్యసంకల్పాలు ఒక సాధనంగా మారాయి.

కాని పరమహంస యోగానందగారు — 1924లో తన ఉపన్యాసాలు మరియు తరగతుల్లో దివ్యసంకల్పాలను పరిచయం చేసినప్పటి నుండి — దివ్యసంకల్పాలు అనే అంశంపై లోతైన విజ్ఞానాన్ని అందిస్తున్నందున, ఎప్పటికప్పుడు ఈ క్రింది విధంగా అడగడం బోధపడుతుంది: “దివ్యసంకల్పాలు అంటే నిజంగా ఏమిటి? అవి శక్తిని ఎలా ఇస్తాయి? శరీరం, మనస్సు మరియు ఆత్మలో నా స్వీయ ఉన్నతిని మరియు సంపూర్ణతను అనుభవించడానికి, అవి నాకు ఎంత వరకు సహాయం చేయగలవు?” మరియు బహుశా మరింత ముఖ్యమైనది: “నేను వాటిని నా ఆధ్యాత్మిక సాధనలో ఇంకా ఎక్కువగా ఎలా చేర్చగలను?”

పరమహంసగారు ఇలా చెప్పారు: అలవాటుగా చేసే ప్రార్థనల కన్నా దివ్యసంకల్పాలు ఉత్తమమైనవి. ఆత్మకు, ఇప్పటికే తాను కలిగి ఉన్న దానిని గురించి, మరపు వల్ల తాత్కాలికంగా కోల్పోయిన దానిని గురించి దివ్యసంకల్పం గుర్తు చేస్తుంది. దివ్యసంకల్పాలు సర్వశక్తివంతమైన సత్యతా వచనాలు, అవి యాచించే ప్రార్థనల కన్నా చాలా భిన్నమైనవి. యాచించేవారు దివ్యపిత నుండి వారికి కావలసినది పొందడం చాలా అరుదు. కాని దైవానుసంధానంతో తనను సంస్కరించుకున్న వ్యక్తి ‘దైవ పుత్రుడ’ ననే నూతన స్పృహతో ప్రవర్తిస్తాడు; దివ్యసంకల్పాల సహాయంతో, సృజనాత్మక స్పందన (ప్రకంపన) యొక్క విశ్వ నియమాలను ప్రయోగించి తాను ఏది కోరినా పొందగలుగుతాడు.

పరమహంసగారు చెప్పిన సత్యంతో కూడిన విషయమేమిటంటే దివ్యసంకల్పాల వల్ల శక్తి లభిస్తుంది, మనలో ప్రతి ఒక్కరూ — మనం ఒంటరివారమని ఎంతగా భావించినా లేదా మనల్ని మనం అవగాహన చేసుకున్నా — వాస్తవానికి “దేవునితో విడదీయరాని ఐక్యత” ఉన్నట్లుగా అవగతమవుతుంది.

క్రమంగా మనం దివ్యసంకల్పాల ద్వారా సహజావబోధాత్మకమయిన, ఆత్మ యొక్క నిత్యమైన, దివ్యానంద చైతన్యమైన అధిచేతనతో సంపర్కం పొందినప్పుడు మనం ఆ ఏకత్వాన్ని మరింతగా అనుభవిస్తాము — మరియు ఆ దివ్యమైన అవగాహన మరియు భరోసాను మన జీవితాల్లో వ్యక్తం చేయగలము. ఈ నెలలోని వార్తాలేఖతో, మీరు పరమహంసగారి నుండి పొందిన ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలరని మేము ఆశిస్తున్నాము.

క్రింద ఉన్న పరమహంసగారి జ్ఞానాన్ని మరియు మా “దివ్యసంకల్పాలు” పేజీలో ఉన్న సమాచారాన్ని గ్రహించి మీరు ఆచరిస్తారని మేము ఆశిస్తున్నాము.

పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:

భగవంతుని పరిపూర్ణమైన ఆలోచనలు ఈ విశ్వాన్ని సృష్టించి, దానిని సమతుల్యంగాను, లయబద్ధంగాను ఉంచుతున్నట్టే, ఆయన సంతానం యొక్క సముచితమైన ఆలోచనలు సరియైన విధంగా ఉచ్చరించిన మాటలు లేదా దివ్యసంకల్పాలుగా వ్యక్తం చేసినప్పుడు, వాటికి అనుగుణంగా ఉన్న లయబద్దమైన సూక్ష్మాకాశ స్పందనలను విశ్వంలోనూ, వాటిని ఉచ్చరించిన వ్యక్తిలోనూ నెలకొలుపుతాయి. తిరిగి, ఈ సృజనాత్మక స్పందనలు కావలసిన విధంగా పరిస్థితులను సమన్వయం చేసి, కోరిన ఫలితం రావడానికి అవసరమైన శక్తులను ఉత్తేజపరుస్తాయి.

నిజాయతీ, దృఢనమ్మకం, విశ్వాసం, సహజావబోధంతో సంపూర్ణంగా నిండిన మాటలు అత్యంత విస్ఫోటక ప్రకంపన బాంబుల వంటివి; వాటిని పేల్చినప్పుడు, కష్టాలనే రాళ్ళను ముక్కలు చేసి, కోరుకున్న మార్పును కలిగిస్తాయి.

జాగ్రదావస్థలో ఉన్న మనస్సుతో చేసే దివ్యసంకల్పాలన్నీ అవచేతనలోకి వ్యాపించడానికి తగినంత గాఢంగా హత్తుకునేవిగా ఉండాలి, తిరిగి అవి తమంత తాముగానే చేతనా మనస్సును ప్రభావితం చేస్తాయి. సచేతనంగా చేసే బలమైన దివ్యసంకల్పాలు ఆ విధంగా అవచేతన అనే మాధ్యమం ద్వారా మనస్సు, శరీరాలపై ప్రభావం కలిగిస్తాయి. ఇంకా బలమైన దివ్యసంకల్పాలు అవచేతననే కాకుండా అద్భుతశక్తులకు నిలయమైన అధిచేతన మనస్సును కూడా చేరుకుంటాయి.

స్పష్టమైన అవగాహనతోను గాఢమైన ఏకాగ్రతతోను పలికే ఏ మాటకైనా ఫలించే శక్తి ఉంటుంది….ధ్వనికున్న అనంతమైన శక్తులు, ఓం అనే సృజనాత్మక శబ్దం లోంచే ఉద్భవిస్తాయి. అణుశక్తులన్నిటికీ వెనుకనున్న విశ్వస్పందనశక్తి ఈ ఓంకారమే. ధ్యానం మరియు అధిచేతన జ్ఞానంలో ఆ అద్భుతమైన ఓంకార ప్రకంపనతో మనస్సు అనుసంధానం పొందినప్పుడు ఈ సూత్రం యొక్క పూర్తి శక్తిని వినియోగించుకోవచ్చు.

నిజాయతీ నిండిన మాటలు లేదా దివ్యసంకల్పాలను అవగాహనతో, అనుభూతితో, దృఢసంకల్పంతో మళ్ళీ మళ్ళీ ఉచ్చరించినప్పుడు, మీ కష్టాలలో సహాయాన్ని అందించేందుకు సర్వవ్యాప్తమైన విశ్వస్పందనశీల శక్తిని నిశ్చయంగా కదిలించగలవు. సందేహాలన్నిటినీ విడిచిపెట్టి, అనంతమైన విశ్వాసంతో ఆ శక్తికి మనవి చేయండి; లేకపోతే మీ ఏకాగ్రత అనే బాణం గురి తప్పిపోతుంది.

ఆలోచనలు మంచి ఫలితము ఇవ్వాలంటే ముందుగా వాటిని బాగా అర్థం చేసుకుని, సరైన విధంగా ఉపయోగించాలి. ఆలోచనలు జీర్ణంకాని ముడిసరుకు వలె మానవుడి మనస్సులో ప్రవేశిస్తాయి; వాటిని బాగా మననం చేసి జీర్ణించుకోవాలి. ఆత్మ యొక్క దృఢ నిశ్చయం ఆలోచన వెనుక లేనిదే, దానికి విలువ లేదు. అందుచేతనే దివ్యసంకల్పాలకు ఆధారమైన సత్యమును — మానవునికి భగవంతునితో గల విడదీయరాని ఐక్యతను — గ్రహించని వ్యక్తులు, దివ్యసంకల్పాలు ఉపయోగించి మంచి ఫలితములు సాధించలేక ఆలోచనలకు రోగ నివారణ చేసే శక్తి లేదని నిందిస్తారు.

ముందు బిగ్గరగా, తరువాత గుసగుసగా, చివరకు కేవలం మానసికంగా ఈ దివ్యసంకల్పం చెయ్యండి: “తండ్రీ, నీవు నేను ఒకటే.” దైవంతో ఏకత్వాన్ని మీరు అనుభూతి చెందేవరకూ చేతనా మనస్సు యొక్క బుద్ధి గ్రాహ్యతగా మరియు అవచేతన యొక్క ఊహగా మాత్రమే కాక, ఒక అధిచేతనా దృఢవిశ్వాసంగా అనుభూతమయ్యే వరకు, ఈ దివ్యసంకల్పాన్ని పునశ్చరణ చెయ్యండి. దివ్యసంకల్పంలోని మాటలను అతీంద్రియ గ్రాహ్యత యొక్క ప్రజ్ఞా జ్వాలలలోకి కరిగిపోనివ్వండి. జ్వలిస్తున్న ఆ ఆత్మపూర్వక దివ్యసంకల్పాలను మీ ప్రశాంత, నిశ్చల, స్థిర విశ్వాసమనే మూసలోకి పోయండి. అక్కడ మీ మాటలనే ముడి పదార్థం ఆ విశ్వనాథుడి చరణాల వద్ద సమర్పించదగిన ధగధగ మెరిసే సువర్ణ పుష్పమాలగా మారుతుంది.

1940లో కాలిఫోర్నియాలోని ఎన్సినీటస్ లో “దివ్యసంకల్పాలతో మీ అవచేతన మనస్సులో సానుకూల ఆలోచనలను స్థిరపరచుకోవడం” అనే అంశం గురించి పరమహంస యోగానందగారు చేసిన ప్రసంగంలోని సారాంశాన్ని వై.ఎస్.ఎస్. బ్లాగ్ లో కూడా మీరు చదవవచ్చు. అనిశ్చితి మరియు కష్టాలను అధిగమించడంలో, మీకు సహాయపడటానికి దివ్యసంకల్పాలు ఒక శక్తివంతమైన సాధనంగా ఎలా ఉండవచ్చనే దానిపై మరింత జ్ఞానాన్ని గ్రహించండి — మరియు అంతిమంగా దివ్యమైన పరమానందాన్ని సాక్షాత్కరించుకోండి.

ఇతరులతో పంచుకోండి